భర్త చోరీలు మానకపోవటంతో భార్య కఠిన నిర్ణయం
ఇద్దరు బిడ్డలకు ఉరివేసి తానూ బలవన్మరణం
ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్న మృతురాలు
పెళ్లికి ముందే నిజం దాచి మోసం చేసిన వ్యక్తి
పెళ్లి తర్వాత విషయం తెలిసి మార్చాలని చూసినా మారని భర్త
ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో ఘటన
మధిర: బస్సులో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో తల్లిదండ్రులను ఎదిరించి మరీ మతాంతర వివాహం చేసుకుంది. ఇంతలోనే భర్త పెళ్లిముందు చెప్పినట్లు ఉద్యోగం చేయటంలేదని, పలు చోరీ కేసుల్లో నిందితుడని తెలియడంతో తల్లడిల్లిపోయింది. తప్పుడు పనులు ఆపేయాలని, కష్టపడి బతుకుదామని చెప్పిచూసింది. అయినా అతడిలో మార్పు రాకపోవటంతో అవమాన భారం భరించలేక ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడింది.
గుండెను మెలిపెడుతున్న ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన మౌనిక అలియాస్ ప్రెజా (30) ఐదేళ్ల క్రితం విజయవాడ నుంచి మధిరకు బస్సులో వస్తుండగా.. మధిర మండలం నిదానపురానికి చెందిన షేక్ బాజీ ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. అక్కడ వారిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మౌనిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవటంతో ఆమె బాజీతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. వీరికి మెహక్ (4), మెనురూల్ (3) అనే కుమార్తెలు ఉన్నారు. నిదానపురంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
అవమానంతో అసాధారణ నిర్ణయం..
ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన బాజీ.. నిజానికి పలు చోరీ కేసుల్లో నిందితుడని మౌనికకు తెలిసింది. దీంతో చోరీలు మానేయాలని భర్తకు నచ్చజెప్పింది. అయినా అతడిలో మార్పు రాలేదు. బాజీపై ఈ నెల 22న (బుధవారం) ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు విచారణ ప్రారంభించారు. బోనకల్ మండలం మోటమర్రిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గురువారం నిదానపురం చేరుకున్న పోలీసులు.. బాజీ చోరీ చేస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో, ఫొటోలు ఆమెకు చూపించారు. దీంతో ఆమె గుండె పగిలిపోయింది. ఆ బాధలోనే కఠిన నిర్ణయం తీసుకుంది. అద్దెకు తీసుకున్న రేకుల షెడ్డు ఇనుప పైపునకు చీరలను కట్టి ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసింది.
ఆపై మరో చీరతో ప్రెజా సైతం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వైరా ఏసీపీ రెహమాన్, మధిర సీఐ మధు, ఎస్సై లక్ష్మీభారవి అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment