మేడిన్‌ ఆంధ్రా బ్రాండింగ్‌..ఎగుమతుల్లో జోష్‌ | Measures Taken By Government Increase State Exports | Sakshi
Sakshi News home page

మేడిన్‌ ఆంధ్రా బ్రాండింగ్‌..ఎగుమతుల్లో జోష్‌

Published Sun, Jan 8 2023 4:39 AM | Last Updated on Sun, Jan 8 2023 10:34 AM

Measures Taken By Government Increase State Exports - Sakshi

సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఉన్న మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ఎగుమతులను పెంచే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో మేడిన్‌ ఆంధ్రా బ్రాండ్‌కు ప్రచారం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులను గుర్తించి, ఆ దేశాల్లో మరింతగా విస్తరించడానికి కావాల్సిన నాణ్యతా ప్రమాణాలను ఏ విధంగా పాటించాలన్నదానిపై ఎగుమతి­దా­రు­లకు అవగాహన కల్పిస్తుండటంతో గత మూడేళ్లలో రాష్ట్ర ఎగుమతులు 50 శాతం మేర వృద్ధి చెందాయి.

తొలిసారి 2019–20లో రూ.లక్ష కోట్లు దాటిన రాష్ట్ర ఎగుమతులు.. మూడేళ్లు గడిచేసరికి రూ.లక్షన్నర కోట్ల మార్కును అందుకుంటున్నాయి. 2019–20లో రూ.1,04,829 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులు 2020–21లో రూ.1,24,744, 2021–22లో రూ.1,43,843 కోట్లుగా నమోదయయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నాటికి రాష్ట్రం నుంచి రూ.93,938 కోట్ల విలువైన ఎగుమతులు జరగ్గా, మార్చి నాటికి ఈ విలువ లక్షన్నర కోట్లకు అధిగమిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎగుమతుల్లో కీలకమైన క్వాలిటీ సర్టిఫికెట్‌పై అవగాహన కల్పిస్తుండటంతో ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. 2020–21లో కూరగాయలు, పండ్లు ఎగుమతుల విలువ రూ.12,160.24 కోట్లుగా ఉంటే.. ప్రభుత్వ చర్యలతో ఆ తర్వాత రూ.14,060.14 కోట్లకు చేరింది. అలాగే ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.8,286.21 కోట్ల నుంచి రూ.12,777.56 కోట్లకు పెరిగింది.

జిల్లాల వారీగా ఉత్పత్తుల ఎంపిక
రాష్ట్రంలో ఎగుమతులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 2021లో వాణిజ్య ఉత్సవ్‌ సందర్భంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 26 జిల్లాలకు విడివిడిగా ఎక్స్‌పోర్ట్‌ యాక్షన్‌ ప్లాన్‌ను తయారు చేసి, ఎగుమతులను పెంచే విధంగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఒక ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులను గుర్తించి, వాటిని మరింతగా ఎగుమతి చేసే విధంగా వివిధ దేశాల్లోని కొనుగోలుదారులతో చర్చలు జరపడం ద్వారా మార్కెట్‌ను విస్తృత పరుస్తోంది. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా కొబ్బరి పీచు, జీడిపప్పు, నర్సరీ ఉత్పత్తుల ఎగుమతిలో ముందంజలో ఉంది. ఈ జిల్లా నుంచి దిగుమతి చేసుకునే దేశాలను గుర్తించి, అక్కడ మార్కెట్‌ అవకాశాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

ఇందులో భాగంగా యూఏఈ, ఇజ్రాయిల్, కువైట్, వియత్నాం రాయబారులతో నేరుగా చర్చలు జరిపి ఎగుమతి అవకాశాలను ప్రోత్సహించడం సత్ఫలితాలు ఇచ్చింది. 2020–21లో వియాత్నంకు రూ.2,262.58 కోట్లుగా ఉన్న ఎగుమతుల విలువ ఈ చర్చల తర్వాత 2021–22లో రూ.3,833.08 కోట్లకు చేరింది. యూఏఈకి ఎగుమతులు రూ.2,941.04 కోట్ల నుంచి రూ.5,099.24 కోట్లకు చేరాయి. ముఖ్యంగా ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన ఉత్పత్తులను గుర్తించి వాటికి జీయోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ (జీఐ) గుర్తింపు తీసుకువచ్చి, నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేసే విధంగా ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం గతంలో మూత పడిన ఏపీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌(ఏపీటీపీసీ)ను పునరుద్ధరించి ఎగుమతులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకునే బాధ్యతను అప్పగించింది.

రూ.30,000 కోట్లతో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం
ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖలో మేజర్‌ పోర్టుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 5 మైనర్‌ పోర్టులు.. గంగవరం, కాకినాడ యాంకర్‌ పోర్టు, కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు, రవ్వ క్యాపిటివ్‌ పోర్టు, కృష్ణపట్నం పోర్టులున్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్‌ రంగంలో కాకినాడ గేట్‌వే పోర్టు, రాష్ట్ర మారిటైమ్‌ బోర్డు ద్వారా రామాయపట్నం పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

త్వరలో మచిలీపట్నం, భావనపాడు పోర్టు పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఉన్న 5 మైనర్‌ పోర్టుల ద్వారా సగటున 100 మిలియన్‌ టన్నుల సరుకును రవాణా చేస్తుండగా, కొత్తగా నాలుగు పోర్టులు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పోర్టుల నిర్వహణ సామర్థ్యాన్ని 2030 నాటికి 300 మిలియన్‌ టన్నులకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో రామాయపట్నం పోర్టును డిసెంబర్‌ 2023 నాటికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న తొమ్మిది ఫిషింగ్‌ హర్బర్ల ద్వారా అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద రావడమే కాకుండా, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి అదనంగా రూ.1,000 కోట్లు వచ్చి చేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తీర ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.30,000 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. ఇదిలా ఉండగా కాకినాడ యాంకర్‌ పోర్టు నుంచి ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది.  

10 శాతం వాటా లక్ష్యం
రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో నాలుగు శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2030 నాటికి 10 శాతానికి పెంచాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్‌ లేదా పోర్టు ఉండే విధంగా నాలుగు కొత్త పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. ఇదే సమయంలో పోర్టులను అనుసంధానిస్తూ మౌలిక వసతులు, మల్టీ మోడల్‌ లాజిస్టిక్ట్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఎగుమతుల వృద్ధి ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయంతో పాటు వేలాది మందికి ఉపాధి లభించనుంది.
– గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

విదేశీ మార్కెట్‌ విస్తరణపై దృష్టి
ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులను ఆయా దేశాలు ఇంకా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.. పక్క దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకావాలున్నాయా.. అన్న అంశాలను పరిశీలించి డేటాను క్రోడీకరిస్తున్నాం. ఇతర దేశాలతో పోటీపడుతూ ఆ దేశాల మార్కెట్‌కు విస్తరించడానికి ఎటువంటి మౌలిక వసతులు మెరుగుపర్చుకోవాలి.. ఇందుకోసం ఎటువంటి పథకాలను అమలు చేయాలన్న అంశాలను పరిశీలించి జిల్లాలు, ఉత్పత్తి ఆధారంగా కార్యచరణ ప్రణాళికను తయారు చేస్తున్నాం. విదేశాలతో పోటీ పడటానికి క్వాలిటీ సర్టిఫికేషన్‌పై ఎగుమతిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే తూర్పుగోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఈ కార్యచరణ ప్రణాళిక పూర్తయ్యింది. త్వరలో మిగిలిన జిల్లాలకు సంబంధించి పూర్తి చేయనున్నాం.
– జి.సృజన, డైరెక్టర్, పరిశ్రమల శాఖ

ఈ కామర్స్‌ సంస్థలపై దృష్టి
ప్రతి జిల్లా నుంచి ఎగుమతి అవకాశాలు ఉన్న ఉత్పత్తులను గుర్తించి, 2025 నాటికి ఎగుమతి లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. జిల్లా పారిశ్రామిక అధికారులు, ఏపీటీపీసీ అధికారులను సమన్వయం చేస్తూ రాష్ట్రంలోని ఎగుమతిదారులను గుర్తించి వారిని ట్రేడ్‌ పోర్టల్‌కు అనుసంధానం చేస్తున్నాం. అంతర్జాతీయంగా ఆన్‌లైన్‌ దిగ్గజ ఈకామర్స్‌ సంస్థలను గుర్తించి, వారి ఉత్పత్తులను ఇక్కడ నుంచి సరఫరా చేసే విధంగా లాజిస్టిక్‌ సప్లై చైన్స్‌ ఏర్పాటు చేసే విధంగా చర్చలు జరుపుతున్నాం.
– జీఎస్‌ రావు, జాయింట్‌ డైరెక్టర్‌ (ఎక్స్‌పోర్ట్స్‌)

20 నుంచి 9వ ర్యాంకుకు వృద్ధి
ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎగుమతుల వాణిజ్య పరిమాణం పెరగడమే కాకుండా, ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లోనూ బాగా మెరుగుపడింది. నీతి ఆయోగ్‌ ఏటా ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకులను ప్రకటిస్తుంది. ఎగుమతులు పెంచుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, సాధిస్తున్న ఫలితాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకులు నిర్ధారిస్తారు. 2020 సంవత్సరానికి నీతి ఆయోగ్‌ రూపొందించిన ఎగుమతుల సన్నద్ధత సూచీ 2020లో రాష్ట్రం 20వ స్థానంలో ఉండగా, 2021లో 9వ ర్యాంకుకు ఎగబాకింది. ప్రభుత్వ కృషి వల్ల ఎగుమతుల సన్నద్ధత సూచీలో ఏటా ఏపీ ర్యాంకు మెరుగు పడుతోందని నిపుణులు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement