
ఇంటింటా ముగ్గుల పాఠశాల
ఒకప్పుడంటే ముగ్గులు వేయడం అనే కళను అమ్మ నుంచో నానమ్మ, అమ్మమ్మ, ఇరుగింటి, పోరిగింటి అత్తయ్యల నుంచో నేర్చుకునేవారు అమ్మాయిలు. ఇప్పుడు వారికి ఆ అవసరం లేదు. ఇంటర్‌నెట్టేవారికి పాఠశాల. సంక్రాంతి రోజుల్లో ముగ్గుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్‌లో ఆన్‌లైన్ ముగ్గుల ట్యుటోరియల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ‘బ్యూటీఫుల్ ఫ్రీ హ్యాండ్ స్క్వేర్ రంగోలి డిజైన్ ట్యుటోరియల్’ ‘సింపుల్ రంగోలి డిజైన్ 9 డాట్స్ చుక్కల ముగ్గులు’ ‘స్టెప్ బై స్టెప్ రంగోలి ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ విత్ 5 డాట్స్’ ‘క్రియేటివిటీ 3్ఠ3 డాట్స్ ముగ్గులు’... మొదలైనవి వాటిలో కొన్ని. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మై రంగోలి వరల్డ్’ పేరుతో వీడియోలు కనిపిస్తున్నాయి.
పందెం కోడి రెండున్నర లక్షలు
‘ఎత్తర కోడి తిప్పర మీసం’అని సంక్రాంతి వస్తే బరిలోకి దిగుతారు పందెం రాయుళ్లు.తూ.గో, ప.గో జిల్లాల్లో సంక్రాంతికి కోళ్ల పందేలు జరపడం ఆనవాయితీ. అయితే పోటీలో గెలిచేందుకు కోళ్లను సాకే తీరు అంతే వినూత్నం.ఈ సంవత్సరం సంక్రాంతి పుంజు ఒక్కోటి రెండున్నర లక్షలు పలుకుతోంది. పందెం కోళ్ల కబుర్లకోసం నెటిజన్లు చెవి కోసుకుంటున్నారు కూడా.మగకోళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకుంటాయి? ఆడకోళ్లు సమర్థమైన కోడి పుంజునే ఎంచుకుంటాయి కాబట్టి. ఇతర మగకోళ్లను తరిమికొట్టి ఆడకోళ్లకు చేరువ కావాలి కాబట్టి. ఆడకోళ్లను, వాటి గుడ్లను రక్షించడానికి శక్తి కావాలి కాబట్టి. క్రీస్తు పూర్వం నుంచే కోడి పందాలు ప్రపంచదేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఉన్నాయి. కుమారస్వామి పతాకంపై కూడా కోడిపుంజు ఉంటుంది.
కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉంటాయి. కాకి, డేగ, నెమలి, పింగళి, పూల, మైల, కౌజు, సేతు, కాకి, సేవల, నల్లబోర, ఎర్రపోడ... ఇలా. కోడి పందేల పండితులు, పెంచే ఆసాములు దూరం నుంచి చూసి కూడా ఏ పుంజు ఏ జాతికి చెందిందో చెప్పేయగలరు. పందేల వేళ దేని మీద దేన్ని వదలాలో ఒక లెక్క ఉంటుంది. కోడి పుంజుల పంచాంగం, జాతకాలు ఉంటాయంటే నమ్ముతారా మీరు? ఉన్నాయి. కుక్కుట శాస్త్రమే ఉంది. పల్నాటి యుద్ధం కోడి పందేల ఆనవాయితీని మరవనీకుండా చేస్తూనే ఉంది.
కోడి పందేల కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసే వారు... కోడి పందేల సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయం గడించేవారు గోదావరి జిల్లాల్లో ఉన్నారు. పందెం కోళ్లను పెంచి అమ్ముతారు. ప్రస్తుతం ఒక్కో కోడి రెండున్నర లక్షల ధర పలుకుతోంది. ఇవి బాగా పోరాడటానికి గతంలో ఏం చేసేవారోగాని ఇప్పుడు వయాగ్రా, శిలాజిత్ వంటివి కూడా పెడుతున్నారని తాజా వార్తలు. లోకల్ బ్రీడ్స్‌లో మోసాలు ఉంటాయని థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ నుంచి కూడా పుంజులను తెప్పించుకుంటున్నారు. అయితే అదంత సులువు కాదు.
కోడి పందేలకు తర్ఫీదు ఇచ్చే గురువులు వేరే ఉంటారు. వీరు అక్టోబర్ నుంచి పుంజులకు శిక్షణ మొదలెట్టి జనవరికి పూర్తి చేస్తారు. వీటికి తినిపించే తిండి అమోఘం కాబట్టి వీటి రుచి అమోఘమని ఓడిన వాటిని ఎగరేసుకుపోయేవారూ ఉన్నారు.థాయ్‌లాండ్‌లో ఇలాంటి పోటీల్లో ఓడిన కోడిని 20 లక్షలకు కూడా కొన్న సందర్భాలున్నాయి.ఈసారి మనవాళ్లు ఎంతకు కొంటారో చూడాలి.
క్యూఆర్ కోడ్ హరిదాసులు
తలపై అక్షయపాత్ర, చేతిలో చిడతలు, భుజంపై తంబుర, కాళ్లకు గజ్జెలు, రామదాసు కీర్తనలతో వీధుల వెంట నడిచొచ్చే హరిదాసులను చూస్తుంటే భక్తి భావం పోంగిపోర్లుతుంది. అయితే కాలంతో పాటు హరిదాసులు కూడా మారుతున్నారు అని చెప్పడానికి బైక్‌లపై వీధుల్లో తిరుగుతున్న హరిదాసులే నిదర్శనం. ‘మోడ్రన్ హరిదాసులు’ ‘హైటెక్ హరిదాసులు’ పేరుతో ఈ వీడియోలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. కొందరు హరిదాసుల తంబూరలపై పేటీయం క్యూఆర్ కోడ్‌లు కనిపించడం విశేషం.
మకర సంక్రాంతి పంచదార నగలు
మహారాష్ట్రలో నూతన వధూవరులు తొలి మకర సంక్రాంతిని పంచదార నగలు ధరించి ఆహ్వానిస్తారు. దీని తాలూకు వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. ‘హల్వియాచే దాగినే’ అని పిలిచే ఈ నగలను పంచదార, నువ్వులు, సగ్గు బియ్యం ఉపయోగించి తయారు చేస్తారు. హల్వా అంటే తీపిదనం, దాగినే అంటే నగలు అని అర్థం. ఒక తరం నుంచి మరో తరానికి పరంపరగా ఈ ఆచారం వస్తోంది. ఈ నగలు ధరిస్తే కొత్త సంవత్సరంలో తీపిదనం, ఆనందం చేకూరుతాయని నమ్మకం. ఒకప్పుడు ఇండ్లలోనే వీటినే తయారు చేసుకునేవారు. ఇప్పుడు షాప్‌లలో కూడా వీటిని అమ్ముతున్నారు.
కైట్ మానియా
సంక్రాంతి రోజుల్లో ఆకాశంలో తేలియాడే గాలిపటాలు ‘దిగిరాను దిగిరాను దివి నుండి భువికి’ అంటాయి. వాటి సంబరం మాట ఎలా ఉన్నా గాలిపటాల దారాలు పక్షుల పాలిట మృత్యు ద్వారాలు అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆగ్‌మెంట్ రియాలిటీ (ఏఆర్ ) బేస్డ్ కైట్ గేమ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు కొందరు పక్షి ప్రేమికులు. అమెరికన్ మల్టీ మీడియా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ గత సంవత్సరం ‘కైట్ మానియా’ పేరుతో లాంచ్ చేసిన ఏఆర్ బేస్డ్ కైట్ గేమ్‌కు మంచి స్పందన లభించింది. దీనిలో యూజర్‌లు తమ సొంత కైట్‌ను క్రియేట్ చేసి ఎగరేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment