
డోంబివలిలో 23 నుంచి శ్రీవేంకటేశ్వరసామి కల్యాణోత్సవాలు
దాదర్, న్యూస్‌లైన్ : డోంబివలి పట్టణంలో ఈ నెల 23వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఆంధ్ర కళాసమితి ఆధ్వర్యంలో తూర్పు డోంబివలిలోని తాయి పింగళే చౌక్ వద్దగల సర్వేష్ సభాగృహ ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటలకు సుప్రభాత సేవతో ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆ తర్వాత సామూహిక లక్ష తులసీ అర్చన, విష్ణు సహస్ర నామం, లలితా సహస్రనామ పఠనం, భక్తి సంగీత కార్యక్రమాలు జరగనున్నాయని వారు పేర్కొన్నారు.
22నరథ యాత్ర...
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలను పురస్కరించుకొని పశ్చిమ డోంబివలిలోని ఆనంద్‌నగర్‌లోగల ఆనంద్ కుటీర్ ప్రాంగణంలో శనివారం ఉదయం 10 గంటలకు తిరుమంజన మహోత్సవం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి సర్వేష్ సభాగృహం వరకు స్వామి వారి రథయాత్రను నిర్వహించనున్నారు. తర్వాత సభా ప్రాంగణంలో ఎదుర్కోలు వేడుకలు జరగనున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో భక్తలంతా పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆంధ్ర కళాసమితి నిర్వాహకులు కోరారు.