చంఢీగడ్ : బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బాలాకోట్ ఉగ్రదాడుల గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సన్నీ డియోల్ పంజాబ్‌లోని గురుదాస్పూర్ నుంచి బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సన్నీ డియోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలకోట్‌లో భారత వాయుసేన జరిపిన వైమానిక దాడుల గురించి తనకు ఎక్కువగా తెలియదన్నారు. అంతేకాక భారత్ - పాక్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు గురించి కూడా తనకు అంతగా అవగాహన లేదన్నారు. కానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. దేశానికి సేవ చేయాలని భావిస్తున్నట్లు సన్నీ డియోల్ తెలిపారు.
గురుదాస్పూర్ నుంచి మీరు విజయం సాధిస్తారా అని ప్రశ్నించగా.. ఏమో.. ప్రస్తుతానికి ఏం చెప్పలేనన్నారు సన్నీ డియోల్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మీద ప్రశంసల వర్షం కురిపించారు సన్నీ డియోల్. గత ఐదేళ్లుగా నరేంద్ర మోదీ దేశానికి చాలా సేవ చేశారని పొగిడారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తాను మోదీ ప్రజాదరణ మీద ఆధారపడనని స్పష్టం చేశారు సన్నీ డియోల్. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే.. తాను కూడా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటానని సన్నీ డియోల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment