Dadar Railway Station
-
ముంబై లోకల్ ట్రైన్లో మహిళపై లైంగిక వేధింపులు
-
గార్డ్ ఎదుటే ట్రెయిన్లో మహిళపై వేధింపులు
ముంబై : దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటనలు తరచూ వెలుగు చూస్తుండగా.. భారత ఆర్థిక రాజధాని ముంబైలోనూ మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముంబైలో దాదర్-కుర్లా లోకల్ ట్రెయిన్లో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. దివ్యాంగులకు కేటాయించిన కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు తోటి ప్రయాణికురాలి పట్ల లైంగిక వేదింపులకు దిగాడు. అక్కడున్న వారంతా దివ్యాంగులు కావడంతో ఎవరూ అతన్ని అడ్డుకోలేకపోయారు. ఇంత జరుగుతున్నా పక్కనే లేడిస్ కంపార్ట్మెంట్లో ఉన్న సెక్యురిటీ గార్ఢు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆగంతకుడు సదరు మహిళలను శారీరకంగా వేదిస్తున్న దురాగతాన్ని పాక్షిక అంధుడైన సహ ప్రయాణికుడు వీడియో తీశాడు. అదిప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ప్రమాదంలో పడేదే..! ఆ కామాంధుడిని తీవ్రంగా ప్రతిఘటించే క్రమంలో ఆమె ఒక సందర్భంలో ట్రెయిన్ డోర్ దగ్గరకు వెళ్లింది. కొంచెమైతే ఆమె ప్రమాదానికి గురయ్యేదే. అయితే చాకచక్యంగా వ్యవహరించి ఆమె ధైర్యంగా అతనికి ఎదురు తిరగడంతో ప్రమాదం తప్పింది. తోటివారి సహాయంతో అతన్ని రైల్వే పోలీసులకు అప్పగించింది. ఎంతచెప్పినా వినిపించుకోలేదు.. ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. ‘కుర్లాలో రైలు బయలుదేరగానే సదరు మహిళపై దుండగుడి దాడి మొదలైంది. నేను అక్కడే లేడిస్ కంపార్ట్మెంట్లో ఉన్న గార్డుకి ఎమర్జెన్సీ అలారం లాగమని చెప్పాను. కానీ అతడు పట్టించుకోలేదు. నాకు కళ్లు సరిగా కనిపించవు. నేను వాడిని అడ్డుకోవడానికిపోతే నా ప్రాణాలకు ప్రమాదం అని మిన్నకుండిపోయాను’ అని సమీర్ జావెరీ చెప్పాడు. -
మరొకరికి ప్రాణం పోసింది
సాక్షి, ముంబై : ఒక్క రూపాయి క్లినిక్... లోకల్, మెట్రో రైల్వే స్టేషన్లలో మహారాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన వైద్య సేవల సదుపాయం. ప్రారంభించిన కొద్ది రోజులకే అనూహ్యమైన స్పందన దీనికి వచ్చింది. రైలు స్టేషన్ వద్దకు చేరుకోగానే వైద్యులు రైల్లోకి వెళ్లి వైద్యం అందించటం.. తద్వారా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇదిలా ఉంటే గత రాత్రి దాదర్ స్టేషన్ వద్ద ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వన్ రూపీ క్లినిక్ వైద్యుల సాయంతో ఆమె ప్రసవించింది. కళ్యాణ్ నుంచి సీఎస్టీ రూట్లో వెళ్తున్న లోకల్ రైల్లో 26 ఏళ్ల సల్మా షేక్‌కి ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో రాత్రి 10గంటల 17 నిమిషాల సమయంలో దాదర్ స్టేషన్‌కు చేరుకోగానే డాక్టర్ ప్రజ్వలిత్, ఓ మహిళ రైల్వే పోలీసాధికారి, తోటి మహిళా ప్రయాణికుల సాయంతో ఆమెకు కాన్పు చేశారు. ఆ వెంటనే తల్లిబిడ్దలిద్దరినీ ఓ ఆంబులెన్స్ సాయంతో కేఈఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. ఈ యేడాది మార్చిలో సుల్తానా ఖటున్ అనే మహిళకు కూడా దాదర్ స్టేషన్లోనే ఒక రూపాయి క్లినిక్ ద్వారా కాన్పు నిర్వహించటం విశేషం. ప్రస్తుతం ఈ వైద్య సేవలు దాదర్.. భైకళ, కుర్లా, ఘాట్కోపర్, విక్రోలి, భాండూప్, ములుండ్, థాణే, కల్వా, ఉల్లాస్‌నగర్, అంబర్నాథ్, బద్లాపూర్, వడాల రోడ్, పన్వేల్, సైన్, టిట్వాల, గోవండీ, చెంబూర్, మాన్‌ఖుర్ద్ రైల్వే స్టేషన్లలో లభిస్తుండగా.. త్వరలో ఆర్టీసీ బస్టాండ్లలో కూడా కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. -
మరింత సౌకర్యవంతంగా ‘దాదర్’
సాక్షి, ముంబై: దాదర్ రైల్వేస్టేషన్ త్వరలో మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ స్టేషన్లో ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) నడుం బిగించింది. పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలు ఈ స్టేషన్లోనే కలుస్తాయి. దీంతో ఈ స్టేషన్ తెల్లవారుజామునుంచి అర్ధరాత్రిదాకా కిటకిటలాడుతుంటుంది. ప్రస్తుతం ఈ స్టేషన్లో 15కిపైగా ప్ల్లాట్ఫాంలున్నాయి. అనేక పాదచార వంతెన(ఎఫ్ఓబీ)లు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని వంతెనలు పశ్చిమ, సెంట్రల్ మార్గాలను కలుపుతుండగా, మరికొన్ని పశ్చిమ, సెంట్రల్ మార్గాలకు వేర్వేరుగా ఉన్నాయి. త్వరలో వీటన్నింటినీ అనుసంధానించనున్నారు. ఈవిధంగా చేయడంవల్ల ఒకప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు వెళ్లేందుకు ఎఫ్‌ఓబీలు మారాల్సిన అవసరం ఉండదు. అలాగే విపరీతమైన రద్దీ కారణంగా ప్రయాణికులు సులభంగా ప్లాట్‌ఫాం నుంచి ఎఫ్ఓబీకి చేరుకోలేకపోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు తోపులాటవల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. ఈ నేపథ్యంలో వారి సౌకర్యం కోసం 18 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా టికెట్ బుకింగ్ కౌంటర్లను కూడా మార్చనున్నారు. దాదర్‌కు కొద్దిదూరంలో ఉన్న తిలక్ బ్రిడ్జి వద్దనుంచి నేరుగా ప్లాట్‌ఫాంలపైకి చేరుకునేందుకు వీలుగా ఎఫ్‌ఓబీలను నిర్మించనున్నారు. దీంతో తిలక్ బ్రిడ్జి ప్రాంతం నుంచి స్టేషన్‌కు రావాలన్నా లేదా స్టేషన్ నుంచి బయటికెళ్లిన ప్రయాణికులు తిలక్ బ్రిడ్జి ఎక్కాలన్నా ప్రయాసపడనవసరం ఉండదు. కొద్ది రోజుల కిందట సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యదర్శి జయంత్‌కుమార్ భాటియా, సంబంధిత అధికారులతో కలసి ఈ స్టేషన్లో పర్యటించారు. ప్రయాణికుల ఇబ్బందులను స్వయంగా చూశారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంతమేర మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు. -
దాదర్ రైల్వేస్టేషన్‌కు బాంబు బూచి
సాక్షి, ముంబై: నిత్యం రద్దీగా ఉండే దాదర్ రైల్వేస్టేషన్‌ను పేల్చివేస్తామంటూ ఫోన్ రావడంతో పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఫోన్ పుణేలోని రైల్వే పోలీసు కార్యాలయానికి బుధవారం ఉదయం వచ్చింది. బుధవారం సాయంత్రం దాదర్ రైల్వే స్టేషన్‌ను పేల్చివేస్తామంటూ అవతలి వ్యక్తి బెదిరించి ఫోన్ పెట్టేశాడు. ఈ విషయాన్ని పుణే రైల్వే పోలీసులు తక్షణమే దాదర్‌లోని కంట్రోల్ రూంకు చేరవేశారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు నగర పోలీసులతో సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదర్ స్టేషన్‌లోని పశ్చిమ, సెంట్రల్ మార్గాల్లో దాదాపు 15పైగా ప్లాట్‌ఫాంలున్నాయి. అంతటా పోలీసులను మోహరించి అణువణువూ గాలించారు. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. నగరంలో రద్దీగా ఉండే కీలక మూడు రైల్వే స్టేషన్లలో దాదర్ ఒకటి. ఫాస్ట్ లోకల్ రైళ్లు, దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లు ఆగుతాయి. దీంతో ఈ స్టేషన్ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రిదాకా ప్రయాణికుల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉంటుంది.