‘ఎత్తర కోడి తిప్పర మీసం’ అని సంక్రాంతి వస్తే బరిలోకి దిగుతారు పందెం రాయుళ్లు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోళ్ల పందేలు జరపడం ఆనవాయితీ. అయితే పోటీలో గెలిచేందుకు కోళ్లను సాకే తీరు అంతే వినూత్నం. ఈ సంవత్సరం సంక్రాంతి పుంజు ఒక్కోటి రెండున్నర లక్షలు పలుకుతోంది. పందెం కోళ్ల కబుర్లకోసం నెటిజన్లు చెవి కోసుకుంటున్నారు కూడా.
మగకోళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకుంటాయి? ఆడకోళ్లు సమర్థమైన కోడి పుంజునే ఎంచుకుంటాయి కాబట్టి. ఇతర మగకోళ్లను తరిమికొట్టి ఆడకోళ్లకు చేరువ కావాలి కాబట్టి. ఆడకోళ్లను, వాటి గుడ్లను రక్షించడానికి శక్తి కావాలి కాబట్టి. క్రీస్తు పూర్వం నుంచే కోడి పందాలు ప్రపంచదేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఉన్నాయి. కుమారస్వామి పతాకంపై కూడా కోడిపుంజు ఉంటుంది.
కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉంటాయి. కాకి, డేగ, నెమలి, పింగళి, పూల, మైల, కౌజు, సేతు, సేవల, నల్లబోర, ఎర్రపొడ.. ఇలా. కోడి పందేల పండితులు, పెంచే ఆసాములు దూరం నుంచి చూసి కూడా ఏ పుంజు ఏ జాతికి చెందిందో చెప్పేయగలరు. పందేల వేళ దేని మీద దేన్ని వదలాలో ఒక లెక్క ఉంటుంది. కోడి పుంజుల పంచాంగం, జాతకాలు ఉంటాయంటే నమ్ముతారా మీరు? ఉన్నాయి. కుక్కుట శాస్త్రమే ఉంది. పల్నాటి యుద్ధం కోడి పందేల ఆనవాయితీని మరవనీకుండా చేస్తూనే ఉంది.
కోడి పందేల కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసే వారు.. కోడి పందేల సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయం గడించేవారు గోదావరి జిల్లాల్లో ఉన్నారు. పందెం కోళ్లను పెంచి అమ్ముతారు. ప్రస్తుతం ఒక్కో కోడి రెండున్నర లక్షల ధర పలుకుతోంది. ఇవి బాగా పోరాడటానికి గతంలో ఏం చేసేవారోగాని ఇప్పుడు వయాగ్రా, శిలాజిత్ వంటివి కూడా పెడుతున్నారని తాజా వార్తలు. లోకల్ బ్రీడ్స్‌లో మోసాలు ఉంటాయని థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ నుంచి కూడా పుంజులను తెప్పించుకుంటున్నారు. అయితే అదంత సులువు కాదు.
కోడి పందేలకు తర్ఫీదు ఇచ్చే గురువులు వేరే ఉంటారు. వీరు అక్టోబర్ నుంచి పుంజులకు శిక్షణ మొదలెట్టి జనవరికి పూర్తి చేస్తారు. వీటికి తినిపించే తిండి అమోఘం కాబట్టి వీటి రుచి అమోఘమని ఓడిన వాటిని ఎగరేసుకుపోయేవారూ ఉన్నారు. థాయ్‌లాండ్‌లో ఇలాంటి పోటీల్లో ఓడిన కోడిని 20 లక్షలకు కూడా కొన్న సందర్భాలున్నాయి. ఈసారి మనవాళ్లు ఎంతకు కొంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment