Dadar
-
Prabhadevi Temple: తెలుగువారి దేవేరి.. ప్రభాదేవి
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం నడిబొడ్డున వెలసిన ప్రముఖ ప్రభాదేవి మందిరానికి మూడు వందల సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయంటే తొమ్మిది రోజులపాటు ఈ ఆలయం భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతుంది. నిత్యం వేలాది మంది భక్తులు ఉపవాస దీక్షలతో, నిష్టగా వచ్చి ఆలయంలో ఉన్న మూడు దేవీ విగ్రహాలను దర్శించుకుని వెళుతుంటారు. నవరాత్రి ఉత్సవాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని వివిధ రంగుల విద్యుత్ దీపాలతో, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. పక్షం రోజుల ముందే ఆలయ గుడికి, ప్రహరీ గోడలకు, గర్భగుడిలో రంగులు వేసి సిద్ధంగా ఉంచారు. దేవీమాత విగ్రహానికి తాపడం పనులు పూర్తిచేసి అందంగా ముస్తాబు చేశారు. విగ్రహాలను వివిధ రకాల పూలతో అలంకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో పూజారులు ముందుగా ప్రకటించిన ప్రకారం రోజుకొక రంగు చీరతో దేవిని అలంకరిస్తున్నారు. నిత్యం వేలల్లో వచ్చే భక్తుల సౌకర్యార్ధం వివిధ మౌలిక సదుపాయాలు కల్పించారు. తోపులాటలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దసరా రోజున ముంబైలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలందరూ ప్రభాదేవి మందిరానికి చేరుకుంటారు. అక్కడే పెద్ద సంఖ్యలో గుమిగూడుతారు. ఆలయంలో దేవి విగ్రహానికి బంగారం (జమ్మి చెట్టు ఆకులు) సమర్పిస్తారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ భేటీ అయ్యే బంధువులు, మిత్రులు, పరిచయస్తులందరూ ఒకరికొకరు బంగారం ఇచ్చిపుచ్చుకుని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. దసరా రోజున ఆలయంలో కనిపించే వాతావరణాన్ని బట్టి నిజంగా తెలంగాణలోని స్వగ్రామంలో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మందిరానికి చేరుకుని పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఎల్ఫిన్స్టన్ రోడ్.. ప్రభాదేవిగా... మూడు వందల ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆలయంలో ప్రభావతి దేవి, కాళికాదేవి, చండికాదేవి ఇలా మూడు విగ్రహాలున్నాయి. కాలక్రమేణా ఈ ప్రాంతం ప్రభాదేవిగా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని, ప్రాంతాన్ని ప్రభాదేవిగా పిలుస్తున్నారు. ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎల్ఫిన్స్టన్ రోడ్ రైల్వే స్టేషన్‌కు ప్రభాదేవిగా అధికారికంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి ఈ స్టేషన్‌ను ప్రభాదేవి పేరుతోనే పిలుస్తున్నారు. అంతేగాకుండా రైల్వే ప్లాట్‌ఫారంపై బోర్డులు సైతం మార్చివేశారు. టికెట్లు, సీజన్ పాస్‌లపై, అనౌన్స్మెంట్ ఇలా అన్ని ప్రభాదేవి పేరటనే జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల కారణంగా భక్తుల దర్శనం కోసం ప్రతీరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. దసరా రోజున అర్ధరాత్రి వరకు ఆలయం తెరిచే ఉంటుందని పూజారులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయం ఆవరణలో వివిధ భక్తి పాటలు, కీర్తనలు ఆలపించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల్లో నగరంలో ఉన్న అనేక మందిరాలలో మార్పులు జరిగాయి. కానీ ప్రభాదేవి మందిరం ఇప్పటికీ పాత సంస్కృతులను కాపాడుకుంటూ వస్తోంది. ఏటా జనవరి రెండో లేదా మూడో వారంలో మందిరం వద్ద వారం రోజులపాటు జాతర జరుగుతుంది. ఈ ఆలయాన్ని ఉత్సవాల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా వందలాది భక్తులు దర్శించుకునేందుకు వస్తుంటారు. ముఖ్యంగా ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రముఖ సిద్ధివినాయక మందిరం ఉంది. దీంతో సిద్ధివినాయకున్ని దర్శించుకునేందుకు వచ్చిన స్ధానిక భక్తులతోపాటు, పర్యాటకులు ప్రభాదేవి మందిరాన్ని కచ్చితంగా దర్శించుకుని వెళతారు. దీంతో ఈ ప్రాంతం నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు, సామాన్య ప్రజల రాకపోకలతో రద్దీగా కనిపిస్తుంది. కరోనా అనంతరం తొలిసారి ఉత్సవాలు... కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌వల్ల గత రెండేళ్లుగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించలేకపోయారు. దీంతో లాక్డౌన్ కాలంలో ఈ ఆలయం భక్తులు లేక బోసిపోయి కనిపించింది. ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత నవరాత్రి ఉత్సవాలు జరగడం ఇదే ప్రథమం. దీంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా చేశారు. దసరా రోజున పెద్ద సంఖ్యలో తరలి వచ్చే జనాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దసరా రోజున నిమజ్జనాలకు వివిధ ప్రాంతాల నుంచి సముద్రతీరానికి బయలుదేరే అనేక బతుకమ్మలు ఈ ఆలయం ముందునుంచే వెళతాయి. ఇక్కడ ఆడపడుచులు కొద్దిసేపు బతుకమ్మ ఆడి ముందుకు కదులుతారు. దీంతో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. (క్లిక్ చేయండి: ఆర్థిక నష్టాల్లో మోనో రైలు.. గట్టేక్కేదెలా?) -
గణేశ్ విగ్రహాల ధరలు పెరిగాయ్... ఎందుకంటే..
ముంబై: పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట గ్యాస్ ధరలతో సతమతమవుతున్న వినాయకుని భక్తులకు గణేశ్ విగ్రహాలు, అలంకరణ సామాగ్రి ధరలు కూడా తోడయ్యాయి. విగ్రహాల తయారీకి ఉపయోగించే నల్ల మట్టి, రంగులు, ఇనుప చువ్వలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ), కలప తదితర సామాగ్రి ధరలు 25–30 శాతం పెరిగాయి. అంతేగాకుండా వర్క్ షాపుల్లో విగ్రహాలను తయారుచేసే కళాకారులు, కార్మికుల జీతాలు కూడా పెంచాల్సి వచ్చింది. ఫలితంగా విగ్రహాల ధరలు పెంచక తప్పలేదని తయారీదారులు అంటున్నారు. విగ్రహాలతోపాటు మండపాల నిర్మాణానికి వినియోగించే వెదురు బొంగులు, ప్లాస్టిక్ పేపర్లు, తాడ్పత్రి, అలాగే «థర్మాకోల్, గ్లూ, రంగురంగుల కాగితాలు, విద్యుత్ దీపాలు, లేజర్ లైట్ల తోరణాలు తదితర అలంకరణ సామాగ్రి ధరలు 10–20 శాతం పెరిగాయి. అదేవిధంగా పూజా సాహిత్యం ధరలు 20–25 శాతం పెరిగాయి. దీంతో ఈ ఏడాది గణేశోత్సవాలు నిర్వహించే పేదలు, మధ్య తరగతి కుటుంబాల ఆర్ధిక అంచనాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఉత్సవాలకు భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్ధితి వచ్చింది. పెరిగిన సామాగ్రి ధరల ప్రభావం సార్వజనిక గణేశోత్సవ మండళ్లపై అంతగా పడకపోయినప్పటికీ ముఖ్యంగా ఇళ్లలో ప్రతిష్టించుకుని పేదలు, సామాన్య భక్తులపై తీవ్రంగా చూపనుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సార్వజనిక గణేశోత్సవ మండళ్లు, ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు ఉత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. అలంకరణ పనులకు కూడా చాలా తక్కువ స్ధాయిలో ఖర్చు చేశారు. కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు, సార్వజనిక మండళ్లు భారీగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కానీ విగ్రహాల ధరలు, అలంకరణ సామాగ్రి ధరలు పెరగడంతో ఉత్సవాలపై నీళ్లు చల్లాల్సిన పరిస్ధితి వచ్చింది. వరదలతో తయారీకి ఇక్కట్లు... గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అన్ని వస్తువులకు భారీగా ధరలు పెరిగాయి. గత సంవత్సరం కేజీ పీఓపీ రూ.130 లభించగా ఇప్పుడు రూ.210పైగా లభిస్తోంది. అంతేగాకుండా రంగుల ధరలు 10–20 శాతం, ఇనుప చువ్వల ధరలు 50–60 శాతం మేర పెరిగాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక జిలాలలో వరదలు వచ్చాయి. అలాగే గుజరాత్లో కూడా కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి నుంచి వర్క్ షాపుల్లోకి రావల్సిన కలప నిలిచిపోయింది. దీంతో కొరత ఏర్పడడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. సామాగ్రి ధరలు పెరిగినప్పటికీ కొనుగోలు చేయకతప్పడం లేదు. చౌక ధర సామాగ్రి వినియోగిస్తే విగ్రహాల నాణ్యత దెబ్బతింటుంది. దీంతో గత్యంతరం లేక విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని బడా విగ్రహాల తయారీదారులు అంటున్నారు. వలస కూలీలు తిరిగిరాలేదు.. కరోనా కాలంలో అమలుచేసిన లాక్డౌన్ వల్ల ఉపాధి లేక అనేక మంది కళాకారులు, కార్మికులు స్వగ్రామాలకు తరలిపోయారు. అందులో అనేక మంది తిరిగి రాలేకపోయారు. దీంతో కళాకారులు, కార్మికుల కొరత ఏర్పడింది. వారికి కూడా ఎక్కువ కూలీ, వేతనాలిచ్చి రాష్ట్రానికి రప్పించాల్సిన దుస్ధితి వచ్చింది. ఎక్కువ జీతంతో పనులు చేయించుకోవల్సి వస్తోందని విగ్రహాల తయారీదారుడు రాహుల్ ఘోణే పేర్కొన్నారు. మరో విగ్రహాల తయారిదారుడు ప్రశాంత్ దేశాయ్ మాట్లాడుతూ రెండు, నాలుగు అడుగులోపు విగ్రహాలు తయారు చేయడం కొంత గిట్టుబాటు అవుతుంది. అందులో ఇనుప చువ్వలు, కలప వినియోగం ఉండదు. కాని భారీ విగ్రహాలు తయారు చేయాలంటే ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఇందులో ఇనుప చువ్వలు, కలప పెద్ద మాత్రలో వినియోగించాల్సి ఉంటుంది. దీంతో ధరలు పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదంటున్నారు. విగ్రహాల డిమాండ్ పెరిగింది. కాని సమయం తక్కువగా ఉండడంతో కళాకారులకు, కార్మికులకు ఓవర్ టైం డబ్బులు చెల్లించడంతో భోజన, బస వసతులు కల్పించి పనులు చేయించుకోవల్సిన పరిస్ధితి వచ్చిందంటున్నారు. ఇలా అన్ని విధాల ఖర్చులు పెరగడంతో విగ్రహాల ధరలు పెంచకతప్పడం లేదని వారు వాపోతున్నారు. -
షిండే వర్గం కోసం శివసేన కొత్త భవనం?
ముంబై: రెబల్ ఎమ్మెల్యేల ద్వారా శివసేన పార్టీని విభజించిన ఆ పార్టీ కీలక నేత ఏక్నాథ్ షిండే.. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో మహారాష్ట్రలో సర్కార్‌ను ఏర్పాటు చేయడం, ఏకంగా సీఎం అయిపోవడం విదితమే. అయితే.. తమదే సిసలైన శివసేన అని ప్రకటించుకున్న షిండే వర్గం.. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమవుతోందా? బాలాసాహెబ్(బాల్‌థాక్రే) నేతృత్వంలో స్థాపించిన బడిన శివసేన ప్రధాన కార్యాలయం శివసేన భవన్.. దాదర్‌లో ఉంది. ఈ భవనంతో సంబంధం లేకుండా ఓ శివసేన భవనం ఏర్పాటు చేసే ఆలోచనలో షిండే వర్గం ఉన్నట్లు ఊహాగాన కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు దాదర్ ప్రాంతంలోనే కొత్త భవనం కోసం వేట ప్రారంభించినట్లు, ప్రధాన కార్యాలయంతో పాటు స్థానిక కార్యాలయాలను సైతం నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు ఆ కథనాల సమచారం. అయితే ఈ కథనాలపై షిండే వర్గం స్పందించింది. తాజాగా షిండే కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేసిన ఉదయ్ సామంత్ అదంతా ఊహాగానమే అని ప్రకటించారు. కొత్త ప్రధాన కార్యాలయం లాంటి ఆలోచనేం లేదు. బాలాసాహెబ్‌పై ఉన్న గౌరవంతో శివసేన భవనాన్నే మేం గౌరవిస్తాం. కానీ, సీఎం షిండే.. సామాన్యులతో భేటీ కోసం ఓ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నాం. బహుశా ఈ కథనాలు తెలిసి పొరపాటుగా అర్థం చేసుకుని మీడియా ఇలా ప్రచారం చేస్తుందేమో అని ఉయద్ సామంత్ వెల్లడించారు. ప్రస్తుతం శివ సేన పార్టీ ఎవరికి చెందాలనే వ్యవహారం సుప్రీం కోర్టులో నడుస్తోంది. తమదే అసలైన క్యాంప్ అంటూ మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే క్యాంప్‌లు పోటాపోటీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. చదవండి: మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన -
రైళ్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు
దాదర్: థానే–దీవా స్టేషన్ల మధ్య చేపడుతున్న ఐదు, ఆరో లేన్ల నిర్మాణ పనులకోసం రైల్వే తీసుకుంటున్న మెగా బ్లాక్ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైళ్లు రద్దు చేస్తున్నట్లు రెండు రోజుల ముందు ప్రకటిస్తుండటంతో ఇతర రైళ్లలో రిజర్వేషన్ టికెట్లు లభించడం లేదు. దీంతో గత్యంతరం లేక తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. బ్లాక్ కారణంగా రైళ్లు రద్దుచేసిన విషయం తెలియక కొందరు ఏకంగా లగేజీ, పిల్లాపాపలతో రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఆ తరువాత రైలు రద్దుచేసినట్లు తెలుసుకుని ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. సా..గుతోన్న మరమ్మతు పనులు... థానే–దీవా స్టేషన్ల మధ్య ఐదు, ఆరో లేన్లు వేసే పనులు కొంతకాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇదివరకు గత నెల (డిసెంబర్)లో 18, 19వ తేదీల్లో, ఈనెల 1, 2 తేదీల్లో అలాగే 8, 9 తేదీల్లో, తాజాగా 22, 23 తేదీల్లో 10–24 గంటలపాటు బ్లాక్ తీసుకున్నారు. నిత్యం రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, కార్మికులు ఇబ్బందులు పడకుండా మరమ్మతు పనులకోసం శని, ఆదివారాలనే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా రద్దు చేస్తున్న రైళ్లలో తెలంగాణ ప్రజలు కొందరు రాకపోకలు సాగించే నాందేడ్–ముంబై తపోవన్ ఎక్స్‌ప్రెస్, ముంబై–జాల్నా జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్, ముంబై–ఆదిలాబాద్ నందీగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను శని, ఆదివారాలు రద్దు చేస్తున్నారు. ఈ విషయాన్ని కేవలం రెండు రోజుల ముందు రైల్వే ప్రకటిస్తోంది. వీటితోపాటు స్థానికంగా తిరిగే కొన్ని లోకల్ రైళ్లను, ముంబై–మన్మాడ్, ముంబై–పుణే మధ్య తిరిగే రైళ్లను కూడా రద్దు చేస్తున్నప్పటికీ అంతగా ప్రభావం చూపదు. కాని ప్రతీసారి ముంబై నుంచి జాల్నా, నాందేడ్, ఆదిలాబాద్ రైళ్లనే రద్దు చేయడంవల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికే ఇతర రైళ్లలో రిజర్వేషన్ సీట్లన్ని ఫుల్ అవుతున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలులేకుండా పోతుంది. దీంతో స్వగ్రామానికి ఎలా వెళ్లాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో వెళ్లాలంటే రైల్వే చార్జీలతో పోలిస్తే రెట్టింపు లేదా మూడు రెట్లు ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పేదలకు ఇది అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. దీంతో బ్లాక్ కారణంగా రద్దు చేసే ఎక్స్‌ప్రెస్ రైళ్ల వివరాలను వారం రోజుల ముందుగానే ప్రకటించాలని కోరుతున్నారు. అలాగే జాల్నా, నాందేడ్, ఆదిలాబాద్ దిశగా వెళ్లే రైళ్లనే కాకుండా, వేర్వేరు రూట్లలో వెళ్లే రైళ్లను కూడా అప్పుడప్పుడు రద్దు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆరేళ్ల కూతుర్ని రైలులో మరిచిపోయి..
ముంబై : రైలు దిగే తొందరలో ఉన్నపుడు ఏవైనా వస్తువులు మరిచి వెళ్లిపోవటం మామూలే. కానీ ఓ తండ్రి ఏకంగా తన ఆరేళ్ల కూతురిని రైలులో మర్చిపోయాడు. ఈ సంఘటన బుధవారం మహారాష్ట్రలోని కళ్యాణ్ సిటీలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మహారాష్ట్ర థానే జిల్లాలోని డాంబీవ్లికి చెందిన ఓం ప్రకాశ్ హరిపాల్ యాదవ్ ‘‘సాయినగర్- దాదర్ ఎక్స్‌ప్రెస్’’ రైలులో షిర్డీ నుంచి కళ్యాణ్ సిటీకి బయలు దేరాడు. రైలు కళ్యాణ్ సిటీకి చేరుకోగానే భార్య, లగేజీతో సహా రైలు దిగి స్టేషన్ బయటకు వెళ్లిపోయాడు. బయటకు రాగానే ఆరేళ్ల కూతురు లిప్సికా గుర్తుకు వచ్చింది. పాప కోసం చుట్టు పక్కల మొత్తం కలయ తిరిగినా పాప కనిపించలేదు. కొద్ది సేపటి అన్వేషణ తర్వాత కూతురిని రైలు బోగిలో నిద్ర పుచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది. పాపకోసం రైలు దగ్గరకి వెళ్లే సరికే రైలు స్టేషన్ విడిచి దాదర్ వెళ్లిపోయింది. హరిపాల్ వెంటనే రైల్వే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు గురువారం దాదర్‌లో పాపను గుర్తించి అతనికి అప్పగించారు. -
కృష్ణ భక్తుల వినూత్న నిరసన
ముంబై: ఉట్టి కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కృష్ణభక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వినూత్న ప్రదర్శనతో తమ అసంతృప్తిని వెల్లడించారు. ముంబైలోని దాదర్ ప్రాంతంలో కృష్ణభక్తులు 20 అడుగుల మానవ పిరమిడ్ రూపంలో నేలపై పడుకుని నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుపై తమ అసంతృప్తిని ఈ విధంగా వ్యక్తం చేశామని అమర్ అనే భక్తుడు వెల్లడించాడు. కాగా, ఉట్టి కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు విషయంలో హైకోర్టు తీర్పునే కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎత్తు పెంచాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ అంతకు మించి ఎత్తు పెంచలేమని ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. మహారాష్ట్రలో కృష్ణాష్టమి సందర్భంగా ‘దహి హండి’ పేరుతో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే దీని కోసం ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు 20 అడుగులకు మించవద్దని, 18 సంవత్సరాల లోపువారు ఈ ఉత్సవంలో పాల్గొనవద్దని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
మాంసం అమ్మకాల్లో 'మహా సేన'
-
బీజేపీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో సంగీత విభావరి
దాదర్: ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా నవీముంబైలోని వాషి పట్టణంలో స్థానిక బీజేపీ పార్టీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. సెక్టార్ 14, బీజేపీ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి తిరుపతి పట్టణానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసురాలు, ఆకాశవాణి కళాకారిణి, ‘మధుర సంగీత భారతి’ వరలక్ష్మి నారాయణం హాజరయ్యారు. ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట, తల్లిని మించి వేరే దైవము లేనే లేదురా-చల్లని తల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గమురా’ వంటి గీతాలతో పాటు అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు వినిపించి శ్రోతలను అలరించారు. కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు సి.వి. రెడ్డి, ఏక్నాథ్ మగద్వార్, విక్రం పారాజులి (బీజేపీ నేతలు), వాణీ శ్రీపాద, కె.ఎస్. మూర్తి, కె.వి. రమణయ్య శెట్టి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారిణి వరలక్ష్మిని వాణి శ్రీపాద సత్కరించారు. -
‘ప్రమోద్’ గార్డెన్‌ను ప్రారంభించిన సీఎం
- మంత్రి సుభాష్, రేఖా మహాజన్ హాజరు సాక్షి, ముంబై: దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ పేరిట దాదర్‌లో ఏర్పాటు చేసిన గార్డెన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. గార్డెన్ పనులన్నీ పూర్తయ్యి నాలుగు నెలలు గడుస్తున్నా పలు కారణాల వల్ల ప్రారంభం కాలేదు. ప్రమోద్ మహాజన్ వర్ధంతిని పురస్కరించుకుని ఉద్యానవనాన్ని ఆదివారం ప్రారంభించినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ప్రారంభోత్సవానికి మంత్రి సుభాశ్ దేశాయ్, ప్రమోద్ భార్య రేఖా మహాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉద్యానవన నిర్వహణ బాధ్యతలను 2014 ఆగస్టు నుంచి చూస్తూ వస్తున్న బీఎంసీకి చెందిన సేవ్రేజ్ ఆపరేషన్స్ (ఎస్వో) విభాగమే చూసుకోనుంది. కార్యక్రమంలో ఎంపీ పూనమ్ మహాజన్ మాట్లాడుతూ.. నగరవాసులకు పచ్చదనంతో కూడిన ఉద్యానవనం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సేవ్రేజ్ ఆపరేషన్స్, ఉద్యాన వన విభాగానికి మధ్య సయోధ్య లేకపోవడం వల్ల ఉద్యానవన ప్రారంభం ఆలస్యం అయిందని చెప్పారు. ఉద్యానవనంలో మామిడి, కొబ్బరి, గుల్మోహర్, బన్యన్, రావి తదితర భారీ వృక్షాలు ఉన్నాయి. పూల కుండీల్లో సమారు 2.5 లక్షల మొక్కలు ఉన్నాయి. దీని అభివృద్ధికి దాదాపుగా రూ.30 కోట్ల వ్యయం అయినట్లు సమాచారం. 75 శాతం కంటి వ్యాధులను నయం చేయొచ్చు! ‘కంటికి సంబంధించిన 75 శాతం వ్యాధులను నయం చేయవచ్చు. అయితే ప్రజల్లో వ్యాధులకు సంబంధించిన సరైన అవగాహన లేకపోవడం, తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం చాలా మందికి చికిత్స అందడం లేదు’ అని రాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య శాస్త్రం పురోగతి చెందుతోందని, సాధారణ ప్రజానీకానికి వైద్య శాస్త్ర ఫలాలు అందించాలని కోరారు. యువ వైద్యులు ప్రజాసేవకు అంకితం కావాలనే ఆకాంక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సబర్బన్ ముంబైలోని ‘అనిదీప్ కంటి ఆస్పత్రి’ని ఫడ్నవీస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో కంటి చూపు ఇవ్వడం కంటే గొప్ప దీవెన ఇంకోటి లేదు. కళ్లు లేని వారికి చూపు ప్రసాదించడం కూడా దీవెన లాంటిదే. 75 శాతం వ్యాధులను నయం చేయవచ్చు. అయితే ప్రజల్లో వ్యాధులకు సంబంధించిన సరైన అవగాహన లేకపోవడం వల్లే ఆశించనంత మేర బాధితులకు సాయం జరగలేదు’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ప్రారంభోత్సవంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి దీపక్ సావంత్, ఆయన కుమారుడు ప్రముఖ సర్జన్ స్వప్నేశ్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. -
డోంబివలిలో 23 నుంచి శ్రీవేంకటేశ్వరసామి కల్యాణోత్సవాలు
దాదర్, న్యూస్‌లైన్ : డోంబివలి పట్టణంలో ఈ నెల 23వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఆంధ్ర కళాసమితి ఆధ్వర్యంలో తూర్పు డోంబివలిలోని తాయి పింగళే చౌక్ వద్దగల సర్వేష్ సభాగృహ ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటలకు సుప్రభాత సేవతో ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆ తర్వాత సామూహిక లక్ష తులసీ అర్చన, విష్ణు సహస్ర నామం, లలితా సహస్రనామ పఠనం, భక్తి సంగీత కార్యక్రమాలు జరగనున్నాయని వారు పేర్కొన్నారు. 22నరథ యాత్ర... శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలను పురస్కరించుకొని పశ్చిమ డోంబివలిలోని ఆనంద్‌నగర్‌లోగల ఆనంద్ కుటీర్ ప్రాంగణంలో శనివారం ఉదయం 10 గంటలకు తిరుమంజన మహోత్సవం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి సర్వేష్ సభాగృహం వరకు స్వామి వారి రథయాత్రను నిర్వహించనున్నారు. తర్వాత సభా ప్రాంగణంలో ఎదుర్కోలు వేడుకలు జరగనున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో భక్తలంతా పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆంధ్ర కళాసమితి నిర్వాహకులు కోరారు. -
ఉత్తమ విద్యార్థులకు సన్మానం
సాక్షి, ముంబై: దాదర్‌లోని ది బొంబాయి ఆంధ్ర మహాసభ అండ్ జింఖానాలో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ విద్యార్థులకు సన్మాన సభ నిర్వహించారు. 2014 లోజరిగిన ఎస్ఎస్సి, హెచ్ఎస్సి పరీక్షల్లో ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంబై ఉప మేయర్ అల్కా కేర్కర్ విచ్చేశారు. ముందుగా రాధా మోహన్ శిష్య బృందం, రాజ్యలక్ష్మి శిష్య బృందం నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. తదనంతరం సభ అధ్యక్షుడు సంకు సుధాకర్ అతిథులను సన్మానించారు. కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ జరగబోయే కార్యక్రమాల గురించి వివరించారు. హెచ్‌ఎస్‌సిలో చావేలి వెంకటసాయికి మొదటి బహుమతి, మద్దిరెడ్డి దివ్యకు రెండవ బహుమతి, కొక్కుల గౌతమికి మూడవ బహుమతిని, ఎస్ఎస్సిలో మద్దిరెడ్డి అంజలికి మొదటి బహుమతి, కె. స్థితప్రజ్ఞకి రెండవ బహుమతి, కుంటా స్మృతికి మూడవ బహుమతిని అల్కా కేర్కర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయిత సంగినేని రవీంద్ర, ఎం. నారాయణ, మంతెన రమేశ్, కాసిరెడ్డి, ఎ. జయశ్రీ, టి. జయశ్యామల, అనుమల్ల రమేశ్, బడుగు విశ్వనాథ్, ఎలిగేటి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జై బోలో గణేశ్ మహారాజ్‌కీ..
దాదర్, న్యూస్‌లైన్ : నగరంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకొంటున్నారు. వినాయకుడి విగ్రాహాల వద్ద ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని వీధులన్నీ జైబోలో గణేష్ నామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ప్రజలను వివిధ సామాజిక అంశాలపై కూడా ప్రజలను చైతన్యం చేస్తున్నాయి. గణేష్ మండళ్లు ప్రత్యేక చొరవ తీసుకొని వివిధ అంశాలపై పోస్టర్లు, మ్యానిక్వీన్లు, లైట్ అండ్ సౌండ్ షోలను ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకుంటున్నారు. పెద్దలను ఎలా గౌరవించాలి, వృద్ధులైన తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోంలకు తరలించ కూడదు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సెల్ ఫోన్, సెల్ టవర్లపట్ల పొంచి ఉన్న ప్రమాదాన్నికూడా షోల ద్వారా తెలియజేస్తున్నారు. వినూత్న సెట్టింగ్‌లు కేత్వాడి ఖమ్బాతా లేన్ సార్వజనిక్ గణేషోత్సవ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేయడానికి 20 అడుగుల గణేష్ విగ్రహాన్ని పచ్చని చెట్టుపై ఉండేలా వినూత్నంగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల జరిగే అనర్థాలపై 6 నిమిషాల పాటు భక్తులకు కళ్లకు కట్టినట్లు ఆడియో విజువల్స్ ద్వారా లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. మిమిక్రీ కళాకారుడు ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను ఆయా మండళ్లు ఏర్పాటు చేశాయి. శివ్డి మధ్య విభాగ్ గణపతి సార్వజనిక్ గణేషోత్సవ్ మండలి ఆధ్వరం్యలో మొబైల్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా కలిగే అనర్థాలను ప్రదర్శనల ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. యువతను వీటి వల్ల అప్రమత్తం చేస్తున్నామని మండలి సభ్యులు పేర్కొన్నారు. సెల్ టవర్ల ద్వారా కూడా ముప్పు పొంచి ఉన్నదనే అంశాన్ని తెలియజేస్తున్నామన్నారు. అవినీతి, వరకట్న దురాచారంపై అంధేరీకి చెందిన ఈశ్వర్ తరూణ్ మిత్ర మండలి వారు అవినీతికి , వరకట్నం దురాచారానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. బాల్ గోపాల్ మిత్ర మండలి వారు వృద్ధులైన తమ తల్లిదండ్రులను చూసుకోవాలని వారిని ఆశ్రమాలకు పంపకూడదని సూచిస్తున్నారు. పౌరాణిక పాత్రలైన శ్రావణ్ బాల్, రాముడు, భక్త పుండరీకుడు ఇంకా తదితరులనూ స్ఫూర్తిగా తీసుకోవాలిని తెలియజేస్తున్నారు. ఫైబర్‌తో తయారు చేసిన విగ్రహాల ద్వారా పెద్దలను ఎలా గౌరవించాలన్న అంశాన్ని చాటి చెబుతున్నారు. డోంబివలిలో ..... ముంబై శివారు ప్రాంతమైన డోంబివలి పట్టణంలో గణపతి ఉత్సవాలు జోరందుకున్నాయి. పలు యువ సేవా మండళ్లు గణపయ్య విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి భక్తులకు కనువిందు కలిగిస్తున్నారు. ఒకటిన్నర రోజు, ఐదు రోజుల గణపతి నిమజ్జనం చేశారు. పట్టణంలోని మండళ్లలో ఏర్పాటు చేసిన స్వామివారి సందర్శనార్థం భక్తుల తరలివస్తున్నారు. డోంబివలిలోని సాయినాథ్ మిత్రమడల్, అచానక్ సార్వజనీక మిత్ర మండల్, ఆటో రిక్షా చాలక్ సంఘటన, యువ మిత్ర మండలి తదితర యువసేన మండళ్లు ప్రతి రోజు స్వామివారికి నిత్య పూజల నిర్వహిస్తున్నారు. సందర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొన్ని మండళ్లు భక్తి సంగీత భజనలు, నృత్య పోటీలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక అవతారాలతో కొలువుదీరిన గణపయ్యను కనులారా తిలకించి భక్తులు పులకించిపోతున్నారు. -
కొంచెం తృప్తి..కొంచెం అసంతృప్తి
దాదర్/భివండీ, న్యూస్‌లైన్ : 2014-2015 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన సర్వ సాధారణ ‘బడ్జెట్’ పై పలువురు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. సంతృప్తికరంగానే ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తి కరంగానే ఉంది. సామాన్యులతోపాటు అందరిని అనుకూలంగా ఉంది. లగ్జరీ వస్తువుల ధరలు పెరిగాయి, నాన్ లగ్జరీ వస్తువుల తగ్గనున్నాయి. రూ. రెండు లక్షల వరకు ఉన్న పన్ను రాయితీని రూ.రెండున్నర లక్షల వరకు పెంచారు. మౌళిక సదుపాయాలు, భద్రతా, విద్యా, ఇలా అన్ని రంగాలకు బడ్జెట్ సమతుల్యంగా ఉంది.-అశోక్ రాజ్గిరి సీఏ చార్టెడ్ అకౌంట్, ముంబై నిరాశపరిచింది ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ‘బడ్జెట్’ అంత ఆశాజనకంగా లేదు, పూర్తి అసంతృప్తి కలిగించింది. కొత్త దనం లేదు. ఆదాయపు పన్ను, ప్రకటించిన ఇతర కొన్ని రాయితీలు మధ్య తరగతి ప్రజలకు కొద్దిగా ఊరట కలిగించాయి. పూర్తిగా న్యాయం జరిగేలా లేదు. సాదాసీదాగా బడ్జెట్ రూపకల్పన జరిగింది.-మాదిరెడ్డి కొండారెడ్డి (ప్రధాన కార్యదర్శి తెలుగు కళాసమితి, వాషి పాతసీసాలో కొత్తసారా ఈ బడ్జెట్ పాత సీసాలో కొత్త సారాలా ఉంది. యూపీఏకు ఎన్డీఏ బడ్జెట్లకు తేడా ఏమాత్రం కనిపించలేదు. దొందు దొందే. బలహీన వర్గాలను, రైతుల సమస్యలను పట్టించుకోలేదు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంతో ఇది సామాన్యులపై ఏమాత్రం ప్రభావం చూపనుందో, ఉద్యోగ అవకాశాలు ఏ మేరకు కలిగిస్తుందో చూడాలి. -మచ్చ ప్రభాకర్, రచయిత, ముంబై మోడీ మార్క్ కోసం వేచిచూడాల్సిందే గత ప్రభుత్వాలు చేపట్టిన ఆర్థిక అవకతవకలను అధిగమించేందుకు, ప్రస్తుతం ఉన్న ఆర్థికవనరులను అనుసరించి పోవలసిన పరిస్థితి ఏర్పడింది. సామాన్యులకు వెంటనే లాభాలు, అనేక ఇతర సౌకర్యాలు అందించే అవకాశాలు కలగలేదు. నిజంగా ‘నరేంద్ర మోడీ’ మార్క్ ప్రజోపకరమైన బడ్జెట్ రావాలంటే మరో మూడు, నాలుగు ఆర్థిక సంవత్సరాలు వేచి చూడాల్సిందే. -సంకు సుధాకర్, అధ్యక్షుడు, ది బొంబాయి ఆంధ్ర మహాసభ మిశ్రమ ఫలితాలు పార్లమెంటులో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ మిశ్రమ ఫలితాలు కలిగి ఉంది. సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొని ప్రకటించిన బడ్జెట్లో కొన్ని అంశాలు ఊరట కలిగించ వచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలను రైల్వేబడ్జెట్ నిరాశపరిచింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని, పోలవరం ప్రాజెక్టు, రైతుల రుణాల మాఫీ గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావించక పోవడం మరింత నిరాశకు గురిచేసింది. -పోతు రాజారాం, (ట్రస్టీ సభ్యుడు, ది బొంబాయి ఆంధ్ర మహాసభ సానుకూల బడ్జెట్ మధ్యతరగతి ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలకు బడ్జెట్ సానుకూలంగా ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఈజడ్)ను ఆమోదించలేదు. మోడీ హయాంలో అమలు అవుతాయని భావిస్తున్నాం. గతంలో భివండీలోని కాలేర్, కశేలీ, కేవిని దివేకు ఇట్టి జోన్లుగా పరిగణించారు. ప్రస్తుతమిచ్చిన 7 నగరాలలో భివండీకి అవకాశం ఇస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.-వెంకటేశ్, చిటికెన్, న్యాయవాది రాజకీయాలకతీతం మోడీ ప్రభుత్వంలో మొట్ట మొదటి సారిగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ సర్వసాధారణంగా, మధ్యంతరంగా ఉంది. ఎలాంటి రాజకీయాలు చేయకుండా అందరికి సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వృద్ధులకు రూ. 1000 పింఛన్లు అమలు చేశారు. అర్హులకు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మున్ముందు ప్రతి సిటీలో నిమ్స్ ఆసుపత్రుల సదుపాయాలు కల్పించాలి. -అడ్డగట్ల దత్తాద్రేయ, పారిశ్రామిక వేత్త -
దాదర్, పరేల్ స్టేషన్లలో స్కైవాక్‌లు
సాక్షి, ముంబై: దాదర్, పరేల్ స్టేషన్లలో స్కైవాక్‌లు నిర్మించాలని మధ్య రైల్వే పరిపాలనా విభాగం నిర్ణయించింది. దాదర్ మాదిరిగానే పరేల్ స్టేషన్లో కూడా ప్రయాణికుల రద్దీ నానాటికీ పెరిగిపోతోంది. రైలు దిగిన ప్రయాణికులు వెంటనే ప్లాట్‌ఫాం నుంచి బయటపడాలంటే భారీ కసరత్తు చేయాల్సిందే. దాదర్‌లో తగినన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ)లు ఉన్నప్పటికీ రద్దీ కారణంగా అవి సరిపోవడం లేదు. పరేల్‌లో రెండు ఎఫ్‌ఓబీలు ఉన్నప్పటికీ అందులో ఒక టి నిరుపయోగంగా మారింది. అందుబాటులో ఉన్న ఒక్కటీ అందరికీ సరిపోవడం లేదు. దీంతో గత్యంతరం లేక ప్రయాణికులు తమ ప్రాణాలను ఫణంగాపెట్టి పట్టాలు దాటుతున్నారు. ప్రస్తుతం పరేల్, ఎల్ఫిన్స్టన్ రోడ్ ప్రాంతాలు బిజినెస్ హబ్‌గా మారాయి. మూతపడిన మిల్లు స్థలాల్లో అనేక వాణిజ్య సంస్థలు, టవర్లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, బిగ్ బజార్ లాంటి సంస్థలు వెలిశాయి. ఇవేకాకుండా ఈ పరిసరాల్లో వాడియా, కేం. టాటా, గాంధీ ఆస్పత్రులున్నాయి. దీంతో ఉద్యోగులతోపాటు రోగులు, వారి బంధువుల రాకపోకలతో నిత్యం ఈ ప్రాంతమంతా బాగా రద్దీగా ఉంటుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని పరేల్ స్టేషన్‌ను టెర్మినస్‌గా అభివృద్థి చేయాలనే ప్రతిపాదన గతంలో తెరపైకొచ్చింది. అయితే అనివార్య కారణాలవ ల్ల ఈ ప్రతిపాదన అటకెక్కింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ ఇక్కడ స్కై వాక్‌ను నిర్మించాలనే ప్రతిపాదనను తెర పైకి తెచ్చారు. ఈ మేరకు పరేల్, దాదర్ స్టేషన్లకు కలిపేవిధంగా భారీ స్కైవాక్ నిర్మించాలని సూద్ యోచిస్తున్నారు. ఒకవేళ కార్యరూపం ధరించి అందుబాటులోకి వస్తే ఇటు పరేల్, అటు దాదర్ స్టేషన్‌కు చేరుకోవడం ప్రయాణికులకు సులభమవుతుంది. ఎలా నిర్మిస్తారంటే... రైలు పట్టాలకు సమాంతరంగా పరేల్-దాదర్ స్టేషన్లను కలిపే విధంగా భారీ స్కైవాక్‌ను నిర్మిస్తారు. దీని వెడల్పు 12 అడుగులు ఉంటుంది. మార్గ మధ్యలో ప్రయాణికులు అక్కడక్కడా దిగేందుకు వీలుగామెట్లు నిర్మిస్తారు. దీంతో ప్రయాణికులకు ఇటు పరేల్ లేదా అటు దాదర్ స్టేషన్‌కు వెళ్లడం సులభతరమవుతుంది. -
దాదర్‌లో మరో తెలుగు సంఘం
సాక్షి, ముంబై: ‘మహారాష్ట్ర తెలంగాణ తెలుగు మంచ్ (ఎంటీటీఎం)’ అనే కొత్త తెలుగు సంఘాన్ని శుక్రవారం దాదర్‌లో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సంఘానికి అధ్యక్షుడిగా వెంకటేశ్ గౌడ్ గుడుగుంట్ల, ఉపాధ్యక్షుడిగా గుండగోని యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా లింగయ్య నర్సింహ గొలుసుల, కోశాధికారిగా ఆవుల రాములుతోపాటు ఇతర కార్యవర్గసభ్యులను ఎంపిక చేశారు. కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి వర్షా గైక్వాడ్ హాజరు కాగా ఆమెను కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారకులైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, సహకరించిన అన్ని రాజకీయపక్షాలకు, జేఏసీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ.. ఇక్కడి వలస బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముంబై తెలంగాణ సంఘీభావ ఉద్యమ వేదిక మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ స్థానిక సంఘాల ప్రముఖులతోపాటు రచయిత మచ్చ ప్రభాకర్, కార్మిక నాయకుడు గన్నారపు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎన్నికలు
దాదర్, న్యూస్‌లైన్: ముంైబె సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ తెలుగు సంఘాలకు మాతృసంస్థగా విరాజిల్లుతున్న దాదర్‌లోని ‘ది ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా’ కార్యవర్గానికి ఆదివారం జరిగిన ఎన్నికలు ప్రశాం తంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుపొం దుతారనే దానిపై ఇటు సభ్యుల్లో, అటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అవినీతి ఆరోపణలు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ ఎన్నికలు జరగడం ఫలితాలపై మరింత ఆసక్తిని రేపింది. 2014-2015 సంవత్సరానికిగానూ నలుగురు బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, ఒక మహాసభ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, పదహారు కమిటీ సభ్యుల కోసం ఎన్నికలు జరిగాయి. జనచైతన్య ప్యానల్, ప్రగతి ప్యానెల్, విజన్ గ్రూప్ ప్యానల్ బరిలోకి దిగాయి. జనచైతన్య ప్యానెల్ నుంచి అధ్యక్ష పదవికి గజం సుదర్శన్, ప్రధాన కార్యదర్శి పదవికి యాపురం వెంకటేశ్వర్, ప్రగతి ప్యానెల్ నుంచి అధ్యక్ష పదవికి సంకు సుధాకర్, ప్రధాన కార్యదర్శి పదవికి భోగ సహదేవ్, విజన్ గ్రూప్ ప్యానెల్ నుంచి అధ్యక్ష పదవికి బండి గంగాధర్, ప్రధాన కార్యదర్శి పదవికి యాపురం వెంకటేశ్వర్ పోటీ చేశారు. ఉదయం నుంచే సందడి... ఎన్నికలు మధ్యాహ్నం తర్వాత ప్రారంభం కావల్సి ఉన్నప్పటికీ ఉదయం ఏడు గంటల నుంచే మహాసభ ప్రాంగణంలో ఎన్నికల సందడి కని పించింది. ఉదయం పది గంటలకు జరిగిన 69వ సభ్యుల సమావేశానికి సభ్యులు హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు వరకు జరిగిన ఎన్నికలలో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే మహా సభలో సుమా రు 2,600 మంది సభ్యత్వం కలిగి ఉండగా, కేవలం 754 మంది సభ్యులు మాత్రమే తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. మహాసభ ప్రాంగణంలో రాజకీయ స్థాయిలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని కీలకమైన చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన పర్యవేక్షణలో జరి గిన ఈ ఎన్నికలకు చీఫ్ రిటర్నింగ్ అధికారులుగా వి.వి.రెడ్డి, ఒ.సుబ్రహ్మణ్యం, అనుమల్ల సుభాష్ తదితరులు వ్యవహరించారు. -
శివరాత్రికి నగరం సిద్ధం
దాదర్, న్యూస్‌లైన్: సృష్టి, స్థితి, లయ కారకుడైన మహా శివుడికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని (ఈ నెల 27వ తేదీ గురువారం) నగరంలోని ప్రధాన శివాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పువ్వులతో ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భక్తులు తోపులాటకు గురి కాకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సదుపాయం కల్పించారు. పరేల్‌లోని శ్రీ మాణికేశ్వర మందిరం.. నగరంలోని పరేల్ ప్రాంతంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గంలోని దామోదర్ హాలు సమీపంలో ఉన్న ‘శ్రీ మాణికేశ్వర మందిరం’లో శివరాత్రిని పురస్కరించుకొని విశేషమైన ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో ‘మహా శివరాత్రి త్రికాల పూజలు’, ‘రుద్రాభిషేకాలు’ నిర్వహించనున్నారు. అదేవిధంగా రాత్రి 8 గంటల నుంచి సుమారు 4 గంటలపాటు సాగే ‘నిశీదకాల శివపూజనం’ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని దేవాలయ ముఖ్యుడు కొరిడే చంద్రశేఖర్ తెలిపారు. కాగా, సుమారు 185 ఏళ్ల క్రితం మాణికేశ్వరుడు ఇక్కడ స్వయంసిద్ధ లింగంగా అవతరించాడని పూర్వీకులు చెబుతారు. ఈ ఆలయంలో ప్రారంభం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొరిడే వంశస్తులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు. సదాశివ పూజారి కుమారుడు కొరిడే చంద్రశేఖర్, మూడవ తరానికి చెందిన ఆయన మనవలు ఇప్పటికీ ఆలయంలో పూజలు, ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డోంబివలిలో.. డోంబివలి (తూర్పు) రైల్వే స్టేషన్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో కల్యాణ్-షిల్ రహదారిలో ఉన్న ఖిడకాళేశ్వర మందిరం పరిసరాలు ఇప్పటికే అన్నిరకాల పూజా సామగ్రి, పూల దుకాణాలు, తిను బండారాలు, మిఠాయిలు విక్రయించే దుకాణాలతో పండగ వాతావరణం సంతరించుకుంది. శివరాత్రి మరుసటి రోజు ఆలయాన్ని సందర్శించే వేలాది మంది భక్తులకు ‘భండారా’ పేరిట అన్న సంతర్పణ జరుగనుంది. అంబర్నాథ్ పట్టణంలో.. అంబర్‌నాథ్‌లోని ప్రాచీన అంబ్రేశ్వర్ మందిరంలో స్వామి వారిని సందర్శించి పూజలు జరిపించడానికి ప్రతీ ఏటా వేలాది భక్తులు రావడం ఒక విశేషం. కాగా, మహారాష్ట్రలో నాసిక్ పట్టణంలోని త్రయంబకేశ్వర మందిరం, పుణేలోని భీమ్శంకర్ మందిరం, నాగేశ్వర మందిరం, ఔరంగాబాద్‌లోని గ్రిష్ణేశ్వర మందిరం, నగర శివారులో ఉన్న వసై పట్టణ సమీపంలోని తుంగారేశ్వర ఆలయం, అంబర్నాథ్ పట్టణంలోని అంబ్రేశ్వర శివ మందిరం, ఇలా ఎన్నో పేర్లతో భక్తులచే విశేష పూజలందుకుంటున్న ఈశ్వరునికి మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని నగరంలోని ప్రధాన శివాలయాల్లో ఏర్పాట్లు ఘనంగా చేశారు. కాగా నగరంలోని వాల్కేశ్వర మందిరం, బాబుల్నాథ్ మందిరం తదితర శివాలయాలను సందర్శించే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. -
మొదలైన సంక్రాంతి సందడి
దాదర్, న్యూస్‌లైన్: సంక్రాంతి సంబరాల కోసం నగరవ్యాప్తంగా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు తెలుగు సాంస్కృతిక సంస్థలు వివిధ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. బేలాపూర్, డోంబివలిలో సాంస్కృతిక సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలివి. సీబీడీ బేలాపూర్‌లో నవీ ముంబైలోని సీబీడీ బేలాపూర్‌లోని తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ‘దాశరథి కరుణా పయోనిధి’ పేరిట భద్రాచల రామదాసు కీర్తనల ఆలాపనను ఏర్పాటు చేశారు. సెక్టర్-8ఏ ప్రాంతంలోని ‘కైరళి హాలు’ ప్రాంగణంలో జరుగనున్న ఈ ఆధ్మాత్మిక కార్యక్రమంలో కళావేదిక సభ్యులు ‘శ్రీరామ నవరత్న కీర్తనలు’ ఆలపిస్తారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు శారదా సుబ్రమణియన్ భద్రాచల రామదాసు కీర్తనలు ఆపిస్తారు. అలాగే రమాసాయి, దుర్గా భార్గవి జంట ‘ఇదిగో భద్రాది- అదిగో గౌతమి చూడండి’ అనే కీర్తన ఆధారంగా కూర్చిన నృత్యాన్ని అభినయిస్తుంది. ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలంతా విచ్చేసి విజయవంతం చేయాలని తెలుగుకళావేదిక నిర్వాహకులు కోరారు. డోంబివలిలో... స్థానిక ఆంధ్ర కళా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆదివారం ‘సంక్రాంతి సంబరాలు’ ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పు డోంబివలి, టాండన్ రోడ్డులోని ఠాగూర్ హాల్ ప్రాంగణంలో సాయంత్రం ఐదు గంటలకు ముగ్గుల పోటీలతో సంబరాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులకు భోగిపళ్లు, బాల బాలికలకు టాలెంట్ షో, స్వరమాధురి బృందం గానకచేరి తదితర కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఆంధ్ర కళాసమితి అభివృద్ధికి సేవలందించిన దంపతులను సత్కరిస్తారు. గత విద్యాసంవత్సరంలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన (సభ్యుల పిల్లలు) విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. -
ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు
దాదర్, న్యూస్‌లైన్: ఆంధ్ర కళా సమితి ఆధ్వర్యంలో తూర్పు డోంబివలి పట్టణంలో ఆదివారం ‘శ్రీ వేంకటేశ్వర కల్యాణోత్సవాలు’ ఘనంగా జరిగాయి. సర్వేష్ సభా గృహ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి సమితి సభ్యులే కాక డోంబివలి శివారు ప్రాంతాలకు చెందిన భక్తులంతా తరలిరావడం ఒక విశేషం. ఉదయం 8 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతోఉత్సావాలు ప్రారంభించారు. వేదికపై వెలసిన స్వామి వారికి, అమ్మవార్లకు పట్టు వస్త్రములు, బంగారు నగలు అలంకరించి విశ్వక్సేన ఆరాధనతో కల్యాణానికి నాంది పలికారు. వివాహంలోని ముఖ్య ఘట్టాలైన పుణ్యవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళనము, మధుపర్కం, కన్యాదానం, జీలకర్ర-బెల్లం, ముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర తంతులు కన్నులారా చూసిన భక్తు లు తన్మయంలో మునిగిపోయారు. ప్రాంగణమం తా ‘గోవింద’ నామస్మరణతో మార్మోగింది. కల్యాణ అనంతరం స్వామివారి పేరిట సామూహిక తులసి అర్చనలో భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన అర్చకులు శ్రీకాంతాచార్యులు, నరసింహా చార్యులు, గోపాలాచార్యు లు, శ్రీనివాసాచార్యులు, స్థానిక అర్చకులు మద్దూరు మల్లికార్జున శర్మ కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఘనంగా ‘రథ యాత్ర’ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం పురస్కరించుకొని శనివారం సాయంత్రం పశ్చిమ డోంబి వలి ఆనంద్‌నగర్‌లో ఆదిత్య కుటీర్ నుంచి కల్యాణ మండపం వరకు పురవీధులలో జరిగిన రథ యాత్ర లో తెలుగు ప్రజలతోబాటు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మండపం చెంతకు రథ యాత్ర చేరగానే స్వామి వారికి, అమ్మవార్లకు ఘనంగా స్వాగతం పలికి ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా మొగల్తూరు పట్టణం అనిరుద్ధ భజన మండలికి చెందిన అనంతరపల్లి నాగమణి ఆధ్వర్యంలో పాతికమంది మహిళా సభ్యులు ప్రదర్శించిన కోలాటం, భజన గీతాలు కల్యాణోత్సవాలకు శోభనిచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులందరికీ ఆంధ్ర కళా సమితి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డోంబివలి ఆంధ్రా బ్యాంక్ శాఖ సిబ్బంది ఇక్కడ ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసి తమ సేవలను వివరించారు. -
సీనియర్ ఫొటో జర్నలిస్టు ఆత్మహత్య
సాక్షి, ముంబై: సీనియర్ ఛాయా గ్రాహకుడు గజానన్ గుర్యె (58) శనివారం వేకువజామున దాదర్‌లోని ఆయన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనకు కారణాలేంటన్నది మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. దాదర్‌లోని శివసేన పార్టీ ప్రధాన భవనం సమీపంలో ఉన్న సాయిచరణ్ బిల్డింగ్ మూడవ అంతస్తులో ఆయన నివాసముంటున్నారు. రోజు లాగానే గజానన్ గుర్యె శుక్రవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులకు బెడ్రూమ్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆయన మృతదేహం కన్పించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. కొన్ని రోజులుగా ఆయన కొంత మానసిక అశాంతితో ఉన్నారని, దానివల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. 35 సంవత్సరాలకుపైగా... ఛాయాగ్రాహకుడిగా గజానన్ 35 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వసంత్ దాదా పాటిల్, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నుంచి శరద్ పవార్ వరకు దాదాపు అందరు రాజకీయ నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన జిజిపిక్స్.కామ్ (జజఞజీఛిజుట.ఛిౌఝ) అనే వెబ్సైట్ రూపొందిం చారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కార్యక్రమాలు జరిగినా ఫొటోలు తీసి ఆ వెబ్సైట్లో పొందుపరిచేవారు. దీంతో నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వెలుపడే అనేక పత్రికలకు రాజకీయ పార్టీలు, నాయకులు, ఇతర ఫొటోలు ఆ వెబ్సైట్లో ఉచితంగా లభించేవి. ఇలా ఆయన ఫొటోలు అనేక మంది వాడుకుంటున్నారు. ఆయన ఓ ఛాయాగ్రాహకుడిగా గుర్తింపు పొందడంతోపాటు అనేక మంది ఛాయాగ్రాహకులుగా ఎదిగేందుకు సహాయపడ్డారు. ఇప్పటికీ ఆయన వద్ద అనేక మంది విధులు నిర్వహిస్తుండడం విశేషం. -
మరింత సౌకర్యవంతంగా ‘దాదర్’
సాక్షి, ముంబై: దాదర్ రైల్వేస్టేషన్ త్వరలో మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ స్టేషన్లో ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) నడుం బిగించింది. పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలు ఈ స్టేషన్లోనే కలుస్తాయి. దీంతో ఈ స్టేషన్ తెల్లవారుజామునుంచి అర్ధరాత్రిదాకా కిటకిటలాడుతుంటుంది. ప్రస్తుతం ఈ స్టేషన్లో 15కిపైగా ప్ల్లాట్ఫాంలున్నాయి. అనేక పాదచార వంతెన(ఎఫ్ఓబీ)లు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని వంతెనలు పశ్చిమ, సెంట్రల్ మార్గాలను కలుపుతుండగా, మరికొన్ని పశ్చిమ, సెంట్రల్ మార్గాలకు వేర్వేరుగా ఉన్నాయి. త్వరలో వీటన్నింటినీ అనుసంధానించనున్నారు. ఈవిధంగా చేయడంవల్ల ఒకప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు వెళ్లేందుకు ఎఫ్‌ఓబీలు మారాల్సిన అవసరం ఉండదు. అలాగే విపరీతమైన రద్దీ కారణంగా ప్రయాణికులు సులభంగా ప్లాట్‌ఫాం నుంచి ఎఫ్ఓబీకి చేరుకోలేకపోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు తోపులాటవల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. ఈ నేపథ్యంలో వారి సౌకర్యం కోసం 18 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా టికెట్ బుకింగ్ కౌంటర్లను కూడా మార్చనున్నారు. దాదర్‌కు కొద్దిదూరంలో ఉన్న తిలక్ బ్రిడ్జి వద్దనుంచి నేరుగా ప్లాట్‌ఫాంలపైకి చేరుకునేందుకు వీలుగా ఎఫ్‌ఓబీలను నిర్మించనున్నారు. దీంతో తిలక్ బ్రిడ్జి ప్రాంతం నుంచి స్టేషన్‌కు రావాలన్నా లేదా స్టేషన్ నుంచి బయటికెళ్లిన ప్రయాణికులు తిలక్ బ్రిడ్జి ఎక్కాలన్నా ప్రయాసపడనవసరం ఉండదు. కొద్ది రోజుల కిందట సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యదర్శి జయంత్‌కుమార్ భాటియా, సంబంధిత అధికారులతో కలసి ఈ స్టేషన్లో పర్యటించారు. ప్రయాణికుల ఇబ్బందులను స్వయంగా చూశారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంతమేర మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు.