ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంబరంగా జరపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు...కొత్త అల్లుళ్లు ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. దక్షిణ భారతదేశంలో పొంగల్‌ను నాలుగు రోజుల పాటు జరుపు కుంటారు, నాలుగు రోజుల ఈ వేడుకలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. సంక్రాంతి సంబరాల్లో తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు.ఈ భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు.
సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగి: భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలు తొలిగిపోవాలంటూ అగ్ని దేవుడికి భోగి మంట సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకోవడమే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. తెల్లవారుఝామున నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు తద్వారా చీడ పీడలు దోషాలు, తొలగిపోతాయని విశ్వాసం. భోగి అంటేనే భోగి మంటలు కదా.
పాతకు బై ..బై... కొత్తకు ఆహ్వానం
ఆవు పేడతో చేసిన పిడకలతో తెల్లవారుఝామునే భోగి మంటలు వేయడం అలవాటు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. ఈ ఆవు పిడకలను రకరకా పేర్లతో పిలుచుకుంటారు. ఇంకా మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. పాతను వదిలిపెట్టి, సరికొత్తమార్గంలోకి పయనించాలనేదే దీనర్ధం పరమార్థం. ముఖ్యంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ. అలాగే భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. సాయంత్రం ఇంట్లోని చిన్న పిల్లలకు ముచ్చటగా భోగి పళ్లు పోసి, పేరంటాళ్లను పిలుచుకొని వేడుక చేసుకుంటారు.
భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంవైపు, మకర రాశిలోకి అడుగుపెట్టిన సందర్భమే సంక్రాంతి సూర్యుడి పండుగ. ఏడాదిలో వచ్చే తొలి పండుగు. ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు చెబుతారు. సంక్రాంతికి పుణ్య దినం సందర్భంగా అడిగిన వారికి కాదనకుండా యధాశక్తి దానధర్మాలు చేయాలని భావిస్తారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు రైతుల ఇళ్లకు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలతో ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. అందుకే సంక్రాంతి రోజు మట్టి కుండలో కొత్త బియ్యం, బెల్లం,చెరకు కలిపి పొంగల్ చేస్తారు. ఈ పాలు ఎంత పొంగిపొర్లితే.. అంత సమృద్ధి , శ్రేయస్సును అని నమ్ముతారు.
అంతేనా సంక్రాంతి ఈ పండుగ కొత్తబట్టలు కావాల్సిందే. ఇంకా పెద్దలకు నైవేద్యాలు, పితృతర్పణ లాంటివి ప్రధానంగా చెప్పుకోవాలి. శని దోషాలు తొలగిపోవాలని, నల్లనువ్వులతో సూర్యుడికి పూజలు, పితృదేవతలందరికీ తర్పణలిస్తుంటారు. ఇక పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, నువ్వుండలు, సున్నుండలులాంటి స్వీట్లతోపాటు, జంతికలు చక్రాలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి.
సంక్రాంతి అంటే ముగ్గూ ముచ్చట
సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు . ప్రతీ ఇల్లూ రంగు రంగుల రంగువల్లలతో కొత్త పెళ్లి కూతురులా ముస్తాబవుతుంది. పల్లెల్లో అయితే ఎవరుఎంత పెద్ద ముగ్గు పెడితే అంత గొప్ప అన్నట్టు. దీనిపై బాపూ లాంటి గీతకారులు కార్లూన్లు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు సంక్రాంతిలో ముగ్గుల హడావిడి. గోదావరి జిల్లాల్లో గొబ్బెమ్మలతో కన్నెపిల్లలు, చిన్న పిల్లల ముచ్చట చూసి తీరాల్సిందే. ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మకి గుమ్మడి, మందార, బంతి, చామంతి పూలు పెట్టి పసుపూ కుంకాలతో అలంకరించి, తోటి స్నేహితులను పిలుచుకుని పాడుతూ వాటి చుట్టూ పాటలు పాడతారు. సుబ్బీ గొబ్బెమ్మా! మల్లెపువ్వంటీ మరదల్నివ్వవే, చామంతిపూవంటి చెల్లెల్నివ్వవే, మొగలీ పూవంటి మొగుణ్ణివ్వవే” అంటూ అమ్మాయిలు గొబ్బెమ్మలాడతారు. ఈ నెల రోజులూ గొబ్బెమ్మల సందడి ఉంటుంది. హరిలో రంగ హరీ అంటూ హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలు, జానపదుల జావళి సంక్రాంతి పండుగ. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా అందంగా తలలూపుతూ చేసే నృత్యాలు..అబ్బో.. ఈ దృశ్యాలన్నీ చాలా రమణీయంగా ఉంటాయి.
మూడో రోజు కనుమ: దీన్నే పశువుల పండుగ అని అంటారు. పశుపక్ష్యాదులకి గౌరవాన్ని సూచించే పండుగ వ్యవసాయ ఆధారమైన పల్లెల్లో పశువులే గొప్ప సంపద. రైతుకు ఎంతో ఆదరువు. చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు పశువులకు చక్కగా అలకరించుకుంటారు. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. గాలిపటాలు ఎగురవేస్తూ సరదాగా గడుపుతారు
ముక్కనుమ:నాలుగో రోజైన ముక్కనుమ సంక్రాంతికి ముగింపు అనిచెప్పవవచ్చు. శాకాహారులు వివిధకూరగాయలో ముక్కల పులుసు చేసుకుంటూ, మాంసాహారులు నాన్‌వెజ్ వంటకాలతో విందు చేసుకుంటారు. ముక్కనమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును కరినాళ్ అని పిలుస్తారు.
పేరేదైనా.. సంబరం ఒకటే!
ఆచారాలు, సాంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంతో జరుపుకునే పండుగు సంక్రాంతి. పశ్చిమ బెంగాల్‌లో పౌషా సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, అస్సాంలో బిహు, గుజరాత్‌లోని ఉత్తరాయణ్, పంజాబ్‌లోని లోహ్రీ, అస్సాంలోని మాగ్ బిహు ఉత్సవాలు జరుపుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment