సంక్రాంతికి కోడి పందేల హవా ఉంటుంది. వెండితెరపై సినిమా పందేల హవా ఉంటుంది. పండగకి రావడానికి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. అన్నింటికీ థియేటర్లంటే కష్టం. అందుకే కొన్ని పండగ పుంజులు (సినిమాలు) వెనక్కి తగ్గాయి.పాంచ్ పటాకా అంటూ జోరుగా వెండితెర మీదకు పుంజుకొస్తున్న ఐదు చిత్రాల గురించి తెలుసుకుందాం.
∙ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో ఒకటి స్టార్ హీరో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ కాగా మరొకటి యువహీరో తేజా సజ్జా ‘హను–మాన్’. ‘అతడు, ఖలేజా’ వంటి సినిమాల తర్వాత హీరో మహేశ్ బాబు–దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో చిత్రం ‘గుంటూరు కారం’. ఇందులో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.
ఈ మూవీలో మహేశ్‌బాబు పక్కా మాస్ లుక్‌లో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్,పాటలు స్పష్టం చేశాయి. అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో పోలిటికల్ టచ్‌తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇక అదే రోజు యువ హీరో తేజ సజ్జా ‘హను–మాన్’ సినిమాతో తొలిసారి సంక్రాంతికి వస్తున్నారు. ‘జాంబీ రెడ్డి’ తర్వాత తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్రమిది. కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. అమృతా అయ్యర్ హీరోయిన్.
మామూలు కుర్రాడికి హనుమంతుని ఆశీస్సులతో సూపర్ పవర్స్ వస్తే అతను చేసే అసాధారణ పనులు ఏంటి? అనే నేపథ్యంలో ‘హను–మాన్’ తెరకెక్కింది. ఒకే రోజు అమ్మ సెంటిమెంట్, భక్తి సెంటిమెంట్... ఇలా రెండు విభిన్న చిత్రాలతో 12వ తేదీ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా దగ్గర కావడానికి రెడీ అవుతోంది. సీనియర్ హీరోలు వెంకటేశ్, రవితేజ సంక్రాంతికి ఒకే రోజు బరిలో దిగుతున్నారు. వెంకటేశ్ నటించిన ‘సైంధవ్’, రవితేజ నటించిన ‘ఈగల్’ జనవరి 13నే రిలీజ్ కానున్నాయి. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా, బేబీ సారా కీలకపాత్రలో నటించారు.
వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘సైంధవ్’ వెంకటేశ్ కెరీర్‌లో 75వ చిత్రం కావడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పైగా ఆయన నటించిన తొలిపాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. తండ్రీ–కూతురి అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి భిన్నంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రవితేజ ‘ఈగల్’ వస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో మల్టీపుల్ షేడ్స్ ఉన్నపాత్ర చేశారు రవితేజ. ఒకటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, మరొకటి యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ రెండు వర్గాల ప్రేక్షకులకు మంచి చాయిస్ దక్కినట్లే.
హీరో నాగార్జున కూడా ‘నా సామిరంగ’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) వంటి చిత్రాలతో సంక్రాంతి రేసులో నిలిచి, విజయం అందుకున్న ఆయన ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ చిత్రంతో జనవరి 14న సోలోగా వస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో నాగార్జున ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఈ మధ్య రెండు సంక్రాంతి పండగలకు హిట్ సాధించిన హీరో కాబట్టి.. ఈసారి నాగార్జున ‘నా సామిరంగ’పై అంచనాలు ఉన్నాయి.
అనువాదం ఉందా?
తమిళంలోనూ సంక్రాంతికి పోటీ నెలకొంది. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలాన్’, తమిళ్, హిందీలో రూపొందిన విజయ్ సేతుపతి ‘మెర్రీ క్రిస్మస్’ సినిమాలు జనవరి 12న, అరుణ్ విజయ్ ‘మాఫియా’ పండగకి విడుదలకు సిద్ధమయ్యాయి. ధనుష్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అయలాన్’. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన మూవీ ‘మెర్రీ క్రిస్మస్’.
ఈ మూడు సినిమాలూ తమిళంలో ఒకేరోజు విడుదలవుతున్నాయి. తెలుగులోనూ అనువాదం అవుతున్నాయి. అయితే తెలుగు విడుదలపై సందిగ్ధం నెలకొంది. ఈ సంక్రాంతికి స్ట్రయిట్ తెలుగు సినిమాలకే పోటీ ఉండటంతో థియేటర్ల సమస్య ఎదురైంది. ఆల్రెడీ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ వంటి స్ట్రయిట్ చిత్రాల రిలీజ్ వాయిదా పడింది. అలాంటిది డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు దొరుకుతాయా? అన్నది ఆసక్తిగా మారింది. ఇక అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘లాల్ సలాం’ వంటివి పోటీ నుంచి తప్పుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment