సంక్రాంతి పండగవేళ పేదల్లో స్వగృహానందం నెలకొంది. సొంతిళ్లులేని వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17,111 ఇళ్లను మంజూరు చేయగా వీటిలో 986 మంది నిర్మాణాలు పూర్తి చేశారు. నూతన గృహాల్లో సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకుంటున్నారు. మిగతా లబి్ధదారులు కూడా సొంతింటి కళను సాకారం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
సాక్షి, పాడేరు: జిల్లాలో ఇళ్లు లేని పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేస్తున్న పీఎంఏవై–వైఎస్సార్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం వరంలా మారింది. గతేడాది జిల్లాలోని 22 మండలాల్లో ప్రభుత్వం 17,111 పక్కా గృహాలను మంజూరు చేసింది. వీరిలో 1328 మంది గిరిజనులు వివిధ కారణాలతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. మిగతా 15,783 మందిలో 986 మంది పూర్తి చేశారు. మిగతా 14,791 మంది చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని ఈ ఏడాది మార్చి లోగా పూర్తి చేసే లక్ష్యంతో గృహ నిర్మాణశాఖ అధికారులు ఉన్నారు. ఈ బాధ్యతలను గ్రామసచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించారు.
ఒక్కొక్క ఇంటికి రూ.1.80 లక్షలు
ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వాలు రూ.1.80 లక్షలు మంజూరు చేశాయి. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో కూలీ పనుల రూపంలో రూ.12 వేలు, బాత్‌రూం నిర్మాణానికి రూ.18 వేలు చెల్లిస్తున్నాయి. ఇంటి నిర్మాణం స్థాయినిబట్టి బిల్లుల మంజూరు ప్రక్రియ పారదర్శకంగా చేస్తున్నారు. పనులు మరింత వేగవంతానికి కలెక్టర్ సుమిత్‌కుమార్ తరచూ గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు అదనంగా మరికొంత జోడించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
సకాలంలో బిల్లుల చెల్లింపులు
జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేశాం. గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పనుల్లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకల్లా ఎలాగైనా నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. బిల్లులు కూడా నిర్మాణ స్థాయిని బట్టి సకాలంలో మంజూరు చేస్తున్నాం. – బాబునాయక్, ఇన్‌చార్జి పీడీ, గృహ నిర్మాణశాఖ, పాడేరు
Comments
Please login to add a commentAdd a comment