సాక్షి, పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి నేతలది దగా ప్రభుత్వం, మోసపూరిత సర్కార్ అని మండిపడ్డారు మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల పేరిట 15,845 కోట్లు ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేరుస్తారని ఆశపడి ప్రజలు ఓటు వేస్తే నట్టేట ముంచారని ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యుత్ చార్జీలు పెంచడంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ అన్న మాటలు ఆచరణలో లేకుండా బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారంటీ అనేటట్టు ఉంది. విద్యుత్ చార్జీలు పెంచమని ఎన్నికల ముందు చెప్పిన మాట ఏమైంది?. 2023 సభలో చంద్రబాబు ఏం మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల పేరిట 15,845 కోట్లు ప్రజలపై భారం మోపారు. యూనిట్‌పై జనవరి నుండి 2.19 పైసలు ఎక్కువ వసూలు చేయబోతున్నారు. ఎన్నికల ముందు బాదుడే బాదుడు అని తిరిగారు.. కానీ ఇప్పుడు కరెంటు, నిత్యవసర సరుకులు, మద్యం ధరలు ఈ ప్రభుత్వంలో బాదుడే బాదుడు మొదలైంది.
కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం, శ్రీ శక్తి ఏమైంది?. మహిళల కోసం ఈ ప్రభుత్వంలో ఏం ఖర్చు చేశారో చెప్పాలి. ఉచిత గ్యాస్ పెద్ద మోసం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని అబద్ధమే. పథకాల రూపంలో ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ప్రజలు అష్ట కష్టాలు, అప్పుల బారిన పడుతున్నారు. ఆరు నెలల్లో 15,845 కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే. హామీలు నెరవేరుస్తారని ఆశపడి ప్రజలు ఓటు వేస్తే నట్టేట ముంచారు.
సెకీ ఒప్పందాలపై పేపర్లలో తప్పుడు రాతలు రాసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేసి పబ్బం గడుపుతోంది. గతంలో చంద్రబాబు దిగేపోయే సమయానికి విద్యుత్ రంగంలో 86 వేల కోట్లు అప్పులు చేసింది. గత ప్రభుత్వం చేసిన పీపీఏలు రద్దు చేసే దమ్ము కూటమికి ఉందా?. మద్యం దుకాణాల యజమానులను కూటమి నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవ్వడం పోయి రాజకీయ కక్షలతో ఉద్యోగాలు తీస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment