దాదర్: థానే–దీవా స్టేషన్ల మధ్య చేపడుతున్న ఐదు, ఆరో లేన్ల నిర్మాణ పనులకోసం రైల్వే తీసుకుంటున్న మెగా బ్లాక్ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైళ్లు రద్దు చేస్తున్నట్లు రెండు రోజుల ముందు ప్రకటిస్తుండటంతో ఇతర రైళ్లలో రిజర్వేషన్ టికెట్లు లభించడం లేదు. దీంతో గత్యంతరం లేక తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. బ్లాక్ కారణంగా రైళ్లు రద్దుచేసిన విషయం తెలియక కొందరు ఏకంగా లగేజీ, పిల్లాపాపలతో రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఆ తరువాత రైలు రద్దుచేసినట్లు తెలుసుకుని ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు.
సా..గుతోన్న మరమ్మతు పనులు...
థానే–దీవా స్టేషన్ల మధ్య ఐదు, ఆరో లేన్లు వేసే పనులు కొంతకాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇదివరకు గత నెల (డిసెంబర్)లో 18, 19వ తేదీల్లో, ఈనెల 1, 2 తేదీల్లో అలాగే 8, 9 తేదీల్లో, తాజాగా 22, 23 తేదీల్లో 10–24 గంటలపాటు బ్లాక్ తీసుకున్నారు. నిత్యం రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, కార్మికులు ఇబ్బందులు పడకుండా మరమ్మతు పనులకోసం శని, ఆదివారాలనే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా రద్దు చేస్తున్న రైళ్లలో తెలంగాణ ప్రజలు కొందరు రాకపోకలు సాగించే నాందేడ్–ముంబై తపోవన్ ఎక్స్‌ప్రెస్, ముంబై–జాల్నా జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్, ముంబై–ఆదిలాబాద్ నందీగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను శని, ఆదివారాలు రద్దు చేస్తున్నారు.
ఈ విషయాన్ని కేవలం రెండు రోజుల ముందు రైల్వే ప్రకటిస్తోంది. వీటితోపాటు స్థానికంగా తిరిగే కొన్ని లోకల్ రైళ్లను, ముంబై–మన్మాడ్, ముంబై–పుణే మధ్య తిరిగే రైళ్లను కూడా రద్దు చేస్తున్నప్పటికీ అంతగా ప్రభావం చూపదు. కాని ప్రతీసారి ముంబై నుంచి జాల్నా, నాందేడ్, ఆదిలాబాద్ రైళ్లనే రద్దు చేయడంవల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికే ఇతర రైళ్లలో రిజర్వేషన్ సీట్లన్ని ఫుల్ అవుతున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలులేకుండా పోతుంది. దీంతో స్వగ్రామానికి ఎలా వెళ్లాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రైవేటు బస్సుల్లో వెళ్లాలంటే రైల్వే చార్జీలతో పోలిస్తే రెట్టింపు లేదా మూడు రెట్లు ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పేదలకు ఇది అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. దీంతో బ్లాక్ కారణంగా రద్దు చేసే ఎక్స్‌ప్రెస్ రైళ్ల వివరాలను వారం రోజుల ముందుగానే ప్రకటించాలని కోరుతున్నారు. అలాగే జాల్నా, నాందేడ్, ఆదిలాబాద్ దిశగా వెళ్లే రైళ్లనే కాకుండా, వేర్వేరు రూట్లలో వెళ్లే రైళ్లను కూడా అప్పుడప్పుడు రద్దు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment