పంజగుట్ట చౌరస్తాలో పాదచారుల వంతెనలో పని చేయని ఎస్కలేటర్
బంజారాహిల్స్: పంజగుట్ట చౌరస్తా... నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ చౌరస్తాలో రోడ్డు దాటేందుకు పాదచారులకు ఓ సవాలు లాంటిదే అనడం నిర్వివాదాంశం. పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట నిర్మించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి అలంకారప్రాయంగా మిగిలింది.
● రూ. 1.50 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఇక్కడ పాదచారుల వంతెన నిర్మించారు. లిఫ్ట్‌తో పాటు ఎస్కలేటర్లను కూడా రెండు వైపులా నిర్మించారు.
● ఇవి పట్టుమని పది రోజులు కూడా పని చేయకుండానే మూలనపడ్డాయి. అటు లిఫ్ట్ పనిచేయక, ఇటు ఎస్కలేటర్ తిరగక పాదచారులు యధావిధిగా మెట్లను ఆశ్రయిస్తున్నారు.
● ఈ సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేయాలో స్థానికులు, పాదచారులకు అంతుబట్టడం లేదు.
● జీహెచ్‌ఎంసీ ఈ వంతెనను నిర్మించి ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. నిర్వహణ లోపంతో వంతెన వద్ద సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
● నెల దాటుతున్నా పని చేయని ఎస్కలేటర్‌కు మరమ్మతులు చేపట్టడం లేదు.
జీవీకే వన్ చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న పాదచారులు వంతెన
సా...గుతున్న వంతెన నిర్మాణ పనులు...
● బంజారాహిల్స్ రోడ్ నెం. 1లో జీవీకే వన్ ముందు పాదచారుల వంతెన నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం పునాది పడింది. నత్తనడకన నిర్మాణ పనులు సాగుతున్నాయి. రూ. 1.50 కోట్ల వ్యయంతో ఇక్కడ వంతెన నిర్మాణం చేపడుతుండగా పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటికి ఇంకా 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
● ఇక్కడ కూడా నిత్యం రద్దీగా ఉంటూ వందలాది మంది రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం వంతెన నిర్మాణం చేపట్టిన జీహెచ్‌ఎంసీ పనుల్లో వేగం పెంచడం లేదు.
● ఏళ్ల తరబడి సాగుతున్న ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. తవ్వకాల్లో పెద్ద ఎత్తున డ్రెయినేజీ, మంచినీటి పైప్‌లైన్లు, ఎలక్ట్రిసిటీ కేబుళ్లు అడ్డుగా వచ్చాయని దీంతోనే తీవ్ర జాప్యం జరిగిందని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు చెబుతున్నారు.
పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామని ప్రకటించుకునే ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో పనులను చేపట్టలేకపోతోంది. అరకొర పనులతో పాదచారులకు చుక్కలు చూపిస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ పాదచారుల వంతెనలు నిర్మిస్తుండగా ఇవి కాస్త మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment