Makar Sankranti Festival
-
Happy Pongal 2024: సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన సినీ తారలు (ఫోటోలు)
-
మొగలిపువ్వంటీ మొగుడ్నీయవే : నాలుగు రోజుల ముచ్చట
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంబరంగా జరపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు...కొత్త అల్లుళ్లు ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. దక్షిణ భారతదేశంలో పొంగల్‌ను నాలుగు రోజుల పాటు జరుపు కుంటారు, నాలుగు రోజుల ఈ వేడుకలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. సంక్రాంతి సంబరాల్లో తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు.ఈ భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగి: భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలు తొలిగిపోవాలంటూ అగ్ని దేవుడికి భోగి మంట సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకోవడమే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. తెల్లవారుఝామున నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు తద్వారా చీడ పీడలు దోషాలు, తొలగిపోతాయని విశ్వాసం. భోగి అంటేనే భోగి మంటలు కదా. పాతకు బై ..బై... కొత్తకు ఆహ్వానం ఆవు పేడతో చేసిన పిడకలతో తెల్లవారుఝామునే భోగి మంటలు వేయడం అలవాటు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. ఈ ఆవు పిడకలను రకరకా పేర్లతో పిలుచుకుంటారు. ఇంకా మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. పాతను వదిలిపెట్టి, సరికొత్తమార్గంలోకి పయనించాలనేదే దీనర్ధం పరమార్థం. ముఖ్యంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ. అలాగే భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. సాయంత్రం ఇంట్లోని చిన్న పిల్లలకు ముచ్చటగా భోగి పళ్లు పోసి, పేరంటాళ్లను పిలుచుకొని వేడుక చేసుకుంటారు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంవైపు, మకర రాశిలోకి అడుగుపెట్టిన సందర్భమే సంక్రాంతి సూర్యుడి పండుగ. ఏడాదిలో వచ్చే తొలి పండుగు. ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు చెబుతారు. సంక్రాంతికి పుణ్య దినం సందర్భంగా అడిగిన వారికి కాదనకుండా యధాశక్తి దానధర్మాలు చేయాలని భావిస్తారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు రైతుల ఇళ్లకు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలతో ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. అందుకే సంక్రాంతి రోజు మట్టి కుండలో కొత్త బియ్యం, బెల్లం,చెరకు కలిపి పొంగల్ చేస్తారు. ఈ పాలు ఎంత పొంగిపొర్లితే.. అంత సమృద్ధి , శ్రేయస్సును అని నమ్ముతారు. అంతేనా సంక్రాంతి ఈ పండుగ కొత్తబట్టలు కావాల్సిందే. ఇంకా పెద్దలకు నైవేద్యాలు, పితృతర్పణ లాంటివి ప్రధానంగా చెప్పుకోవాలి. శని దోషాలు తొలగిపోవాలని, నల్లనువ్వులతో సూర్యుడికి పూజలు, పితృదేవతలందరికీ తర్పణలిస్తుంటారు. ఇక పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, నువ్వుండలు, సున్నుండలులాంటి స్వీట్లతోపాటు, జంతికలు చక్రాలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. సంక్రాంతి అంటే ముగ్గూ ముచ్చట సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు . ప్రతీ ఇల్లూ రంగు రంగుల రంగువల్లలతో కొత్త పెళ్లి కూతురులా ముస్తాబవుతుంది. పల్లెల్లో అయితే ఎవరుఎంత పెద్ద ముగ్గు పెడితే అంత గొప్ప అన్నట్టు. దీనిపై బాపూ లాంటి గీతకారులు కార్లూన్లు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు సంక్రాంతిలో ముగ్గుల హడావిడి. గోదావరి జిల్లాల్లో గొబ్బెమ్మలతో కన్నెపిల్లలు, చిన్న పిల్లల ముచ్చట చూసి తీరాల్సిందే. ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మకి గుమ్మడి, మందార, బంతి, చామంతి పూలు పెట్టి పసుపూ కుంకాలతో అలంకరించి, తోటి స్నేహితులను పిలుచుకుని పాడుతూ వాటి చుట్టూ పాటలు పాడతారు. సుబ్బీ గొబ్బెమ్మా! మల్లెపువ్వంటీ మరదల్నివ్వవే, చామంతిపూవంటి చెల్లెల్నివ్వవే, మొగలీ పూవంటి మొగుణ్ణివ్వవే” అంటూ అమ్మాయిలు గొబ్బెమ్మలాడతారు. ఈ నెల రోజులూ గొబ్బెమ్మల సందడి ఉంటుంది. హరిలో రంగ హరీ అంటూ హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలు, జానపదుల జావళి సంక్రాంతి పండుగ. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా అందంగా తలలూపుతూ చేసే నృత్యాలు..అబ్బో.. ఈ దృశ్యాలన్నీ చాలా రమణీయంగా ఉంటాయి. మూడో రోజు కనుమ: దీన్నే పశువుల పండుగ అని అంటారు. పశుపక్ష్యాదులకి గౌరవాన్ని సూచించే పండుగ వ్యవసాయ ఆధారమైన పల్లెల్లో పశువులే గొప్ప సంపద. రైతుకు ఎంతో ఆదరువు. చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు పశువులకు చక్కగా అలకరించుకుంటారు. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. గాలిపటాలు ఎగురవేస్తూ సరదాగా గడుపుతారు ముక్కనుమ:నాలుగో రోజైన ముక్కనుమ సంక్రాంతికి ముగింపు అనిచెప్పవవచ్చు. శాకాహారులు వివిధకూరగాయలో ముక్కల పులుసు చేసుకుంటూ, మాంసాహారులు నాన్‌వెజ్ వంటకాలతో విందు చేసుకుంటారు. ముక్కనమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును కరినాళ్ అని పిలుస్తారు. పేరేదైనా.. సంబరం ఒకటే! ఆచారాలు, సాంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంతో జరుపుకునే పండుగు సంక్రాంతి. పశ్చిమ బెంగాల్లో పౌషా సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, అస్సాంలో బిహు, గుజరాత్‌లోని ఉత్తరాయణ్, పంజాబ్‌లోని లోహ్రీ, అస్సాంలోని మాగ్ బిహు ఉత్సవాలు జరుపుకుంటారు. -
సాహితీ రంగవల్లికలు
ఇది ధనుర్మాసం. ముగ్గుల మాసం. మకర సంక్రాంతి వరకు ముంగిళ్లలో ముగ్గుల వ్రతాన్ని మహిళలు అప్రతిహతంగా కొనసాగిస్తారు. క్రీస్తుపూర్వం పదిహేనో శతాబ్ది ప్రాంతంలో ఆర్యులు అడుగు పెట్టే నాటికే, సింధులోయ నాగరికత పరిఢవిల్లిన చోట ముగ్గులు ఉండేవనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ లెక్కన ముగ్గులు పురాణాల కంటే ప్రాచీనమైనవి. కచ్చితంగా చెప్పుకోవాలంటే, వేదకాలం నాటివి. ముగ్గులు ఆదిమ చిత్రకళా రూపాలు. సింధులోయ ప్రాంతంలోనే కాదు... గ్రీకు, ఈజిప్టు శిల్పాల్లోనూ ముగ్గుల ఆనవాళ్లున్నాయి. ముగ్గులను సంస్కృతంలో రంగవల్లిక అంటారు. సౌరసేని ప్రాకృతంలోని ‘రంగౌలి’ అనే మాట నుంచి ఈ సంస్కృత పదం పుట్టింది. హిందీ, ఉర్దూల్లో ‘రంగోలి’ అంటారు. వాల్మీకి రామా యణంలోని యుద్ధకాండలో ‘ఏకశృంగో వరాహస్త్వం’ అనే వర్ణన ఉంది. సింధులోయ నాగరికత ప్రాంతంలో దొరికిన ముగ్గులలో ఒంటికొమ్ము వరాహరూపం ఈ వర్ణనకు సరిపోతుంది. అంతే కాదు, హరప్పా ప్రాంతంలో దొరికిన వాటిలో ఊర్ధ్వపుండ్రం, త్రిశూలం, అగ్నిగుండం, శివలింగం తదితర రూపాలలోని మెలికల ముగ్గులూ ఉన్నాయి. సున్నపురాతి నుంచి తయారుచేసిన ముగ్గుపిండితోనూ, వరిపిండితోనూ ముగ్గులు వేయడం ఇప్పటికీ అన్ని చోట్లా వాడుకలో ఉన్న ప్రక్రియ. పురాణకాలంలో కర్పూరంతో రంగవల్లులను తీర్చి దిద్దేవారట! నన్నయ మహాభారతం ఆదిపర్వంలో ‘అంగుళలనొప్పె కర్పూర రంగవల్లులు’ అని వర్ణించాడు. వారణావతంలోని లక్క ఇంట్లో ఉండటానికి కుంతీసమేతంగా పాండవులు వస్తున్న ప్పుడు వారికి స్వాగతం పలకడానికి వారణావతపుర వాసులు ఇంటింటా ముంగిళ్లలో కర్పూరంతో ముగ్గులు వేశారని నన్నయ వర్ణన. ‘చిత్రవర్ణాతిశయ నూత్న రత్న చిత్రి/తాంగ రంగవల్లి సురగాంగణముల’ అంటూ శివపురంలోని రంగురంగుల రంగవల్లులను నన్నెచోడుడు ‘కుమారసంభవం’లో వర్ణించాడు. సీతాదేవి చేత జనక మహారాజు ముగ్గులు వేయించాడట! ‘సంతానపరుడమ్మ జనక మహాముని/ తా ముద్దు కూతురిని తా జేరబిలిచి/ ఆవుపేడ తెచ్చి అయినిళ్లు అలికి/ గోవుపేడ తెచ్చి గోపురాలు అలికి/ ముత్యాలు చెడగొట్టి ముగ్గులేయించి’ అని జానపద గీతం ఉంది. ‘పలనాటి వీరచరిత్ర’లో శ్రీనాథుడు ముత్యాల ముగ్గులను వర్ణించాడు. ‘కస్తూరి చేతను కలియ గనలికి/ ముత్యాల తోడ ముగ్గులను బెట్టి/ కర్పూర ముదకంబు కలిపి ముంగిటన్’ అంటూ సంక్రాంతి సమయంలో ఆనాటి ముగ్గుల వేడుకను కళ్లకు కట్టాడు. క్రీడాభిరామంలో వినుకొండ వల్లభరాయడు ‘చందనంబున గలయంపి చల్లినారు/ మ్రుగ్గులిడినారు కాశ్మీరమున ముదమున/ వ్రాసినా రిందు రజమున రంగవల్లి/ కంజముల దోరణంబులు గట్టినారు’ అంటూ చందనంతో కళ్ళాపి చల్లి ఆపైన ముగ్గులు వేసిన వైనాన్ని వివరించాడు. ‘బోటి గట్టిన చెంగల్వపూవుటెత్తు/ దరు పరిణతోరు కదళి మంజరియు గొనుచు/ బోయి గుడినంబి విజనంబు జేయ జొచ్చి/ మ్రొక్కి వేదిక బలు వన్నె మ్రుగ్గు బెట్టె’ అంటూ శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’లో ఆలయాల్లో ముగ్గులు వేసే ఆనాటి ఆచారాన్ని వర్ణించాడు. ఆ«ధునికుల్లో తిరుమల రామచంద్ర ముగ్గువేస్తున్న ముదిత గురించి చక్కని సంస్కృత శ్లోకం రాశారు. ‘రచయంతీ రంగలతాం/ మంగళగాత్రీ సలీలం అంగణకే/ విటజన హృదయాంగణకే/ అనంగజ బాధాం విశాలయతి కునూనమ్’. చక్కని అమ్మాయి ముంగిట్లో ముగ్గుపెడుతూ విట జనుల హృదయాలలో మన్మథబాధను విస్తరింపజేస్తున్నదని దీని తాత్పర్యం. ఈ శృంగార శ్లోకాన్ని ఆయన తన పదమూడేళ్ల ప్రాయంలోనే రాయడం విశేషం. ‘ఉగ్గేల తాగుబోతుకు/ ముగ్గేల తాజ మహలు మునివాకిటిలో’ అంటూ శ్రీశ్రీ తన ‘సిరిసిరిమువ్వ శతకం’లో ముగ్గు ప్రస్తావన తెచ్చారు. నేల మీద ముగ్గులు మనుషులు వేస్తారు గానీ, నీలాకాశం మీద చుక్కల ముగ్గులు వేసేది సాక్షాత్తు భగవంతుడేనని కరుణశ్రీ నమ్మకం. ‘పనిమాలి ప్రతిరోజుప్రాణికోటుల గుండె/ గడియారముల కీలు కదపలేక/ అందాలు చింద నీలాకాశ వేదిపై/ చుక్కల మ్రుగ్గులు చెక్కలేక/ ఎంతశ్రమ యొందు చుంటివో యేమొ స్వామి’ అంటూ దేవుడి కష్టానికి కలత చెందడం ఆయనకే చెల్లింది! ముగ్గుతో ముడిపడిన జాతీయాలు, సామెతలు కూడా ఉన్నాయంటే, ముగ్గులు మన సంస్కృతిలో ఎంతగా పెనవేసుకు΄ోయాయో అర్థం చేసుకోవచ్చు. బాగా నెరిసిన తలను ‘ముగ్గు బుట్ట’ అంటారు. ‘ముగ్గులోకి దించడం’ అంటే ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ‘వాయువేగమును మించి, లోకాలను గాలించి, చిటికెలోనే ఉన్న చోటికే వచ్చు. అదేమిటి?’ అనే ΄పొడుపు కథ ఉంది. దీనికి సమాధానం ‘ముగ్గు'. మొదలు పెట్టిన చోటే ముగించడం ముగ్గు కళలో ప్రత్యేకత. ‘మరిగే నూనెలో ముచ్చటైన ముగ్గు. తీసి తింటే కరకరమంటుంది’ అనే ΄పొడుపు కథకు సమాధానం ‘జంతిక’. జంతికలు చూడటానికి మెలికల ముగ్గుల్లాగానే ఉంటాయి కదా! భారతీయులకు ముగ్గులు ముదితల వ్యవహారమే గానీ, కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ముగ్గులు వేయడం పురుషుల బాధ్యత. ఆఫ్రికన్లు ముగ్గులు వేయడానికి సున్నపురాతి ముగ్గుపిండి, వరిపిండి వంటివేమీ వాడరు. నేరుగా ఇసుకలోనే వేలితో లేదా కర్రపుల్లతో చుక్కలు పెట్టి, చుక్కల చుట్టూ మెలికల ముగ్గులు తీర్చిదిద్దుతారు. ముగ్గుల కళ దేశదేశాల్లో వ్యాపించి ఉన్నా, మన భారతీయ సాహిత్యంలో మాత్రం ముగ్గుల ప్రస్తావన విస్తారంగా కనిపిస్తుంది. అదీ విశేషం! -
సంక్రాంతి వేళ.. ప్రముఖులు ఇలా..
-
ముగిసిన స్వీట్.. కైట్ ఫెస్టివల్
-
తెరుచుకున్న శబరిమల దేవాలయం
శబరిమల: భారీ భద్రత నడుమ మకర సంక్రాంతి(మకరవిలక్కు) వేడుకల కోసం శబరిమల అయ్యప్ప దేవాలయం ఆదివారం తెరుచుకుంది. ప్రధాన పూజారి వీఎన్ వాసుదేవన్ నంబూద్రి ఆలయ తలుపులు తెరిచి పూజలు చేశా రు. తొలి రోజే భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. మకర సంక్రాంతి జనవరి 15న జరుగుతుంది. ఆలయాన్ని తిరిగి జనవరి 21న మూసివేస్తారు. 41 రోజుల పాటు జరిగిన మండల పూజ అనంతరం 27న ఆలయాన్ని మూసివేశారు. అన్ని వయసుల మహిళల్ని ఆలయంలోనికి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం భద్రతను పటిష్టం చేసింది. -
మొదలైన సంక్రాంతి సందడి
దాదర్, న్యూస్‌లైన్: సంక్రాంతి సంబరాల కోసం నగరవ్యాప్తంగా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు తెలుగు సాంస్కృతిక సంస్థలు వివిధ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. బేలాపూర్, డోంబివలిలో సాంస్కృతిక సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలివి. సీబీడీ బేలాపూర్‌లో నవీ ముంబైలోని సీబీడీ బేలాపూర్‌లోని తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ‘దాశరథి కరుణా పయోనిధి’ పేరిట భద్రాచల రామదాసు కీర్తనల ఆలాపనను ఏర్పాటు చేశారు. సెక్టర్-8ఏ ప్రాంతంలోని ‘కైరళి హాలు’ ప్రాంగణంలో జరుగనున్న ఈ ఆధ్మాత్మిక కార్యక్రమంలో కళావేదిక సభ్యులు ‘శ్రీరామ నవరత్న కీర్తనలు’ ఆలపిస్తారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు శారదా సుబ్రమణియన్ భద్రాచల రామదాసు కీర్తనలు ఆపిస్తారు. అలాగే రమాసాయి, దుర్గా భార్గవి జంట ‘ఇదిగో భద్రాది- అదిగో గౌతమి చూడండి’ అనే కీర్తన ఆధారంగా కూర్చిన నృత్యాన్ని అభినయిస్తుంది. ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలంతా విచ్చేసి విజయవంతం చేయాలని తెలుగుకళావేదిక నిర్వాహకులు కోరారు. డోంబివలిలో... స్థానిక ఆంధ్ర కళా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆదివారం ‘సంక్రాంతి సంబరాలు’ ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పు డోంబివలి, టాండన్ రోడ్డులోని ఠాగూర్ హాల్ ప్రాంగణంలో సాయంత్రం ఐదు గంటలకు ముగ్గుల పోటీలతో సంబరాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులకు భోగిపళ్లు, బాల బాలికలకు టాలెంట్ షో, స్వరమాధురి బృందం గానకచేరి తదితర కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఆంధ్ర కళాసమితి అభివృద్ధికి సేవలందించిన దంపతులను సత్కరిస్తారు. గత విద్యాసంవత్సరంలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన (సభ్యుల పిల్లలు) విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు.