సాక్షి, అమరావతి: సంక్రాంతి సంబరాలను ఒక్కో ప్రాంత ప్రజలు ఒక్కో తరహాలో నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో కోడి పందేలు.. కోనసీమలో ప్రభల తీర్థం.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు.. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు విన్యాసాలు.. కొన్నిచోట్ల పతంగులు ఎగురవేయడం వంటివి నిర్వహిస్తుంటారు.
హోరాహోరీ తలపడే పందెం కోళ్లు
సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో కోడి పందేల జాతర మొదలవుతాయి. భోగి రోజున మొదలై çసంక్రాంతి, కనుమ వరకు మూడు రోజులపాటు ఊరువాడా పెద్దఎత్తున జరిగే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. కోడి పందేల బరుల పక్కనే పేకాట, కోతాట, గుండాట వంటివి ఏర్పాటు చేయడంతో జూదాల జాతరను తలపిస్తాయి. ఏడాదిపాటు పహిల్వాన్ తరహాలో కోళ్లను మేపి.. వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పందేల బరిలో దించుతారు.
కోనసీమ ప్రభల తీర్థం
సంక్రాంతి వేళ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం కనుల పండువగా జరుగుతుంది. కోనసీమలో 80 వరకు ప్రభల తీర్థాలు నిర్వహిస్తుండగా.. జగ్గన్న తోట ప్రభల తీర్థానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గతేడాది దేశ రాజధానిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లోనూ ఇక్కడ ప్రభలను ప్రదర్శించారు.
బండ్ల లాగుడు.. పరుగు పందెంలో ఎడ్లు
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు, బండ లాగుడు పందేలను రైతులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. వ్యవసాయంలో ఉపయోగించే ఎడ్ల జతకు బరువైన బండలు కట్టి నిర్దేశించిన ప్రాంతానికి ఏది ముందు చేరితే ఆ ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తారు. దీంతోపాటు పలు విభాగాల్లో ఎడ్లను పరిగెట్టించి ముందుగా గమ్యానికి చేరుకున్న వాటిని విజేతగా ప్రకటిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడా ఈ పందేలు జరుగుతాయి. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోను ఈ తరహా పోటీలు భోగి రోజున ప్రారంభించి మార్చి వరకు కొనసాగిస్తారు.
‘జల్లికట్టు’తో పశువుల పండుగ
తమిళనాడులోని జల్లికట్టు మాదిరిగా చిత్తూరు జిల్లాలో పశువుల పండుగ ఉత్సాహంగా జరుపుకుంటారు. రంకెలేస్తూ పరుగులు తీసే కోడె గిత్తలను పట్టుకోవడానికి యువత ఉత్సాహంగా ఉరకలేస్తుంటారు. ఆ సంస్కృతి చిత్తూరు జిల్లాలోనూ ఎక్కువగా కన్పిస్తుంది. తమిళనాడులో కనుమ రోజున జల్లికట్టు నిర్వహిస్తే.. మన రాష్ట్రంలో సంక్రాంతి ముందు నుంచి పశువుల పండుగ జరపడం ఆనవాయితీగా వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment