![Prabhadevi Temple: Dussehra Navami 2022 Celebration in Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/29/Prabhavati-Temple.jpg.webp?itok=Y_g-zI-1)
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం నడిబొడ్డున వెలసిన ప్రముఖ ప్రభాదేవి మందిరానికి మూడు వందల సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయంటే తొమ్మిది రోజులపాటు ఈ ఆలయం భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతుంది. నిత్యం వేలాది మంది భక్తులు ఉపవాస దీక్షలతో, నిష్టగా వచ్చి ఆలయంలో ఉన్న మూడు దేవీ విగ్రహాలను దర్శించుకుని వెళుతుంటారు. నవరాత్రి ఉత్సవాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని వివిధ రంగుల విద్యుత్ దీపాలతో, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. పక్షం రోజుల ముందే ఆలయ గుడికి, ప్రహరీ గోడలకు, గర్భగుడిలో రంగులు వేసి సిద్ధంగా ఉంచారు. దేవీమాత విగ్రహానికి తాపడం పనులు పూర్తిచేసి అందంగా ముస్తాబు చేశారు. విగ్రహాలను వివిధ రకాల పూలతో అలంకరించారు.
నవరాత్రి ఉత్సవాల్లో పూజారులు ముందుగా ప్రకటించిన ప్రకారం రోజుకొక రంగు చీరతో దేవిని అలంకరిస్తున్నారు. నిత్యం వేలల్లో వచ్చే భక్తుల సౌకర్యార్ధం వివిధ మౌలిక సదుపాయాలు కల్పించారు. తోపులాటలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దసరా రోజున ముంబైలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలందరూ ప్రభాదేవి మందిరానికి చేరుకుంటారు. అక్కడే పెద్ద సంఖ్యలో గుమిగూడుతారు. ఆలయంలో దేవి విగ్రహానికి బంగారం (జమ్మి చెట్టు ఆకులు) సమర్పిస్తారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ భేటీ అయ్యే బంధువులు, మిత్రులు, పరిచయస్తులందరూ ఒకరికొకరు బంగారం ఇచ్చిపుచ్చుకుని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. దసరా రోజున ఆలయంలో కనిపించే వాతావరణాన్ని బట్టి నిజంగా తెలంగాణలోని స్వగ్రామంలో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మందిరానికి చేరుకుని పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.
ఎల్ఫిన్‌స్టన్ రోడ్.. ప్రభాదేవిగా...
మూడు వందల ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆలయంలో ప్రభావతి దేవి, కాళికాదేవి, చండికాదేవి ఇలా మూడు విగ్రహాలున్నాయి. కాలక్రమేణా ఈ ప్రాంతం ప్రభాదేవిగా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని, ప్రాంతాన్ని ప్రభాదేవిగా పిలుస్తున్నారు. ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎల్ఫిన్‌స్టన్ రోడ్ రైల్వే స్టేషన్‌కు ప్రభాదేవిగా అధికారికంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి ఈ స్టేషన్‌ను ప్రభాదేవి పేరుతోనే పిలుస్తున్నారు. అంతేగాకుండా రైల్వే ప్లాట్‌ఫారంపై బోర్డులు సైతం మార్చివేశారు. టికెట్లు, సీజన్ పాస్‌లపై, అనౌన్స్‌మెంట్ ఇలా అన్ని ప్రభాదేవి పేరటనే జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల కారణంగా భక్తుల దర్శనం కోసం ప్రతీరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. దసరా రోజున అర్ధరాత్రి వరకు ఆలయం తెరిచే ఉంటుందని పూజారులు తెలిపారు.
నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయం ఆవరణలో వివిధ భక్తి పాటలు, కీర్తనలు ఆలపించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల్లో నగరంలో ఉన్న అనేక మందిరాలలో మార్పులు జరిగాయి. కానీ ప్రభాదేవి మందిరం ఇప్పటికీ పాత సంస్కృతులను కాపాడుకుంటూ వస్తోంది. ఏటా జనవరి రెండో లేదా మూడో వారంలో మందిరం వద్ద వారం రోజులపాటు జాతర జరుగుతుంది. ఈ ఆలయాన్ని ఉత్సవాల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా వందలాది భక్తులు దర్శించుకునేందుకు వస్తుంటారు. ముఖ్యంగా ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రముఖ సిద్ధివినాయక మందిరం ఉంది. దీంతో సిద్ధివినాయకున్ని దర్శించుకునేందుకు వచ్చిన స్ధానిక భక్తులతోపాటు, పర్యాటకులు ప్రభాదేవి మందిరాన్ని కచ్చితంగా దర్శించుకుని వెళతారు. దీంతో ఈ ప్రాంతం నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు, సామాన్య ప్రజల రాకపోకలతో రద్దీగా కనిపిస్తుంది.
కరోనా అనంతరం తొలిసారి ఉత్సవాలు...
కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌వల్ల గత రెండేళ్లుగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించలేకపోయారు. దీంతో లాక్‌డౌన్ కాలంలో ఈ ఆలయం భక్తులు లేక బోసిపోయి కనిపించింది. ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత నవరాత్రి ఉత్సవాలు జరగడం ఇదే ప్రథమం. దీంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా చేశారు. దసరా రోజున పెద్ద సంఖ్యలో తరలి వచ్చే జనాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దసరా రోజున నిమజ్జనాలకు వివిధ ప్రాంతాల నుంచి సముద్రతీరానికి బయలుదేరే అనేక బతుకమ్మలు ఈ ఆలయం ముందునుంచే వెళతాయి. ఇక్కడ ఆడపడుచులు కొద్దిసేపు బతుకమ్మ ఆడి ముందుకు కదులుతారు. దీంతో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. (క్లిక్ చేయండి: ఆర్థిక నష్టాల్లో మోనో రైలు.. గట్టేక్కేదెలా?)
Comments
Please login to add a commentAdd a comment