
కురుపాం: తలపై అక్షయ పాత్ర, మెడలో నిలువెత్తు దండ..పట్టు పీతాంబరాలు, ఒక చేతిలో చిడతలు..మరోచేతిలో తంబుర..నుదుటన నామాలు..కాళ్లకు గజ్జెలు..కంచుకంఠంతో విష్ణు నామస్మరణ..నెల రోజుల పాటు పల్లె ముంగిట హరిదాసులు దర్శనమిస్తే సంక్రాంతి పండగ ఆరంభమైనట్లే. పల్లెల్లో తెలతెలవారక ముందే హరిలో రంగ హరి..! అంటూ హరిదాసుల సంకీర్తన ప్రారంభం కావడంతో సంక్రాంతి పండగ శోభ సంతరించుకుంది. సంక్రాంతి పండగ రోజుల్లో పల్లెల్లో సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి.
సంక్రాంతి పండగ ఆగమనాన్ని గుర్తుచేస్తూ హరిదాసులు నెల రోజుల పాటు వచ్చి హరి నామస్మరణ చేస్తూ ప్రతి ఇంటికి వెళ్తారు. కానీ ఎవరి ముంగిట ఎక్కువసేపు నిలవరు. కానుకలు సమర్పించినా సమర్పించకపోయినా హరి నామస్మరణతో ముందుకు సాగిపోతారు. తెల్లవాకుజామున ప్రారంభమయ్యే వారి ప్రయాణం సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకూ సాగుతుంది. ఈ సందర్భంగా సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా..అంటూ భద్రాద్రి రామదాసు కీర్తనలు రాగయుక్తంగా ఆలపిస్తారు.
అక్షయ పాత్ర చాలా ప్రధానం
హరిదాసుల నెత్తిపై ఉండే అక్షయ పాత్ర చాలా ముఖ్యమైంది. తెల్లవారుజామున పాత్రను తలపై ధరించిన తరువాత గ్రామ సంచారం పూర్తయ్యేవరకు కిందికి దించబోమని సంవత్సరాలుగా హరిదాసు వృత్తిలో ఉన్నవారు చెబుతున్నారు. ధనుస్సంక్రమణంలో హరిదాసుల అక్షయపాత్రకు ఎంతో ఘనచరిత్ర ఉంది. శ్రీమహావిష్ణువు సూర్య భగవానుడికి అందించిన అక్షయపాత్రకు వనవాస సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇచ్చాడని పురాణాల్లో పేర్కొన్నారు.
ధర్మరాజు సందేహం నివృత్తి
ధర్మరాజు పట్టాభిషేకం అనంతరం ఈ పాత్ర విషయంలో ధర్మరాజు ధర్మసందేహాన్ని శ్రీకృష్ణుడు నివృత్తి చేస్తూ సలహా చెప్పాడు. ఒక మంటపానికి వేయి గంటలు కట్టించి, విప్రోత్తములందరినీ పిలిచి అన్న సమారాధన చేయాలని, ఆ సమయంలో ఏకకాలంలో వేయి గంటలు మోగాలని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. పై విధంగా చెప్పినప్పటికీ గంటలు మోగక పోవడంతో కృష్ణుడిని పాండవులు ప్రార్థించారు. కృష్ణుడు శ్రీవైష్ణవుని పిలిచి భోజనం చేయమని ఆర్థించగా స్వయంపాకం కోరాడని, స్వయంగా వండివార్చి, గోదాదేవి సహిత శ్రీకృష్ణమూర్తికి అర్పణ చేసిన తరువాత వైష్ణవుడు భుజించగా ఆ వేయి గంటలు మోగినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
దీంతో ధర్మరాజు అక్షయ పాత్రను వైష్ణవుడికి ఇవ్వగా అప్పటి నుంచి ఆ పాత్రను ధనుర్మాసంలో తలపై ధరించి విష్ణునామ సంకీర్తనలతో గ్రామ సంచారం చేసే వృత్తిగా సంక్రమించిందని హరిదాసు పిరిడి సింహాచం తెలిపారు. ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయానికి ముందు శ్రీకృష్ణ, గోదాదేవిలకు నివేదన చేసి, తిరుప్పావైపఠించి అక్షయ పాత్రను ధరిస్తామన్నారు. పాత్ర ధరించి గ్రామ సంచారం ప్రారంభమైన దగ్గర నుంచి అక్షయ పాత్ర దించడం కానీ, మాట్లాడడం కానీ చేయరాదని చెప్పారు. ఆధ్యాత్మిక, రామాయణ కీర్తనలు, కృష్ణలీలలను గానం చేస్తూ సంక్రాంతి శోభ పల్లెలకు విస్తరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment