చెన్నై: తమిళనాడులో పొంగల్ వేడుకల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జల్లికట్టు నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. జల్లికట్టు వేడుకలను వీక్షించేందుకు పలు ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. పుదుకొట్టే జిల్లా తసంగుర్చిలో తొలి జల్లికట్టు పోటీలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ ప్రారంభించారు. జల్లికట్టు పోటీలో భాగంగా 300 ఎద్దులను అదుపు చేయడానికి 400 మంది యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని పుదుకోట్టె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరులో ఘనంగా జల్లికట్టు వేడుకలు..
చిత్తూరు: సంక్రాంతి పండగను పురస్కరించుకుని తమిళనాడుతో పాటు సరిహద్దులోని చిత్తూరు జిల్లాలో జల్లికట్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జల్లికట్టులో పాల్గొనేందుకు యువత ఉత్సహం కనబరుస్తున్నారు. జిల్లాలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న జలికట్టు వేడుకలకు భారీగా జనాలు తరలివచ్చారు. పోటీలో భాగంగా పశువులను పట్టుకునేందుకు యువకులు రంగంలోకి దిగుతున్నారు. జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన యువత కేరింతలు కొడుతూ ఉత్సహంగా గడుపుతున్నారు. అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చినవారికి రేఖలచేను గ్రామ యువత అన్నదానం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment