తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే చాలా స్పెషల్. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి దాదాపు అన్ని సినిమాల వసూళ్లు బాగుంటాయి. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు, దర్శక – నిర్మాతలు వారి సినిమాలను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని పోటీ పడుతుంటారు. కానీ ఫైనల్‌గా బెర్త్ కొంతమందికే దొరుకుతుంది. 2025 సంక్రాంతి సమయం సమీపిస్తున్న తరుణంలో సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఆయా చిత్రబృందాలు రెడీ అవుతున్నాయి. కానీ ఆల్రెడీ సంక్రాంతికి ప్రకటించిన సినిమాలు థియేటర్స్‌లోకి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో వేరే సినిమాలు సంక్రాంతికి సై అంటున్నాయి. ఇలా సంక్రాంతి సినిమా సీన్ మారుతోంది. ఇక 2025 సంక్రాంతి బాక్సాఫీస్ పోరులోకి వెళదాం.
సంక్రాంతికి వస్తున్నాం... కానీ!
‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే వర్కింగ్ టైటిల్‌ని పెట్టుకుని మరీ వెంకటేశ్ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నారంటే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని యూనిట్ ఎంతటి కృతనిశ్చయంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, అతని భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మరో చిత్రం ‘గేమ్ చేంజర్’ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సంక్రాంతి పండక్కి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా స్పేస్ ఉంటుంది కాబట్టి తమ బేనర్‌లోని ఈ రెండు చిత్రాలనూ ‘దిల్’ రాజు పండగ బరిలో దింపుతారని ఊహించవచ్చు.
ఆఫీసర్ వస్తారా?
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్స్‌లోకి రావాల్సింది. కానీ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల నిర్మాతల రిక్వెస్ట్, వివిధ సమీకరణాల నేపథ్యంలో ‘ఈగల్’ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకుని, ఫిబ్రవరిలో విడుదలైంది. దీంతో 2025 సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని రవితేజ ప్లాన్ చేశారు. రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ, హీరో రవితేజ ఓ సినిమా చేస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో రవితేజ భుజానికి గాయమైంది. దాంతో ఈ సినిమా చిత్రీకరణ సజావుగా సాగలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? లేదా అనే విషయంపై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. ‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరి పాత్రలో రవితేజ నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
గేమ్ చేంజర్ రెడీ
సంక్రాంతి బరికి సిద్ధమయ్యారు రామ్‌చరణ్. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తొలుత 2024 క్రిస్మస్‌కి రిలీజ్ చేయాలనుకున్నారు ‘దిల్’ రాజు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాల ట్రేడ్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ సూచనల మేరకు ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్‌ను 2024 క్రిస్మస్ నుంచి 2025 సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా నిర్మాత ‘దిల్’ రాజు ఇటీవల ఓ వీడియోలో వెల్లడించారు.
2025 జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక ‘గేమ్ చేంజర్’ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, నవీన్‌చంద్ర, ఎస్‌జే సూర్య, జయరాం, సునీల్, ప్రియదర్శి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ఇది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ల విధులు, హక్కులు, వారికి ఉండే ప్రత్యేక అధికారాలు వంటి అంశాల నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ ఉంటుందని టాక్.
నార్త్ ఇండియాలో...
ఈ సంక్రాంతి పండక్కి బాలకృష్ణ 109వ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. కేఎస్ రవీంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ దీపావళి సందర్భంగా టైటిల్, రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తారని, కథకు నార్త్ ఇండియా నేపథ్యం ఉంటుందని, విలన్‌గా బాబీ డియోల్, ఓ పోలీసాఫీసర్ పాత్రలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం.
మజాకా
ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌లో ‘మజాకా’ సెలబ్రేషన్స్ ఖాయం అంటున్నారు హీరో సందీప్ కిషన్. రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తీసిన నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్న చిత్రం ఇది.
మహేంద్రగిరి దేవాలయం
సంక్రాంతి వంటి పెద్ద పండక్కి మీడియమ్, స్మాల్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. ప్రతి సంక్రాంతికి ఇలాంటి చిత్రాలు రెండు అయినా వస్తుంటాయి. ఏ చిత్రం ఆడియన్స్‌కు నచ్చితే అది పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ కోవలో వస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సుమంత్ హీరోగా, బ్రహ్మానందం మరో లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా ఇది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు నిర్మిస్తున్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది.
2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ కావాల్సింది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. కానీ ‘విశ్వంభర’ జనవరి 10న రిలీజ్ కావడం లేదు. ‘విశ్వంభర’ సినిమా వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని, రామ్‌చరణ్– ‘దిల్’ రాజుగార్ల కోసం చిరంజీవిగారితో మాట్లాడి ‘విశ్వంభర’ రిలీజ్‌ను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నారు. ఇక ‘విశ్వంభర’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే 2025 సంక్రాంతి సందర్భంగా తాను హీరోగా నటించే ఓ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందన్నట్లు నాగార్జున గతంలో పేర్కొన్నారు. కానీ ఇది సాధ్యపడేలా లేదు. అయితే నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ ఓటీటీ డీల్స్, పర్‌ఫెక్ట్ రిలీజ్ డేట్స్ వంటి అంశాలను పరిశీలించుకుని ‘తండేల్’ సినిమా సంక్రాంతి రిలీజ్‌పై చిత్రయూనిట్ ఓ స్పష్టతకు వస్తారట.
‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ బాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సంక్రాంతి బరిలో స్ట్రయిట్ చిత్రాలతో పాటు ఒకటీ లేదా రెండు తమిళ హీరోల చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. ఇలా 2025 సంక్రాంతికి అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్స్‌లోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ క్యారెక్టర్‌లో మూడు వేరియేషన్స్ ఉంటాయి.
– ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment