దాదర్‌లో మరో తెలుగు సంఘం
సాక్షి, ముంబై: ‘మహారాష్ట్ర తెలంగాణ తెలుగు మంచ్ (ఎంటీటీఎం)’ అనే కొత్త తెలుగు సంఘాన్ని శుక్రవారం దాదర్‌లో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సంఘానికి అధ్యక్షుడిగా వెంకటేశ్ గౌడ్ గుడుగుంట్ల, ఉపాధ్యక్షుడిగా గుండగోని యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా లింగయ్య నర్సింహ గొలుసుల, కోశాధికారిగా ఆవుల రాములుతోపాటు ఇతర కార్యవర్గసభ్యులను ఎంపిక చేశారు. కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి వర్షా గైక్వాడ్ హాజరు కాగా ఆమెను కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారకులైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, సహకరించిన అన్ని రాజకీయపక్షాలకు, జేఏసీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ.. ఇక్కడి వలస బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ముంబై తెలంగాణ సంఘీభావ ఉద్యమ వేదిక మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ స్థానిక సంఘాల ప్రముఖులతోపాటు రచయిత మచ్చ ప్రభాకర్, కార్మిక నాయకుడు గన్నారపు శంకర్ తదితరులు పాల్గొన్నారు.