కదిరి పట్టణంలో పట్టపగలే ఓ ఇంట్లో దొంగలుపడ్డారు.
కదిరి : కదిరి పట్టణంలో పట్టపగలే ఓ ఇంట్లో దొంగలుపడ్డారు. పది తులాలు బంగారు, మరో పది తులాలు వెండి ఆభరణాలతోపాటు రూ.25వేల నగదు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఊరెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మౌనిక థియేటర్ నిర్వాహకుడు రామమూర్తి నారాయణరావు వీధిలో నివాసముంటున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తెకు సపర్యలు చేయడానికి రామమూర్తి భార్య వెళ్లింది. మూడు రోజుల క్రితం ఆయన కూడా హైదరాబాద్ వెళ్లాడు.
ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దొంగలు మంగళవారం పట్టపగలే వెనుక తలుపుగుండా గుండా లోనికి ప్రవేశించారు. మూడు బీరువాలు తెరిచి ఒక బంగారు నెక్లెస్, 5 డాలర్ చైన్లు, 5 ఉంగరాలు, 8 జతల కమ్మలు, 10 తులాల వెండి ప్రమిదలు, చెంబు, తట్టతో పాటు రూ.25 వేల నగదు అపహరించుకుపోయారు. పట్టణ ఎస్‌ఐ గోపాలుడు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలను పరిశీలించారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతానికి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని డీఎస్పీ ఎన్.వి.రామాంజనేయులు తెలిపారు.