సాక్షి, ముంబై: దాదర్ రైల్వేస్టేషన్ త్వరలో మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ స్టేషన్‌లో ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) నడుం బిగించింది. పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలు ఈ స్టేషన్‌లోనే కలుస్తాయి. దీంతో ఈ స్టేషన్ తెల్లవారుజామునుంచి అర్ధరాత్రిదాకా కిటకిటలాడుతుంటుంది. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో 15కిపైగా ప్ల్లాట్‌ఫాంలున్నాయి. అనేక పాదచార వంతెన(ఎఫ్‌ఓబీ)లు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని వంతెనలు పశ్చిమ, సెంట్రల్ మార్గాలను కలుపుతుండగా, మరికొన్ని పశ్చిమ, సెంట్రల్ మార్గాలకు వేర్వేరుగా ఉన్నాయి. త్వరలో వీటన్నింటినీ అనుసంధానించనున్నారు. ఈవిధంగా చేయడంవల్ల ఒకప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు వెళ్లేందుకు ఎఫ్‌ఓబీలు మారాల్సిన అవసరం ఉండదు. అలాగే విపరీతమైన రద్దీ కారణంగా ప్రయాణికులు సులభంగా ప్లాట్‌ఫాం నుంచి ఎఫ్‌ఓబీకి చేరుకోలేకపోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు తోపులాటవల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు.
ఈ నేపథ్యంలో వారి సౌకర్యం కోసం 18 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా టికెట్ బుకింగ్ కౌంటర్లను కూడా మార్చనున్నారు. దాదర్‌కు కొద్దిదూరంలో ఉన్న తిలక్ బ్రిడ్జి వద్దనుంచి నేరుగా ప్లాట్‌ఫాంలపైకి చేరుకునేందుకు వీలుగా ఎఫ్‌ఓబీలను నిర్మించనున్నారు. దీంతో తిలక్ బ్రిడ్జి ప్రాంతం నుంచి స్టేషన్‌కు రావాలన్నా లేదా స్టేషన్ నుంచి బయటికెళ్లిన ప్రయాణికులు తిలక్ బ్రిడ్జి ఎక్కాలన్నా ప్రయాసపడనవసరం ఉండదు. కొద్ది రోజుల కిందట సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యదర్శి జయంత్‌కుమార్ భాటియా, సంబంధిత అధికారులతో కలసి ఈ స్టేషన్‌లో పర్యటించారు. ప్రయాణికుల ఇబ్బందులను స్వయంగా చూశారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంతమేర మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు.
మరింత సౌకర్యవంతంగా ‘దాదర్’
Published Sat, Aug 24 2013 12:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement