ఫెస్టివల్‌ను ప్రారంభించి పతంగులు ఎగురవేస్తున్న మంత్రులు జూపల్లి, పొన్నం
కంటోన్మెంట్ (హైదరాబాద్): ప్రపంచ స్థాయిలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా అన్ని పండుగలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్‌ను శనివారం రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో నిర్వహించే పతంగుల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు నగరంలో నివసిస్తున్నారని, అందువల్ల ప్రభుత్వ ఆధ్వర్యంలో పతంగులు, మిఠాయిల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 16 దేశాల నుంచి 40 మందికి పైగా కళాకారులు కైట్స్ ఫెస్టివల్‌లో పాలుపంచుకుంటున్నారన్నారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు 400కు పైగా స్టాళ్లలో సుమారు 1,200 రకాల స్వీట్లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వేడుకల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలతోపాటు వంటకాలనూ తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇలాంటి ఉత్సవాలను జిల్లా, మండలస్థాయిలోనూ నిర్వహిస్తామని ప్రకటించారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వియత్నాం, నెదర్లాండ్స్, కొరియా తదితర దేశాల నుంచి పర్యాటకులు పాల్గొన్నారని తెలిపారు.
ముఖ్య ఆదాయ వనరుగా మారాలి: పొన్నం
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పర్యాటకం అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎక్సైజ్ ఇతర శాఖలకు పోటీగా పర్యాటకం ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఇందుకు రవాణా శాఖ నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె.నిఖిల, ఎండీ రమేష్ నాయుడు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment