ముగ్గులు వేస్తున్న జెన్నిఫర్ లార్సన్. చిత్రంలో దీపికారెడ్డి
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రముఖ నృత్యకారిణి, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్ దీపికారెడ్డి నివాసంలో శనివారం సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం.72లోని దీపికారెడ్డి నివాసంలో జరిగిన ఈ వేడుకలకు హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హాజరై సందడి చేశారు. దీపికారెడ్డి ఆమెకు సంప్రదాయబద్ధంగా తిలకందిద్ది ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జెన్నిఫర్ రంగవల్లులు వేసి మురిసి పోయారు.
సంక్రాంతి ప్రత్యేక వంటకాలైన అరిసెలు, సకినాలు, పొంగల్ రుచిచూసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం దీపికారెడ్డి శిష్యబృందం సంక్రాంతి నేపథ్యంగా నిర్వహించిన నృత్యరూపకాన్ని ఆమె తిలకించారు. సంక్రాంతి పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారో తెలియజేస్తూ.. ముగ్గులు, భోగి మంటలు, భోగి పండ్లు, సంక్రాంతి, కనుమ విశిష్టతలపై ఈ నృత్యరూపకం కొనసాగింది. 3 గంటలపాటు జెన్నిఫర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం శాస్త్రీయ నృత్య ముద్ర లను అభినయించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జెన్నిఫర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మన పండుగలను తెలుసుకునేందుకు ఆమె చూపిన ఉత్సా హం మరువలేనిదని ఈ సందర్భంగా దీపికారెడ్డి వెల్లడించారు. తమ ఇంట్లోకి వచ్చేక్రమంలో చెప్పులను బయట విడిచి రావడమే కాకుండా బొట్టు పెడుతుండగా దానిని ఆనందంతో ఆస్వాదించి పండుగలో నిమగ్నమైన తీరు ఆకట్టుకుందని ఈ సందర్భంగా దీపికారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment