విజయ్ గోఖలే
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద క్యాంపుపై భారత వాయుసేన జరిపిన దాడికి కారణాలను వివరించాల్సిందిగా పార్లమెంటరీ కమిటీ కేంద్రాన్ని కోరింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో విదేశీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఘటన తర్వాత భారత్, పాక్‌ల మధ్య చోటుచేసుకున్న సంఘటనలను విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం వివరిం చారు. ఈ సందర్భంగా బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన దాడి ఘటనను, ఆ తర్వాత పాకిస్తాన్ జెట్ విమానాలు భారత భూభాగంలోకి వచ్చిన అంశాన్నీ చెప్పారు.
భారత్‌లోని మిలటరీ స్థావరాలపై దాడికి పాకిస్తాన్ వాయుసేన ప్రయత్నిం చిందని, అయితే భారత్ ఆ దేశ విమానాలను చాకచక్యంగా తిప్పికొట్టిందని తెలిపారు. ఆ విమానాలను వెనక్కి పంపే క్రమంలో భారత్‌కు చెందిన ఓ విమానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. పాక్‌లోని ఉగ్రవాద క్యాంపుపై దాడి చేయ డానికి గల కారణాలు చెప్పాలని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, ఈ విషయంలో రక్షణశాఖ సరైన సమాధానం చెప్పగలదని గోఖలే పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇస్లామిక్ సమాఖ్య సభ్య దేశాలు ఈ విషయంలో భారత్‌కు మద్దతివ్వడాన్ని ఈ సందర్భంగా చెప్పారు. ఐఏఎఫ్‌తో పాటు భద్రతా బలగాలను కమిటీ సభ్యులు కొనియాడారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్‌ను ఎంతో ఘనమైన, పరాక్రమమైన దాడిగా అభివర్ణించారు.
పాక్ కాల్పుల ఉల్లంఘన.. ముగ్గురు దుర్మరణం
జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ వరుసగా 8వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడింది. మోర్టార్ షెల్స్‌తో దాడికి తెగబడింది. దీంతో పూంచ్ జిల్లా సలోట్రి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాక్ రేంజర్ల దాడిలో రుబానా కోసర్(24), ఆమె కుమారుడు ఫజాన్(5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె షబ్నమ్ చనిపోయినట్లు తెలిపారు.
ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్ గాయాలతో బయటపడ్డాడని వెల్లడించారు. పాక్ జరిపిన మోర్టార్ల దాడితో పూంచ్ జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యా యని పేర్కొన్నారు. అంతకుముందు పాక్ కాల్పుల్లో నసీమ్ అక్తర్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు. పాక్ రేంజర్ల దాడిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని తెలిపారు. గత వారం రోజు ల్లో పాక్ 60 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఎల్వోసీకి 5కి.మీ పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటిని మూసివేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. గతేడాది పాక్ 2,936 సార్లు కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.
ఓ సరిహద్దు గ్రామంలో పాక్ మోర్టార్లు దాడిలో ధ్వంసమైన ఇల్లు
వీరుడి తల్లిదండ్రులకు జేజేలు...
న్యూఢిల్లీ: మృత్యువు ముంచుకొస్తోందని తెలిసినా కళ్లల్లో ధీరత్వం, అల్లరి మూక చావబాదుతున్నా స్థిరచిత్తంతో కూడిన మనో నిబ్బరం, మన దేశ రహస్యాలు శత్రువులకు చిక్కకూడదని డాక్యుమెంట్లు, మ్యాప్‌లు నమిలి మింగేసే సాహసం.. ఎంత మంది ఇలా చేయగలరు ? పాకిస్తాన్ చెరలో ఉన్న వైమానిక పైలట్ అభినందన్ వర్ధమాన్ నిజమైన హీరో. ఆ వీరుడి తల్లిదండ్రులకు ఢిల్లీ విమానాశ్రయంలో తోటి ప్రయాణికులు జేజేలు పలికారు. చెన్నై నుంచి బయల్దేరిన విమానం గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రాజధాని ఢిల్లీ చేరుకుంది.
కన్న కొడుక్కి స్వాగతం పలకడానికి వాఘా సరిహద్దుకు వెళ్లేందుకు అభినందన్ తల్లిదండ్రులు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్, డాక్టర్ శోభ వర్ధమాన్‌లు ఆ విమానంలోనే ప్రయాణించారు. ఢిల్లీలో వారు విమానం దిగే ముందు తోటి ప్రయాణికులంతా గౌరవసూచకంగా లేచి కరతాళ ధ్వనులతో వర్ధమాన్ దంపతులే మొదట దిగడానికి దారిచ్చారు. వారు విమానంలో నడుస్తుంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. తామే తొందరగా దిగాలని, లగేజీని తీసుకోవాలనే ఆత్రుత ప్రయాణికుల్లో కనిపించలేదు. కొందరు యువతీ యువకులు అభినందన్ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కారాలు చేశారు. మరికొందరు వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
వాయు మార్గంలో కుదరదు: పాక్
న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను అత్తారీ–వాఘా సరిహద్దులో కాకుండా వాయు మార్గంలో అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన తరువాత, ఆయన్ని వాయు మార్గంలో అప్పగించాలని భారత్ కోరింది. కానీ అభినందన్‌ను రోడ్డు మార్గం ద్వారా అత్తారీ–వాఘా సరిహద్దులోనే అప్పగిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ అంగీకరిస్తే అభినందన్‌ను తీసుకొచ్చేం దుకు ప్రత్యేక విమానం పంపాలని రక్షణ శాఖ ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. మిగ్ విమానం కూలిపోయి పాకిస్తాన్ చెరలో ఉన్న మన పైలట్ అభినందన్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి.. ఇస్లామాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకురావడం. రెండోది..వాఘా సరిహద్దులో స్వాగతం పలకడం. రెండో మార్గంలో అయితే వాఘా సరిహద్దులో జనసందోహాన్ని నియంత్రించడం కష్టమవుతుందని, మీడియా కంటపడకుండా అభినందన్‌ను విమానంలో తీసుకురావడమే ఉత్తమమని భారత్ భావించింది. ఇదే విషయమై పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment