Kodipandelu
-
సంక్రాంతి స్పెషల్: 'పందెం కోడి' వామ్మో ఇంత రేటా?
‘ఎత్తర కోడి తిప్పర మీసం’ అని సంక్రాంతి వస్తే బరిలోకి దిగుతారు పందెం రాయుళ్లు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోళ్ల పందేలు జరపడం ఆనవాయితీ. అయితే పోటీలో గెలిచేందుకు కోళ్లను సాకే తీరు అంతే వినూత్నం. ఈ సంవత్సరం సంక్రాంతి పుంజు ఒక్కోటి రెండున్నర లక్షలు పలుకుతోంది. పందెం కోళ్ల కబుర్లకోసం నెటిజన్లు చెవి కోసుకుంటున్నారు కూడా. మగకోళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకుంటాయి? ఆడకోళ్లు సమర్థమైన కోడి పుంజునే ఎంచుకుంటాయి కాబట్టి. ఇతర మగకోళ్లను తరిమికొట్టి ఆడకోళ్లకు చేరువ కావాలి కాబట్టి. ఆడకోళ్లను, వాటి గుడ్లను రక్షించడానికి శక్తి కావాలి కాబట్టి. క్రీస్తు పూర్వం నుంచే కోడి పందాలు ప్రపంచదేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఉన్నాయి. కుమారస్వామి పతాకంపై కూడా కోడిపుంజు ఉంటుంది. కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉంటాయి. కాకి, డేగ, నెమలి, పింగళి, పూల, మైల, కౌజు, సేతు, సేవల, నల్లబోర, ఎర్రపొడ.. ఇలా. కోడి పందేల పండితులు, పెంచే ఆసాములు దూరం నుంచి చూసి కూడా ఏ పుంజు ఏ జాతికి చెందిందో చెప్పేయగలరు. పందేల వేళ దేని మీద దేన్ని వదలాలో ఒక లెక్క ఉంటుంది. కోడి పుంజుల పంచాంగం, జాతకాలు ఉంటాయంటే నమ్ముతారా మీరు? ఉన్నాయి. కుక్కుట శాస్త్రమే ఉంది. పల్నాటి యుద్ధం కోడి పందేల ఆనవాయితీని మరవనీకుండా చేస్తూనే ఉంది. కోడి పందేల కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసే వారు.. కోడి పందేల సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయం గడించేవారు గోదావరి జిల్లాల్లో ఉన్నారు. పందెం కోళ్లను పెంచి అమ్ముతారు. ప్రస్తుతం ఒక్కో కోడి రెండున్నర లక్షల ధర పలుకుతోంది. ఇవి బాగా పోరాడటానికి గతంలో ఏం చేసేవారోగాని ఇప్పుడు వయాగ్రా, శిలాజిత్ వంటివి కూడా పెడుతున్నారని తాజా వార్తలు. లోకల్ బ్రీడ్స్లో మోసాలు ఉంటాయని థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ నుంచి కూడా పుంజులను తెప్పించుకుంటున్నారు. అయితే అదంత సులువు కాదు. కోడి పందేలకు తర్ఫీదు ఇచ్చే గురువులు వేరే ఉంటారు. వీరు అక్టోబర్ నుంచి పుంజులకు శిక్షణ మొదలెట్టి జనవరికి పూర్తి చేస్తారు. వీటికి తినిపించే తిండి అమోఘం కాబట్టి వీటి రుచి అమోఘమని ఓడిన వాటిని ఎగరేసుకుపోయేవారూ ఉన్నారు. థాయ్‌లాండ్‌లో ఇలాంటి పోటీల్లో ఓడిన కోడిని 20 లక్షలకు కూడా కొన్న సందర్భాలున్నాయి. ఈసారి మనవాళ్లు ఎంతకు కొంటారో చూడాలి. ఇవి చదవండి: మొగలిపువ్వంటీ మొగుడ్నీయవే : నాలుగు రోజుల ముచ్చట -
Chintamaneni Prabhakar: 60కి పైగా కేసులు.. రూటు మార్చిన చింతమనేని
సాక్షి, ఏలూరు: సొంత ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కోడిపందేలు నిర్వహించడం ఇబ్బందిగా మారడం.. తన ఆటలు ఇక్కడ సాగకపోవడంతో చింతమనేని ప్రభాకర్ హైదరాబాద్ వైపు రూటు మార్చినట్లు స్పష్టమవుతోంది. పఠాన్‌చెరు మండలంలో చింతమనేని ప్రభాకర్ వారం క్రితం కోడిపందేలు నిర్వహించడం మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. దీంతో చింతమనేని పరారైన తరువాత చివరిగా ఆయన మొబైల్ సిగ్నల్ శంషాబాద్‌లో చూపించి, అక్కడ కట్ అయింది. ఇతర రాష్ట్రాలకు పరారై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. చింతమనేని దౌర్జన్యకాండ ఇదే.. నిజానికి.. చింతమనేని దురుసుగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, దౌర్జన్యాలకు దిగడం ద్వారా వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ► అతనిపై ఇప్పటివరకు మొత్తం 60 కేసులున్నాయి. పెదవేగి ఎంపీపీగా ఉన్నప్పుడే 10 కేసులు నమోదయ్యాయి. రెండు ఎస్సీ, ఎస్టీ కేసులూ ఉన్నాయి. ►గతంలో ఎస్ఐలుగా పనిచేసిన ఆనంద్‌రెడ్డి, మోహనరావులపై, అంగన్వాడీ కార్యకర్తలపై బూతు పురాణం, దౌర్జన్యం చేసిన ఘటనలో కేసు, తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి దాడిచేసిన కేసు వీటిల్లో ముఖ్యమైనవి. అలాగే.. ► 2010లో ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో చింతమనేనిపై తెరిచిన రౌడీషీట్ నేటికీ కొనసాగుతోంది. ► గతంలో అప్పటి రాష్ట్రమంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడిచేసిన కేసు కూడా ఉంది. ► చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దెందులూరు నియోజకవర్గాన్ని కోడిపందేలు, పేకాటకు అడ్డాగా మార్చేశాడు. ► 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కూడా తన వ్యవహారశైలి మారకుండా అదే రీతిలో కొనసాగుతూ పందేలను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నాడు. చదవండి: (చింతమనేనిదే పందెం కోడి!) -
కోడి పందేల నిర్వాహకులపై 1,347 కేసులు
మీడియా సమావేశంలో డీజీపీ సాంబశివరావు వెల్లడి సాక్షి, అమరావతి: సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహించిన వారిపై రాష్ట్రవ్యాప్తంగా 1,347 కేసులు నమోదు చేసినట్టు డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో 337, తూర్పుగోదావరి జిల్లాలో 136, కృష్ణా జిల్లాలో 471, విజయవాడ సిటీలో 91, గుంటూరు అర్బన్‌లో 3, గుంటూరు రూరల్‌లో 309 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన గుడివాడ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విజయవాడలో దుండగులు ధ్వంసం చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని అదే స్థానంలో పెట్టిస్తామన్నారు. విగ్రహాన్ని ధ్వంసంచేసిన వారిని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చామని డీజీపీ చెప్పారు. కైకలూరు మండలం ఆటపాక, కలిదిండి మండలం తాళ్లాయి పాలెంలో కొందరు ఫ్లెక్సీలు చించి వివాదం సృష్టించే ప్రయత్నాలు చేశారని డీజీపీ అన్నారు. పథకం ప్రకారం కొన్ని అసాంఘిక శక్తులు కులాలు, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు నాయకుల విగ్రహాలు, సినిమా హీరోల ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్నట్టు గుర్తించామని డీజీపీ చెప్పారు. -
సంక్రాంతి సంబరాలు
ఏటి పండగకు ఏర్పాట్లు ‘పుంజు’కున్న పందేలు నెల్లూరు(సెంట్రల్): బసవన్నల గిట్టల చప్పుడు.. హరిదాసుల సంకీర్తనలు, గొబ్బెమ్మల ఊరేగింపులు, ఆటలు, ముగ్గుల పోటీలతో జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. పండగను మూడు రోజుల పాటు సందడి సందడిగా జరుపుకున్నారు. శుక్రవారం భోగి, శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ పండగలను సంబరంగా చేసుకున్నారు. కొన్ని చోట్ల నాల్గో రోజు ఏటి పండగకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఐదు రోజులు పాటు గొబ్బెమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఐదో రోజు నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పల్లెల్లో పండగ కళ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుగణంతో పల్లెటూళ్లు కళకళలాడాయి. ప్రధానంగా భోగి పండగ రోజు దోశలు, కోడికూరతో, సంకాంత్రి రోజున పెద్దలకు వారికి నూతన వస్త్రాలు పెట్టుకుని ఎంతో భక్తిభావంతో జరుపుకున్నారు. కనుమ రోజు అన్ని దేవతలను తనలో నిలుపుకుని ఉన్న గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో సోమవారం జరిగే ఏటి పండగకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ‘పుంజు’కున్న పందేలు సంకాంత్రి ముందు నుంచి పోలీసుల చెబుతున్నది ఒక్కటే మాట..ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు.. అయితే ఏడాదికి ఒక్క సారి వచ్చే సంక్రాంతి రోజున కోడి పుంజుల పందేలను ఆపలేక పోయారని సమాచారం. సంక్రాంతి ఒక్క రోజే రూ.లక్షల్లో పందేలకు సంబంధించి చేతులు మారాయని తెలిసింది. ప్రధానంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ఈ పందేలు జోరుగా సాగాయి. పందెంలో పాల్గొనే కోడి పుంజు ఖరీదు రూ.4 వేల నుంచి రూ.40 వేల వరకు పలికినట్లు తెలిసింది. కొన్ని చోట్ల ముడుపులు తీసుకున్న పోలీసులు పందేలు నిర్వహిస్తున్న వైపు కన్నెత్తికూడా చూడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేకాట జోరు.. పేకాటరాయుళ్లు ఈ మూడు రోజులు నగర శివారులతో పాటు చేపల చెరువులు, రొయ్యల గుంతల వద్దకు కార్లలో వచ్చి పేకాట జోరు గా నిర్వహించినట్లు తెలుస్తోంది. -
పందెం కాస్కో!
దీపావళి ముసుగులో కోడిపందేలు కోడి పందేల సంస్కృతి జిల్లాకు కూడా పాకింది. పోలీసుల అనుమతితో ఈ జూదం నిర్వహిస్తూ బెట్టింగ్‌రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వస్తున్న పందెంరాయుళ్లకు మందు, విందు సకల సౌకర్యాలు సమకూర్చుతున్నారు. పోలీసులు, కొందరు మీడియా ప్రతినిధులు, ఓ ప్రజాప్రతినిధి అండతో సాగుతున్న చీకటి ఆటలో సామాన్యుల జేబులు గుల్లవుతున్నాయి. వీపనగండ్ల శివారులో యథేచ్ఛగా సాగుతున్న కోడిపందేల బాగోతమిది..! సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దీపావళి పండుగ ముసుగులో పది రోజులుగా వీపనగండ్ల శివారులో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వీపనగండ్ల నుంచి తూంకుంటకు వెళ్లే దారిలో సుమారు 2కి.మీ దూరంలో గుంతవంపు అనే ప్రదేశాన్ని నిర్వాహకులు అడ్డాగా మార్చుకున్నారు. చుట్టూ దట్టంగా చెట్లుండడంతో సామాన్యులకు ఈ ప్రదేశం అంత సులువుగా కని పించదు. దీపావళి సందర్భంగా ఏటా ఈ పందేలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీపనగండ్లకు చెందిన బోయ బాలచంద్రయ్య అనే వ్యక్తితో పాటు మరో నలుగురు యువకులు బెట్టింగుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని బరి గీసి మరీ కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11గంటలకు మొదలయ్యే బెట్టింగు రాయుళ్ల సందడి సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతోంది. బైక్‌లు, ఆటోలతో పాటు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చుకుని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వాలిపోతున్నారు. సకల సౌకర్యాలు మహబూబ్‌నగర్, కొల్లాపూర్, వనపర్తి తది తర ప్రాంతాలతోపాటు కర్నూల్, ఒంగోలు, గుంటూరు వంటి సుదూరప్రాంతాల నుంచి బెట్టింగురాయుళ్లు పెద్దసంఖ్యలో వస్తున్నారు. పందేల్లో పాల్గొనేందుకు వస్తున్న వారికి చి కెన్ బిర్యానీ,చికెన్ రైస్,ఉడికించిన కోడిగుడ్లు, మద్యం, ఇతర తినుబండారాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పందెం రూ.5వేల నుంచి మొదలుకుని రూ.50వేల వరకు సాగుతోంది. రోజుకు కనీసం నాలుగు నుంచి ఆరు పందేలు నిర్వహిస్తుండడంతో రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. బెట్టింగురాయుళ్లు రూ.500 నుంచి రూ.5వేల వరకు పందెంగా ఒడ్డుతున్నారు. పందెంలో ఓడినా కోడిమాంసం రుచిచూసేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తూ మరీ పోటీపడుతున్నారు. పోలీసుల కనుసన్నల్లోనే! వీపనగండ్ల సాగుతున్న కోడిపందేల వ్యవహారం పోలీసు యంత్రాంగం కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. పందెం జరిగే ప్రాంతానికి వెళ్లే కొత్తవారిపై నిర్వాహకులు నిఘాపెడుతూ శల్య పరీక్ష చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపిస్తే దాడులు చేసేందుకైనా వెనుకాడని పరిస్థితి కనిపిం చింది. జిల్లా ఎస్పీ బదిలీ కావడం, కొత్త ఎస్పీ బాధ్యతలు తీసుకోకపోవడం స్థానిక పోలీసులు, బెట్టింగు నిర్వాహకులకు వరంగా మారింది. స్థానిక పోలీసులకు భారీ మొత్తంలో ముట్టజెప్పిన నిర్వాహకులు పది రోజులుగా యథేచ్ఛంగా కోడిపందేలు కొనసాగిస్తున్నారు. పైగా తాము పోలీసుల అనుమతితోనే బెట్టిం గులు నిర్వహిస్తున్నట్లు బహిరంగంగా చెప్పడం శోచనీయం. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కూడా ఈ అనుమతుల వ్యవహారం వెనుక కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. స్థానిక మీడియాతో పాటు డీఎస్పీ స్థాయి అధికారి నుంచి కిందిస్థాయి అధికారి వరకు ముడుపులు అందినట్లు తెలిసింది. దీపావళి పండుగ ముసుగులో ప్రారంభమైన ఈ దందా మరికొంత కాలం సాగే అవకాశం కనిపిస్తోంది.