ఉద్యమ స్ఫూర్తి సన్నగిల్లుతోంది
Published Sun, Jul 24 2016 9:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. కోట్లు కుమ్మరించడం ప్రజాస్వామ్యానికి విఘాతం
విద్యారంగాన్ని శాసిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రఘురామిరెడ్డి గుంటూరులో ముగిసిన ఏపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల్లో ఉద్యమస్ఫూర్తి సన్నగిల్లుతోందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రఘురామిరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు నగరం లాడ్జి సెంటర్‌లోని ఎల్‌ఈఎం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగిన ఏపీటీఎఫ్ రాష్ట్ర 18వ విద్యా, వైజ్ఞానిక రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రై వేటు విద్యాసంస్థల ధాటికి ప్రభుత్వ విద్యారంగం కుదేలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యారంగాన్ని శాసిస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం సాధారణ ఎన్నికల మాదిరిగా రూ. కోట్లాది ఖర్చు చేయాల్సి విధంగా మారిపోయాయని, ఇది ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసే విషయమన్నారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం తగదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం లక్షా 70 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్‌తో రాబోయే పదేళ్ళలో వారి సంఖ్య 50 వేలకు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఉద్యమాలే ఊపిరిగా కొనసాగుతున్న ఏపీటీఎఫ్ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు ఉద్యమబాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వరప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంతో భవిష్యత్‌లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే పరిస్థితి ఉండబోదని అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తొమ్మిది బిల్లులను సిద్ధం చేస్తోందని, ఇదే జరిగితే విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రై వేటు పరమయ్యే ప్రమాదముందన్నారు. ఈసందర్భంగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పరమేశ్వరరావు, ఉపాధ్యక్షులు శ్యాం సుందర్ రెడ్డి, సీహెచ్ మంజుల, కార్యదర్శులు బాలకష్ణ, సరస్వతి, ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు జిలానీ, జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు, ప్రధాన కార్యదర్శి ఎస్‌డీ చాంద్ బాషా, వివిధ జిల్లాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement