'సంక్రాంతి వచ్చింది తుమ్మెద' 'సరదాలు తెచ్చింది తుమ్మెదా'.. అన్న పాటలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడ ఉన్నవాళ్లు కష్టపడి మరి తమ సొంతూళ్లకి వచ్చేస్తారు. ఎంత ఖర్చు పెట్టి అయినా పండుగకి ఊరు వెళ్లి పోవాల్సిందే. అక్కడ ఉండే సందడే వేరు. ముఖ్యంగా కోడిపందాలు, పిండి వంటలతో ఊరు ఊరంతా సందడి సందిడిగా ఉంటుంది. ఈ పండుగల్లో మంచి ఆకర్షణగా కనిపించేవి ముగ్గులు. వచ్చిరాని పడుచులు సైతం ఏదో రకంగా ముగ్గు వేసి శభాష్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతుంటారు. అసలు ఈ నాలుగు రోజుల పండుగల్లో కచ్చితంగా రకరకాల రంగవల్లులతో ముగ్గులు పెడతారు ఎందుకని? దీని వెనుక దాగున్న రహస్యం ఏంటీ?
వాస్తవానికి సాధారణ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇలా ముగ్గులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సును తెస్తాయని పెద్దల నమ్మకం. పైగా లక్ష్మీ దేవిని ముచ్చటపడి ఇంట్లోకి వస్తుందని, ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం.
ముగ్గు ప్రాముఖ్యత..
హిందూసంప్రదాయంలో ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉంది. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గుల్లో తామర పువ్వు, పూల ఆకారాలు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత, దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తారు. ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి దేవతల చిత్రాలను, లక్ష్మీ దేవి పాద చిహ్నాలను గీస్తారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఇలా ముగ్గులు వేస్తారు. అయితే చరిత్ర మాత్రం చెడున అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశ్యంతో తెల్లటి బియ్యపిండితో ముగ్గు వేస్తారని చెబుతోంది.
ఇది శరీరానికి మంచి ఫిట్‌నెస్ లాంటిది కూడా..
ఓర్పును నేర్పే కళ… ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ల ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‌సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.
భోగి నాడు వేసే ముగ్గు ఇష్టంతో కూడిన కష్టం!
పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.
శాస్త్రీయ కారణాలు..
చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్‌ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది.
విశ్వకవి రవీంద్రుడు సైతం ముగ్గు గురించి ప్రస్తావించారు!
అంతేకాదండోయ్ రవీంద్రనాథ్ ఠాగోర్ 1919 లో రాసిన 'బంగ్లర్ బ్రత' అనే పుస్తకంలో వ్రతం, పూజ విధానాలలో 'అల్పన' (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిపన్' మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు. ఇక ఈ ముగ్గులు వేయడం అనేది కేవలం దక్షిణాదికే పరిమితం కాదని భారతదేశం అంతటా ఈ ముగ్గులు వేయడం అనేది వారి సంస్కృతిలో భాగం అని పరిశోధకులు కూడా పేర్కొన్నారు. అంతేగాదు కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో నృత్యం, సంగీతం, తలపాగాలు చుట్టడం, పూల మాలలు అల్లడం, వంటలు, అల్లికలతో పాటు ముగ్గులు వేయడాన్ని కూడా ఒక కళగా పేర్కొన్నారని చెప్పారు. అంతటి ప్రాశస్యం గల ఈ ముగ్గులను రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్ది కలర్‌ఫుల్‌గా జోయ్‌ఫుల్ చేసుకోండి ఈ సంక్రాంతి పండుగని.
(చదవండి: భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?)
Comments
Please login to add a commentAdd a comment