సాక్షి,హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊరుకెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న నగరవాసులకు బస్సులు, రైళ్లలో ప్రయాణం అసాధ్యంగా మారింది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లతో పాటు సంక్రాంతి సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 150 నుంచి 250 దాటి కనిపిస్తోంది. కొన్ని రైళ్లలో బుకింగ్‌కు కూడా అవకాశం లేకుండా నో రూమ్ దర్శనమిస్తోంది. ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ వైపు చూస్తున్నారు. కానీ.. సాధారణంగా జనవరి మొదట్లోనే ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ కార్యాచరణ చేపడుతుంది. సొంత ఊళ్లకు వెళ్లేందుకు నగరవాసులు ముందస్తుగా రిజర్వేషన్‌లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తుంది.
రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి
తెచి్చన తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ వంద శాతానికి పెరిగింది. కొన్ని రూట్‌లలో ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల రద్దీ మేరకు డీలక్స్ బస్సులను ఏర్పాటు చేయాల్సివస్తోంది. దీంతో సంక్రాంతికి ప్రత్యేకంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయడం ఆర్టీసీకి సవాల్‌గా మారింది. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే లగ్జరీ, డీలక్స్ వంటి బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సులను రద్దీ ప్రాంతాలకు మళ్లిస్తారు. కానీ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చనప్పటి నుంచి పల్లెవెలుగు బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ రద్దీ పెరిగింది. ప్రతిరోజు 88 శాతం నుంచి 100 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా ఈ బస్సులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం కష్టమే.
ఏటా 25 లక్షల మందికిపైగా ప్రయాణం..
సొంత ఊళ్లలో సంక్రాంతి వేడుకల కోసం నగరం నుంచి ప్రతి ఏటా సుమారు 25 లక్షల మందికి పైగా బయలుదేరి వెళ్తుంటారు. పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన వెంటనే ప్రయాణాలు మొదలవుతాయి. జనవరి రెండో వారంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఇందుకనుగుణంగా ఆర్టీసీ సుమారు 4,500 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని దూరప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి.మరోవైపు ఏపీఎస్‌ఆరీ్టసీ కూడా అదనపు బస్సులను అందుబాటులోకి తెస్తుంది. ప్రత్యేక బస్సుల కోసం ఆర్టీసీ అధికారులు వివిధ జిల్లాల్లోని డిపోల నుంచి అందుబాటులో ఉన్న బస్సులను సేకరిస్తారు.
ముఖ్యంగా మహిళల ప్రయాణాలు మరింత పెరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జిల్లాలకు అదనపు ట్రిప్పులు వేయడం కూడా సవాల్‌గా మారవచ్చని ఒక అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. “ఒకవేళ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని బస్సులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు అదనంగా మళ్లిస్తే తెలంగాణ ప్రయాణికులకు బస్సుల కొరత ఏర్పడవచ్చు. కానీ సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడపలేకపోతే పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సివస్తోంది’ అని వివరించారు. తెలంగాణ ఆర్టీసీ ఇటీవల 50 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చింది. మరో 30 బస్సులు త్వరలో రానున్నాయి. వీటిలో డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని తదితర కేటగిరీలకు చెందిన బస్సులు ఉన్నాయి. ఈ బస్సులను సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, ఏలూరు, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు నడిపే అవకాశం ఉంది. కానీ రద్దీ తీవ్రత దృష్ట్యా అదనపు బస్సుల ఏర్పాటు ఈ సారి సవాల్‌గానే మారనుంది.
ప్రైవేట్ బస్సుల దోపిడీ...
ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులపై నిలువు దోపిడీకి పాల్పడే ప్రైవేట్ బస్సులు ఈసారి మరింత రెచి్చపోయే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు రూ.910 వరకు చార్జీ ఉంటే సంక్రాంతి సందర్భంగా రూ.1600కు పైగా వసూలు చేస్తారు. అలాగే విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, చిత్తూరు, కడప, తిరుపతి తదితర ప్రాంతాలకు కూడా చార్జీలను రెట్టింపు చేస్తారు. ఈ సారి ప్రయాణికుల రద్దీ మేరకు ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేయలేకపోతే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సివస్తోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా చార్జీలను పెంచే అవకాశం ఉందని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన వినయ్ అనే ప్రయాణికుడు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment