మొదలైన సంక్రాంతి సందడి
దాదర్, న్యూస్‌లైన్: సంక్రాంతి సంబరాల కోసం నగరవ్యాప్తంగా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు తెలుగు సాంస్కృతిక సంస్థలు వివిధ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. బేలాపూర్, డోంబివలిలో సాంస్కృతిక సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలివి.
సీబీడీ బేలాపూర్‌లో
నవీ ముంబైలోని సీబీడీ బేలాపూర్‌లోని తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ‘దాశరథి కరుణా పయోనిధి’ పేరిట భద్రాచల రామదాసు కీర్తనల ఆలాపనను ఏర్పాటు చేశారు. సెక్టర్-8ఏ ప్రాంతంలోని ‘కైరళి హాలు’ ప్రాంగణంలో జరుగనున్న ఈ ఆధ్మాత్మిక కార్యక్రమంలో కళావేదిక సభ్యులు ‘శ్రీరామ నవరత్న కీర్తనలు’ ఆలపిస్తారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు శారదా సుబ్రమణియన్ భద్రాచల రామదాసు కీర్తనలు ఆపిస్తారు. అలాగే రమాసాయి, దుర్గా భార్గవి జంట ‘ఇదిగో భద్రాది- అదిగో గౌతమి చూడండి’ అనే కీర్తన ఆధారంగా కూర్చిన నృత్యాన్ని అభినయిస్తుంది. ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలంతా విచ్చేసి విజయవంతం చేయాలని తెలుగుకళావేదిక నిర్వాహకులు కోరారు.
డోంబివలిలో...
స్థానిక ఆంధ్ర కళా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆదివారం ‘సంక్రాంతి సంబరాలు’ ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పు డోంబివలి, టాండన్ రోడ్డులోని ఠాగూర్ హాల్ ప్రాంగణంలో సాయంత్రం ఐదు గంటలకు ముగ్గుల పోటీలతో సంబరాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులకు భోగిపళ్లు, బాల బాలికలకు టాలెంట్ షో, స్వరమాధురి బృందం గానకచేరి తదితర కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఆంధ్ర కళాసమితి అభివృద్ధికి సేవలందించిన దంపతులను సత్కరిస్తారు. గత విద్యాసంవత్సరంలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన (సభ్యుల పిల్లలు) విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు.