baji
-
మారలేదు.. ఇక మారడని..!
మధిర: బస్సులో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో తల్లిదండ్రులను ఎదిరించి మరీ మతాంతర వివాహం చేసుకుంది. ఇంతలోనే భర్త పెళ్లిముందు చెప్పినట్లు ఉద్యోగం చేయటంలేదని, పలు చోరీ కేసుల్లో నిందితుడని తెలియడంతో తల్లడిల్లిపోయింది. తప్పుడు పనులు ఆపేయాలని, కష్టపడి బతుకుదామని చెప్పిచూసింది. అయినా అతడిలో మార్పు రాకపోవటంతో అవమాన భారం భరించలేక ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. గుండెను మెలిపెడుతున్న ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన మౌనిక అలియాస్ ప్రెజా (30) ఐదేళ్ల క్రితం విజయవాడ నుంచి మధిరకు బస్సులో వస్తుండగా.. మధిర మండలం నిదానపురానికి చెందిన షేక్ బాజీ ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. అక్కడ వారిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మౌనిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవటంతో ఆమె బాజీతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. వీరికి మెహక్ (4), మెనురూల్ (3) అనే కుమార్తెలు ఉన్నారు. నిదానపురంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.అవమానంతో అసాధారణ నిర్ణయం.. ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన బాజీ.. నిజానికి పలు చోరీ కేసుల్లో నిందితుడని మౌనికకు తెలిసింది. దీంతో చోరీలు మానేయాలని భర్తకు నచ్చజెప్పింది. అయినా అతడిలో మార్పు రాలేదు. బాజీపై ఈ నెల 22న (బుధవారం) ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు విచారణ ప్రారంభించారు. బోనకల్ మండలం మోటమర్రిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిదానపురం చేరుకున్న పోలీసులు.. బాజీ చోరీ చేస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో, ఫొటోలు ఆమెకు చూపించారు. దీంతో ఆమె గుండె పగిలిపోయింది. ఆ బాధలోనే కఠిన నిర్ణయం తీసుకుంది. అద్దెకు తీసుకున్న రేకుల షెడ్డు ఇనుప పైపునకు చీరలను కట్టి ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసింది. ఆపై మరో చీరతో ప్రెజా సైతం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వైరా ఏసీపీ రెహమాన్, మధిర సీఐ మధు, ఎస్సై లక్ష్మీభారవి అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఆ దమ్ము టీడీపీ నేతలకు ఉందా..?
సాక్షి, అమరావతి: చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడినా కూడా టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజీ నిప్పులు చెరిగారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పీఏ వద్ద దొరికిన డబ్బుని చాలా చిన్న విషయంగా టీడీపీ ప్రచారం చేసుకోవడంపై మండిపడ్డారు. టీడీపీ నేతల మెదళ్లకు తెగులు పట్టుకుందని దుయ్యబట్టారు. అక్రమంగా సంపాదించిన లెక్కల తుట్టె కదులుతుంటే టీడీపీ నేతల మతి పోతోందని విమర్శించారు. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ దోపిడీ చేసిందన్నారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీజ్ చేసిన అన్నింటికీ ఐటీ అధికారులు రశీదులు ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో ఐటీ అధికారులను రాకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.. రెండు వేల కోట్లు దొరికితే తక్కువేనంటూ టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని.. కోటాను కోట్లు అక్రమంగా సంపాదించిన తమకు రెండు వేల కోట్లు చిన్నవిగా కనిపిస్తున్నాయని అర్థమవుతోందన్నారు. మరో బుద్ధుడు, గాంధీలా చెప్పుకునే చంద్రబాబు ఐటీ అధికారులకు దొరికిన రెండు వేల కోట్లపై సమాధానం చెప్పాలన్నారు. పసుపు దొంగలు నాలుగేళ్లు సంపాదించిన అక్రమ సంపాదనను బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులు, నీరు-చెట్టు, మరుగు దొడ్ల పథకం, ఉపాధి హామీలో తిన్న డబ్బుల మొత్తాన్ని కక్కించేదాక బీజేపీ నిద్రపోదన్నారు. చంద్రబాబు కార్యదర్శి షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి రెండు వేల కోట్లను అక్రమంగా విదేశాలకు తరలించారనేది ఐటీ అధికారులు స్పష్టంగా తేటతెల్లం చేశారని పేర్కొన్నారు. మొత్తం 40 ప్రాంతాల్లో సీజ్ చేసిన 25 లాకర్ల వివరాలు బయటకు రావాల్సి ఉందని చెప్పారు. ఒక ఉన్నత స్థాయి వ్యక్తి దగ్గర పీఏగా పనిచేసిన వ్యక్తిపై ఐటీ దాడులు జరిగితే సంబంధింత వ్యక్తిది బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పే దమ్ము టీడీపీ నాయకులకు ఉంటే బహిరంగ చర్చకు రావాలని బాజీ సవాల్ విసిరారు. -
సిలిండర్ పేలి వ్యక్తి సజీవదహనం
సమయం తెల్లవారుజాము 4.30 గంటలు... చుట్టుపక్కల వారంతా గాఢ నిద్రలో ఉన్నారు... ఆ అభాగ్యుడు మాత్రం అనారోగ్యంతో బాధపడుతూ లేవలేని స్థితిలో మంచానపడి నిద్రపోతున్నాడు.... అతనిపై అమ్మోరు పూనటంతో ఇంట్లో వాళ్ళు సైతం దూరంగా ఆరుబయట నిద్రపోతున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కలత నిద్రలో ఉన్న ఆ అభాగ్యుడిపైకి మృత్యువు మంటల రూపంలో దూసుకువచ్చింది. నిముషాల వ్యవధిలో అగ్నికీలలు అతన్ని చుట్టుముట్టి శరీరాన్ని మాంసపు ముద్ద చేసేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన అతని తల్లి.. కొడుకు మంటల్లో కాలిపోతున్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి తల్లడిల్లిపోయింది.... ‘బేటా బాహర్ ఆ..’ అంటూ ఆర్తనాదాలు చేసింది. బేటాను కాపాడండంటూ చుట్టుపక్కల ఇళ్ల తలుపులను తట్టి ప్రాధేయపడింది. ఇరుగు పొరుగు వచ్చి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించేలోపే ఘోరం జరిగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కోనేరుసెంటర్ (మచిలీపట్నం): స్థానిక రాజుపేటలోని మగ్గాలకాలనీకి చెందిన మహమ్మద్ బాజీ (38) వంట పనులు చేస్తుంటాడు. పదేళ్ళ క్రితం అతనికి విజయవాడకు చెందిన మహమ్మద్ బహరున్నీసాతో వివాహం అయ్యింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు రావటంతో రెండు నెలల క్రితం బహరున్సీసా పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాజీ తన తల్లి మెహరున్నీసాతో ఉంటున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం బాజీకి పొంగు జ్వరం సోకింది. అప్పటి నుంచి అన్నపానీయాలు తీసుకోవటం లేదు. దీంతో అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. షార్టు సర్క్యూట్తో అగ్నిప్రమాదం.. బుధవారం రాత్రి బాజీ నిద్రలోకి జారుకున్నాడు. బాజీకి పొంగు జ్వరం సోకటంతో తల్లి మెహరున్నీసా ఇంటి వరండాలో పడుకుంటోంది. తెల్ల వారుజాము సుమారు 4.30 గంటల సమయంలో విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు రేగాయి. అలా రేగిన మంటలు ఇంటి కప్పుకు అంటుకున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన మెహరున్నీసా వరండాలో నుంచి బాజీని బయటికి వచ్చేయమంటూ బిగ్గరగా కేకలు పెట్టింది. మంటలను అదుపు చేసేందుకు సహాయం కోరుతూ చుట్టుపక్కల వారిని నిద్రలేపేందుకు పరుగులు పెట్టింది. గ్యాస్ బండ పేలటంతో సజీవ దహనం.. ఇంటికి నిప్పంటుకుని మంటలు రేగటంతో పాటు తల్లి కేకలు విన్న బాజీ ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు. అయితే అనారోగ్యంతో నీరసించిపోయిన బాజీ శరీరం అందుకు సహకరించలేదు. అయినప్పటికీ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎగసిపడుతున్న మంటలకు గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలటంతో ఇంటి మొత్తాన్ని మంటలు ఆవహించాయి. లేవలేనిస్థితిలో ఉన్న బాజీని సైతం మంటలు చుట్టుముట్టి అతని శరీరాన్ని దహించివేశాయి. ఈ ప్రమాదంలో బాజీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు సైతం కంటతడిపెట్టగా, కళ్ల ఎదుట కొడుకు కాలిపోతుంటే చూస్తూ తట్టుకోలేని ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా విలపించింది. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.. స్థానికుల సమాచారంలో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బాజీ శరీరం కాలి బూడిద అయిపోయింది. సమాచారం అందుకున్న ఇనగుదురుపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మెహరున్నీసా నుంచి వివరాలు తెలుసుకుని ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. -
దేవినేని బాజీ ఆకస్మిక మృతి
విజయవాడ(ఆటోనగర్) : మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ) సోదరుడు, వ్యాపారవేత్త దేవినేని బాజీప్రసాద్(60) మంగళవారం వేకువజామున ఆకస్మికంగా మరణించారు. ఆయనకు గతంలో రెండుసార్లు గుండెపోటు రాగా, ఆపరేషన్లు చేశారు. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో మరోసారి గుండెనొప్పి రావడంతో ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందారు. బాజీప్రసాద్కు భార్య అపర్ణ (రెండో డివిజన్ కార్పొరేటర్), ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భారతీనగర్లోని స్వగృహంలో ఆయన భౌతికకాయం వద్ద పలు వురు ప్రముఖులు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో బాజీప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రులు దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, బోడే ప్రసాద్, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), నగర మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి తదితరులు బాజీప్రసాద్ భౌతికాయం వద్ద నివాళులర్పించి, దేవినేని నెహ్రూ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయంత్రం గుణదల కార్మెల్నగర్లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో బాజీప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించారు.