
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి వేళ మాంసాహార ప్రియులకు చికెన్ ధర ఊరటనిస్తోంది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా దీని రేటు దిగివచ్చింది. దాదాపు నెల రోజుల కిందట కిలో బ్రాయిలర్ చికెన్ రూ.300కు పైగా పలికింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.190కి క్షీణించింది. సంక్రాంతి మర్నాడు కనుమ పండగకు మాంసాహారులు బంధుమిత్రులతో కలిసి విధిగా చికెన్, మటన్ వంటి వాటిని తినడం రివాజుగా వస్తోంది. సాధారణ రోజులకంటే ఆరోజు మూడు నాలుగు రెట్ల అధికంగా వీటి వినియోగం ఉంటుంది.
దీనిని ఆసరాగా చేసుకుని విక్రయదారులు వీటి ధరను గణనీయంగా పెంచుతుంటారు. అయితే ఈ ఏడాది కనుమకు బ్రాయిలర్ కోడి మాంసం సరసమైన ధరకే లభించనుంది. కొద్దిరోజుల నుంచి మార్కెట్‌లో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.170–180 మధ్య ఉంది. రెండ్రోజుల కిందట స్వల్పంగా పెరిగి రూ.190కు చేరుకుంది. అయినప్పటికీ ఈ ధర మధ్య తరగతి వారికి సైతం అందుబాటులోనే ఉంది. కిలో రూ.300 రేటుతో పోల్చుకుంటే దాదాపు 40 శాతం తగ్గింది. మంగళవారం కనుమ నాటికి మరికాస్త పెరిగినా అది రూ.10–20కి మించి ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా గడచిన కొన్నేళ్ల కనుమ పండగలతో పోల్చుకుంటే ఈసారి చికెన్ ధర చాలా తక్కువగా ఉందని నాన్‌వెజ్ ప్రియులు అంటున్నారు.
‘ఎగ్’బాకి.. దిగివచ్చి..
మరోవైపు కోడిగుడ్ల కొద్ది రోజుల నుంచి ధర స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. నెల రోజుల కిందట విశాఖపట్నంలో వంద గుడ్ల ధర రూ.590 ఉండగా డిసెంబర్ 27 నాటికి అది రికార్డు స్థాయిలో రూ.625కి ఎగబాకి పౌల్ట్రీ చరిత్రలో అత్యధిక ధరను నమోదు చేసింది. ఇలా ఈ నెల 10 వరకు ఇదే రేటు కొనసాగింది. 11వ తేదీ నుంచి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.599 రేటు కొనసాగుతోంది. రిటైల్ మార్కెట్లో ఒక్కొక్కటి రూ.7 చొప్పున విక్రయిస్తున్నారు.
గుడ్డుపై కోల్‌కతా మార్కెట్ ప్రభావం
కోడిగుడ్ల ధరపై కోల్‌కతా మార్కెట్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు నిత్యం కోడిగుడ్లు ఎగుమతి అవుతుంటాయి. శీతాకాలంలో ఆయా ప్రాంతాల ప్రజలు గుడ్లను విరివిగా తింటారు. దీంతో ఇతర సీజన్లకంటే ఈ శీతలంలో గుడ్ల వినియోగం గణనీయంగా ఊపందుకుంటుంది. దీనికనుగుణంగా వీటి రేటు కూడా పెరుగుతుంది. ఇటీవలే కోల్‌కతా మార్కెట్‌లో గుడ్ల కొనుగోళ్లను తగ్గించడంతో ధర క్షీణించింది. ఫలితంగా విశాఖలో వంద గుడ్ల ధర రూ.625 నుంచి 599కి తగ్గింది.
ధర తగ్గితే గుడ్లను నిల్వ చేసుకునే సదుపాయం ఉత్తరాంధ్రలో అంతగా లేదు. దీంతో పౌల్ట్రీ రైతులు రేటు ఎంతున్నా తెగనమ్ముకోవల్సిన పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రలో 40 లక్షల కోళ్లు రోజుకు సగటున 32 లక్షల గుడ్లను ఉత్పత్తి చేస్తుంటాయి. దాదాపుగా ఇవన్నీ స్థానికంగానే వినియోగమవుతాయని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ జాతీయ సభ్యుడు భరణికాన రామారావు ‘సాక్షి’కి చెప్పారు. పొరుగున ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే గుడ్లను కొన్ని స్థానిక వినియోగానికి, మరికొన్ని ఎగుమతి చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment