సంక్రాంతి సంబరాలు
- ఏటి పండగకు ఏర్పాట్లు
- ‘పుంజు’కున్న పందేలు
నెల్లూరు(సెంట్రల్): బసవన్నల గిట్టల చప్పుడు.. హరిదాసుల సంకీర్తనలు, గొబ్బెమ్మల ఊరేగింపులు, ఆటలు, ముగ్గుల పోటీలతో జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. పండగను మూడు రోజుల పాటు సందడి సందడిగా జరుపుకున్నారు. శుక్రవారం భోగి, శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ పండగలను సంబరంగా చేసుకున్నారు. కొన్ని చోట్ల నాల్గో రోజు ఏటి పండగకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఐదు రోజులు పాటు గొబ్బెమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఐదో రోజు నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పల్లెల్లో పండగ కళ
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుగణంతో పల్లెటూళ్లు కళకళలాడాయి. ప్రధానంగా భోగి పండగ రోజు దోశలు, కోడికూరతో, సంకాంత్రి రోజున పెద్దలకు వారికి నూతన వస్త్రాలు పెట్టుకుని ఎంతో భక్తిభావంతో జరుపుకున్నారు. కనుమ రోజు అన్ని దేవతలను తనలో నిలుపుకుని ఉన్న గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో సోమవారం జరిగే ఏటి పండగకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
‘పుంజు’కున్న పందేలు
సంకాంత్రి ముందు నుంచి పోలీసుల చెబుతున్నది ఒక్కటే మాట..ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు.. అయితే ఏడాదికి ఒక్క సారి వచ్చే సంక్రాంతి రోజున కోడి పుంజుల పందేలను ఆపలేక పోయారని సమాచారం. సంక్రాంతి ఒక్క రోజే రూ.లక్షల్లో పందేలకు సంబంధించి చేతులు మారాయని తెలిసింది. ప్రధానంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ఈ పందేలు జోరుగా సాగాయి. పందెంలో పాల్గొనే కోడి పుంజు ఖరీదు రూ.4 వేల నుంచి రూ.40 వేల వరకు పలికినట్లు తెలిసింది. కొన్ని చోట్ల ముడుపులు తీసుకున్న పోలీసులు పందేలు నిర్వహిస్తున్న వైపు కన్నెత్తికూడా చూడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పేకాట జోరు..
పేకాటరాయుళ్లు ఈ మూడు రోజులు నగర శివారులతో పాటు చేపల చెరువులు, రొయ్యల గుంతల వద్దకు కార్లలో వచ్చి పేకాట జోరు గా నిర్వహించినట్లు తెలుస్తోంది.