‘సంక్రాంతి పండగ అంటే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటున్నారు పాయల్ రాజ్‌పుత్. ‘సంక్రాంతికి ఫుల్ ఎనర్జీతో భోగి మంటలు వేస్తుంటాను’ అన్నారు మానసా చౌదరి. ‘సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడమంటే చాలా ఇష్టం’ అంటున్నారు మాళవికా శర్మ. ఇలా సంక్రాంతిని తాము ఎలా జరుపుకొంటామో అంటూ ఈ కథానాయికలు సాక్షితో పంచుకున్న విశేషాలు..
ఎన్నో జ్ఞపకాలు ఉన్నాయి – పాయల్ రాజ్‌పుత్
నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. పంజాబీ ఆడియన్స్ కు హ్యాపీ లోహ్రీ. సంక్రాంతి పండగ అంటే నాకు ఎన్నో జ్ఞపకాలు గుర్తొస్తాయి. ప్రతి ఏడాది సంక్రాంతిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. పూజలు చేస్తాం.. ఇష్టమైన వంటకాలు చేసుకుంటాం. చిన్న తనంలో సంక్రాంతి పండక్కి గాలిపటాలను ఎగరవేసేదాన్ని. కానీ, నా జీవితం ఇప్పుడు చాలా మారిపోయింది. కాబట్టి గాలిపటాలను ఎగరవేసే సమయంలో మనలో కలిగే ఆ ఆనందపు అనుభూతిని కొంతకాలంగా మిస్ అయ్యాను. ఈ సారి ఢిల్లీలో నా స్నేహితులతో కలిసి గాలిపటాలను ఎగర వేయాలని ప్లాన్ చేస్తున్నాను.
నా సిబ్బందిలో కొంతమంది హైదరాబాదీలు ఉన్నారు. వారితో పాటు సంక్రాంతిని నేను సెలబ్రేట్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. నేను భోజన ప్రియురాలిని. ప్యూర్ వెజిటేరియన్ ని. మసాలా కిచిడీ, లడ్డు అంటే చాలా ఇష్టం. ఇలా మా అమ్మగారు పండక్కి చేసిన వంటకాలను ఇష్టంగా తింటాను. ఇక నేను నటించిన తాజా చిత్రం ‘మంగళవారం’ మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.. నా అభిమానులకు కూడా థ్యాంక్స్. ఓ నటిగా మంచి కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను.
గాలిపటాలు ఎగరవేయడం చాలా ఇష్టం – మాళవికా శర్మ
సంక్రాంతి అంటే ముఖ్యంగా రైతుల పండగ. వారు ఎంతోకష్టపడి పండించిన పంటలు ఈ సంక్రాంతికి వారి చేతికి వస్తాయి. సూర్యభగవానుడికి పూజలు చేయడంతో మా సంక్రాంతి మొదలవుతుంది. మా అమ్మమ్మ మాకు ప్రతి సంక్రాంతికి కొత్త దుస్తులు ఇస్తుంటారు. నువ్వుల లడ్డూలు ఇస్తారు. లక్కీగా మా అమ్మమ్మగారి బర్త్ డే కూడా సంక్రాంతి రోజునే. మేము కూడా స్వీట్స్‌ను పంచిపెడతాం. మేం చేయగలిగినంతలో పేదలకు సాయం చేస్తుంటాం.
సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరిలానే నాకు గాలిపటాలను ఎగరవేయడం చాలా ఇష్టం. ఆకాశంలో కనిపిస్తున్న రంగు రంగుల గాలిపటాలు.. భూమిపై రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలకు ప్రతీకగా నేను భావిస్తుంటాను. నాపై తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలకు చాలా రుణపడి ఉంటాను. ముంబై నా జన్మభూమి అయితే హైదరాబాద్ నా కర్మభూమి. ఎందుకంటే.. నేను ఇక్కడే మూవీస్ చేస్తున్నాను. నేను నటించిన గోపీచంద్‌గారి ‘భీమా’, సుధీర్‌బాబుగారి ‘హరోంహర’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల్లో నా పాత్ర చాలా ఎగై్జటింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే సినిమాలే చేయాలనుకుంటున్నాను.
సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకం – మానసా చౌదరి
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరు స్వగ్రామం. నాన్న మధుసూదన్ నాయుడు వ్యాపారం నిమిత్తం చెన్నైలో స్థిరపడ్డారు. మేము చెన్నైలో ఉన్నప్పటికీ ప్రతి ఏడాది సంక్రాంతికి కచ్చితంగా ఊరు వెళతాం. అక్కడ నాన్న, అమ్మ సుజాత, నేను, తమ్ముడు చేతన్ కలిసి మా బంధువులతో ఎంతో సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటాం. కానీ, ఈ ఏడాది ఊరు వెళ్లలేకపోయాను. మా బంధువులు, కజిన్స్ ఫోన్ చేసి.. ‘ఏంటి? హీరోయిన్ అయిపోయావని ఊరికి రావా?’ అంటున్నారు. అయితే ఆదివారం భోగి పండగని చెన్నైలోనే జరుపుకొన్నాను. మేము ఉన్న వీధిలో ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉంటారు.. సెలబ్రేట్ చేసుకుంటాం.
► సంక్రాంతి పండగలో తొలిరోజు వచ్చే భోగి అంటే మరీ ఇష్టం. తొలిరోజు కాబట్టి ఫుల్ ఎనర్జీతో ఉంటా. ఉదయాన్నే లేచి పెద్ద భోగిమంటలు వేసేవాళ్లం. ఆ తర్వాత ఆయిల్ బాత్ చేసి, కుటుంబమంతా కలిసి సరదాగా మాట్లాడుకునేవాళ్లం.. థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూస్తాం. ఆ తర్వాత మకర సంక్రాంతిన పొంగల్ చేయడం ఇష్టం. నేను నాన్ వెజ్ బాగా తింటాను. ప్రత్యేకించి నాటుకోడి కూరతో రాగిసంకటి తినడం చాలా ఇష్టం. అలాగే మటన్ నా ఫేవరేట్. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఎవరైనా గాలిపటాలు ఎగర వేస్తుంటే చూస్తుంటాను. కానీ నేను గాలిపటాలు ఎగరవేయలేదు. తెలుగులో ‘బబుల్‌గమ్’ సినిమాకి ముందే నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి.. కానీ, చేయలేదు. ‘బబుల్‌గమ్’ తర్వాత కథలు వింటున్నాను. అయితే నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది కెరీర్‌లో ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్లాలనుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment