ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ విధులు పురమాయించడంలో సంబంధిత అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. జిల్లాలో ఎన్నికల విధుల బాధ్యతల పురమాయింపు నిక్ సెంటర్ కోఆర్డినేటర్ శర్మ పరిధిలో ఉంటుంది. అయితే ఆయన ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి మినహాయింపు ఇవ్వాల్సిన అంధులు, వికలాంగులు తదితరులకు ఎలక్షన్ డ్యూటీ వేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్కో పోలింగ్ బూత్‌లో పోలింగ్ అధికారి, మరో ఐదుగురు ఉద్యోగులను నియమించాల్సి ఉండగా సిబ్బంది కొరత చూపుతూ పోలింగ్ అధికారి, మరో నలుగురు ఉద్యోగులను మాత్రమే వేయటంతో పనిఒత్తిడి తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లాలో 3,411 పోలింగ్ స్టేషన్లు
జిల్లాలో 3,411 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో విధులు నిర్వహిం చేందుకు 16 మంది నోడల్ అధికారులను, 15 మంది రిటర్నింగ్ అధికారులను, 48 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను 334 మంది సెక్టార్ అధికారులను, 3,411 మంది పాటు బూత్ స్థాయి అధికారులను నియమించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు నలుగురు ఉద్యోగులను నియమించారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో సుమారు 1,450 మంది ఓటర్లు రెండు ఓట్లు వేస్తారు. అంటే ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో 2,900 ఓట్లు పడనున్నాయి. విధి నిర్వహణ మరింత కష్టమౌతుందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు మరో ఉద్యోగిని నియమించాలని కోరుతున్నారు.
గంట కూడా విరామం లేకుండా..
అధికారులు చెప్పిన దాని ప్రకారం పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు కనీసం భోజనానికి కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వారు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంటుంది.
నిక్ సెంటర్ కోఆర్డినేటర్‌పై ఉద్యోగుల ఆగ్రహం
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అంధులకు, వికలాంగులకు, గర్భిణులకు, 6 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఎన్నికల విధులు వేయకూడదు. కానీ నిక్ సెంటర్ కోఆర్డినేటర్ శర్మ మాత్రం తన ఇష్టానుసారం విధులు వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల విధులు కేటాయించిన వారిలో పై కేటగిరీల ఉద్యోగులు కూడా ఉన్నారు. దీనిపై సదరు అధికారిని ప్రశ్నిస్తే సిబ్బంది కొరత ఉన్నందున వారికి కూడా విధులు కేటాయించక తప్పడం లేదని అంటున్నారని వాపోతున్నారు. అన్ని అవయవాలూ సక్రమంగా ఉండి పూర్తి ఆరోగ్యంగా, వయసులో ఉన్న ఉద్యోగులు కూడా కొంతమందికి ఎన్నికల విధులు పడలేదని తెలుసుకుని ఇతర ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల విధుల నుంచి తప్పించుకోవాలనుకున్న ఉద్యోగులు సదరు అధికారిని నేరుగా కలిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఆయనను వ్యక్తిగతంగా కలిసిన వారిలో సుమారు 500 మందికి ఎన్నికల విధులు పడలేదంటున్నారు. నిబంధనల మేరకు సడలింపు ఉన్న వారికి డ్యూటీ పడితే వారు కలెక్టర్‌ను కలిసి మినహాయింపు కోరవచ్చు.
సడలింపు ఉన్నవారికి విధులు వేయరాదు
నిబంధనల ప్రకారం ఎలక్షన్ డ్యూటీకి సడలింపు వర్తించే వారికి ఎట్టి పరిస్థితిలోనూ డ్యూటీ వేయకూడదు. వారికి డ్యూటీ వేయడం, తిరిగి వారు కలెక్టర్‌ను కలిసి తమ ఇబ్బంది చెప్పుకోవడం సమయం తీసుకునే ప్రక్రియ. ఈ నెల 28 లోపు వారికి కలెక్టర్ అందుబాటులో లేకపోతే ఆ తేదీన వారికి నియోజకవర్గాలు కూడా కేటాయించేస్తారు. అప్పుడు సడలింపు ఇవ్వడం అస్సలు కుదరదు.
– షేక్ సాబ్జి, రాష్ట్ర అధ్యక్షుడు, యూటీఎఫ్
కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలి
రెండు ఎన్నికలూ ఒకేసారి ఉన్నప్పుడు సిబ్బందిని పెంచాల్సి ఉంది. సిబ్బంది కొరత ఉందని కొద్దిమందిని మాత్రమే నియమిస్తే వారిపై పనిభారం అధికమౌతుంది. అలాంటప్పుడు ప్రభుత్వమే జీతాలు ఇచ్చే కాంట్రాక్టు లెక్చరర్లు, విద్యా వలంటీర్లు, ఆశ వర్కర్లు, ఐఈఆర్‌పీ టీచర్లు వంటి వారిని కూడా ఎన్నికల విధుల్లోకి తీసుకుంటే, ఎన్నికలు సజావుగా ముగించవచ్చు.
– గుగులోతు కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment