సాక్షి, ముంబై: దాదర్, పరేల్ స్టేషన్లలో స్కైవాక్‌లు నిర్మించాలని మధ్య రైల్వే పరిపాలనా విభాగం నిర్ణయించింది. దాదర్ మాదిరిగానే పరేల్ స్టేషన్‌లో కూడా ప్రయాణికుల రద్దీ నానాటికీ పెరిగిపోతోంది. రైలు దిగిన ప్రయాణికులు వెంటనే ప్లాట్‌ఫాం నుంచి బయటపడాలంటే భారీ కసరత్తు చేయాల్సిందే. దాదర్‌లో తగినన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ)లు ఉన్నప్పటికీ రద్దీ కారణంగా అవి సరిపోవడం లేదు. పరేల్‌లో రెండు ఎఫ్‌ఓబీలు ఉన్నప్పటికీ అందులో ఒక టి నిరుపయోగంగా మారింది.
అందుబాటులో ఉన్న ఒక్కటీ అందరికీ సరిపోవడం లేదు. దీంతో గత్యంతరం లేక ప్రయాణికులు తమ ప్రాణాలను ఫణంగాపెట్టి పట్టాలు దాటుతున్నారు. ప్రస్తుతం పరేల్, ఎల్ఫిన్‌స్టన్ రోడ్ ప్రాంతాలు బిజినెస్ హబ్‌గా మారాయి. మూతపడిన మిల్లు స్థలాల్లో అనేక వాణిజ్య సంస్థలు, టవర్లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, బిగ్ బజార్ లాంటి సంస్థలు వెలిశాయి. ఇవేకాకుండా ఈ పరిసరాల్లో వాడియా, కేం. టాటా, గాంధీ ఆస్పత్రులున్నాయి. దీంతో ఉద్యోగులతోపాటు రోగులు, వారి బంధువుల రాకపోకలతో నిత్యం ఈ ప్రాంతమంతా బాగా రద్దీగా ఉంటుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని పరేల్ స్టేషన్‌ను టెర్మినస్‌గా అభివృద్థి చేయాలనే ప్రతిపాదన గతంలో తెరపైకొచ్చింది. అయితే అనివార్య కారణాలవ ల్ల ఈ ప్రతిపాదన అటకెక్కింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ ఇక్కడ స్కై వాక్‌ను నిర్మించాలనే ప్రతిపాదనను తెర పైకి తెచ్చారు. ఈ మేరకు పరేల్, దాదర్ స్టేషన్లకు కలిపేవిధంగా భారీ స్కైవాక్ నిర్మించాలని సూద్ యోచిస్తున్నారు. ఒకవేళ కార్యరూపం ధరించి అందుబాటులోకి వస్తే ఇటు పరేల్, అటు దాదర్ స్టేషన్‌కు చేరుకోవడం ప్రయాణికులకు సులభమవుతుంది.
ఎలా నిర్మిస్తారంటే...
రైలు పట్టాలకు సమాంతరంగా పరేల్-దాదర్ స్టేషన్లను కలిపే విధంగా భారీ స్కైవాక్‌ను నిర్మిస్తారు. దీని వెడల్పు 12 అడుగులు ఉంటుంది. మార్గ మధ్యలో ప్రయాణికులు అక్కడక్కడా దిగేందుకు వీలుగామెట్లు నిర్మిస్తారు. దీంతో ప్రయాణికులకు ఇటు పరేల్ లేదా అటు దాదర్ స్టేషన్‌కు వెళ్లడం సులభతరమవుతుంది.
దాదర్, పరేల్ స్టేషన్లలో స్కైవాక్‌లు
Published Wed, Apr 16 2014 2:41 AM | Last Updated on Fri, Oct 5 2018 8:28 PM
Advertisement
Advertisement