గిరిజన అభ్యర్థిని నిలబెడుతున్నామంటూ టీడీపీ నయవంచన
ఖర్చు, హడావిడి పెద్దలదే
కురుపాం నియోజకవర్గంలో ఎన్నికల సిత్రం
కోతి గెంతడం..యజమాని వసూలు చేయడం అన్న సామెత చందాన తయారైంది టీడీపీ కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం మహిళా అభ్యర్థి పరిస్థితి. ఆమెకు బొట్టు పెట్టి ఎన్నికల బరిలో దింపినా వెనుక నుంచి పెత్తనం, ప్రచారం నడిపిస్తున్నదంతా ఆ పార్టీలోని పెద్దలే. ఈ పరిస్థితికి కారణం ఆమెకు కనీస రాజకీయ అనుభవం లేకపోవడమే. నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశించిన వారెవరికీ దక్కకపోవడంతో పోనీలే ఆమెను అడ్డుపెట్టుకుని అయినా పెత్తనం చెలాయించవచ్చన్న ఆలోచనకు వచ్చి తెరవెనుక ఖర్చు చేస్తూ ఎన్నికలు జరగకముందు నుంచే ఆధిపత్యం సాగిస్తున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: మూడు దశాబ్దాలుగా కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది లేదు. ఆ పార్టీ నేతలను నియోజకవర్గం ప్రజలు విశ్వసించే పరిస్థితి కానరాదు. పార్టీలో ఎప్పుడూ అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య ధోరణి, అధికారం చేజిక్కించుకోవాలనే ఆరాటం వెరసి ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేయడం తప్ప అడవి బిడ్డలను పట్టించుకున్న పాపానపోలేదు. ఇదే సందర్భంలో నియోజకవర్గంలో అడుగడుగునా వైఎస్సార్‌సీపీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. తమకు మేలు చేసిన జగనన్న ప్రభుత్వమంటే ఇక్కడి గిరిజనుల్లో నమ్మకం గూడు కట్టుకుంది.
గడిచిన రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పాముల పుష్పశ్రీవాణి నియోజకవర్గంలో ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. ఆమె విజయాన్ని అడ్డుకునేందుకు నాడు కత్తులు దూసుకున్న వారంతా ఇప్పుడు చేతులు కలిపారు. గిరిజన మహిళ అనే సానుభూతిని తెరపైకి తెచ్చి..నామ్ కే వాస్తేగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, కొందరు ‘పెద్దలే’ వెనుక నుంచి కథంతా నడిపిస్తున్నారు. ఇందులో వైరిచర్ల, శత్రుచర్ల వర్గాలు ఒకటైతే..మరో బలమైన సామాజిక వర్గం నేతలు మరికొందరు ఉండడం గమనార్హం.
రిమోట్ వారి చేతిలోనే..
కురుపాం నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. గిరిజన ప్రజ లు ఎప్పుడూ ఆ పార్టీని తిరస్కరిస్తూనే ఉన్నారు. ఈ దఫా కూడా టీడీపీ నుంచి టికెట్ కోసం చాలా మంది ఆశావహులు పోటీ పడ్డారు. ఆశావహుల్లో వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఒకరు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆశీస్సులతో అంటూ తోయక జగదీశ్వరిని టీడీపీ తరఫున నిలబెట్టారు. ఆమెకు ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం మినహా కనీసం మండలస్థాయి నాయకురాలిగానూ పని చేయలేదని, అటువంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తార ని పెద్ద పంచాయితీయే నడిచింది. మరో వర్గంలోని డొంకాడ రామకృష్ణ, దత్తి లక్ష్మణరావు వంటివారు టికెట్ ఆశించి భంగపడ్డారు. గుమ్మలక్ష్మీపురానికి చెందిన బిడ్డిక పద్మావతి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇలా సుమారు నాలుగైదు గ్రూపులు టికె ట్ ఆశించాయి.
నియోజకవర్గ ఇన్‌చార్జిగా తోయక జగదీశ్వరిని నియమించిన తర్వాత ఆమైనెనా తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుని, పెత్తనం చెలాయిద్దామన్న ఉద్దేశంతో కొంతమంది బాగా ఖర్చు పెట్టి హడావిడి చేశారు. ఇప్పుడు అభ్యర్థిగా జగదీశ్వరి ఉన్నప్పటికీ..వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ మొత్తం చూసుకుంటున్నారు. దీనివల్ల ఆమెకంటూ స్వతంత్రత గానీ, ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి గానీ కనిపించడం లేదు. ఒకవైపు గిరిజన బిడ్డను ఆదరించాలని కోరుతూనే..మరోవైపు పెత్తనమంతా వీరేష్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజు వంటి పెద్దల వద్దే ఉంచుకోవడం ఇప్పుడు గిరిజన ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే అభ్యర్థిపైనే దౌర్జన్యం
టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు ఇక్కడ కొదవ లేదు. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిపై జియ్యమ్మవలస మండలానికి చెందిన డొంకాడ రామకృష్ణ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. చినబుడ్డిడి పంచాయతీలోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని గదిలో నిర్బంధించి తమ అనుచరులతో భయభ్రాంతులకు గురి చేశారు. ఆ ఘటనను నేటికీ నియోజకవర్గ ప్రజలు మరిచిపోలేదు.
నియోజకవర్గానికి టీడీపీ చేసింది శూన్యం
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్య మంత్రిగా చంద్రబాబు చేసింది శూన్యం. తోటపల్లి ప్రాజెక్టు తన వల్లేనంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు..వాస్తవానికి 2003లో తాను పదవి దిగిపో యే నెల ముందు శంకుస్థాపన చేసి వదిలేశారు. ఆ తర్వాత 2004లో అధికారంలో వచ్చిన దివంగత మహానేత వైఎస్సార్ దాదాపు రూ.800 కోట్లు వెచ్చించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.
దివంగత ముఖ్యమంత్రి రోశయ్య పదవీ కాలంలో మరికొంత నిధులను వెచ్చించారు. ఆ పనులన్నీ పూర్తి చేసి అప్పగిస్తే.. 2014లో ఆగస్టులో చంద్రబాబు హ యాంలో దీన్ని జాతికి అంకితం చేశారు. దీన్ని తన గొప్పగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. మళ్లీ తోటపల్లి కాలువల ఆధునికీకరణకు రూ.193కోట్లు కేటాయించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన గడిచిన 59 నెలల కాలంలోనే జరిగిందన్న విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment