అప్పుడే రైళ్లన్నీ ఫుల్‌! | - | Sakshi
Sakshi News home page

అప్పుడే రైళ్లన్నీ ఫుల్‌!

Published Wed, Oct 4 2023 7:54 AM | Last Updated on Wed, Oct 4 2023 8:49 AM

- - Sakshi

హైదరాబాద్: ఇక రైలు ప్రయాణం ‘ప్రత్యేకమే’. మరో నాలుగు నెలల వరకు రెగ్యులర్‌ రైళ్లలో ప్రయాణం చేయడం దాదాపు అసాధ్యంగా మారింది. దసరా, సంక్రాంతి పండుగల దృష్ట్యా ఇప్పటికే అన్ని ప్రధాన మార్గాల్లో రిజర్వేషన్‌లు భర్తీ అయ్యాయి. చాలా రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు వందల్లో దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో బుకింగ్‌లకు కూడా అవకాశం లేకుండా ‘నో రూమ్‌’ కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్‌ నుంచి సొంత ఊళ్లకు వెళ్లేందుకు నగరవాసులకు ప్రత్యేక రైళ్లే ప్రత్యామ్నాయంగా మారాయి. రెగ్యులర్‌ రైళ్లలో సాధారణ చార్జీలపైన రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉండగా, ప్రత్యేక రైళ్లు అన్నింటిలోనూ 20 శాతం వరకు అదనపు చార్జీలను విధించారు. దీంతో ఈ సారి పండుగ ప్రయాణం మరింత ‘ప్రియం’గా మారనుంది.

భారీగా వెయిటింగ్‌ ....
జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్‌ జాబితా 150 నుంచి 250 వరకు చేరింది. వచ్చే ఏడాది జనవరి 30వ తేదీ వరకు చాలా రైళ్లల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ చాంతాడంత ఉంది. సాధారణంగా ప్రయాణానికి మూడు నెలలు ముందుగానే బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉండడంతో దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లేవాళ్లు ఇప్పటికే రిజర్వేషన్‌లు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ, ఒడిశా, బెంగళూరు, తిరుపతి, కాకినాడ, నర్సాపూర్‌, నాగర్‌సోల్‌, పట్నా, దానాపూర్‌, జైపూర్‌, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. గౌతమి, గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, తదితర రైళ్లకు రానున్న నాలుగు నెలల వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ పైనే రిజర్వేషన్‌లు బుక్‌ చేసుకోవడం గమనార్హం. సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌ క్లాస్‌ కోసం కూడా భారీ పోటీ ఉంది.

పండుగలప్పుడే కాదు.. సెలవులొచ్చినా రద్దీనే
సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి సుమారు 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. పండుగలు, వరుస సెలవులు, వీకెండ్స్‌ వంటి ప్రత్యేక రోజుల్లో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. గతంలో సంక్రాంతికి మాత్రమే ఎక్కువ మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లేవారు. కానీ ఇప్పుడు నాలుగు రోజులు వరుసగా సెలవులొస్తే ఎక్కడికై నా వెళ్లేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. సెలవు రోజుల్లో సుమారు 30 వేల మందికి పైగా అదనంగా ప్రయాణం చేస్తున్నట్లు అంచనా.

ఆర్టీసీలో అలా...రైల్వేలో ఇలా...
ఆర్టీసీల్లో ప్రత్యేక చార్జీలను ఉపసంహరించారు. గతంలో దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పర్వదినాల్లో 50 శాతం అదనపు చార్జీలు విధించేవారు. దీంతో ప్రయాణికులు రైళ్లకే ఎక్కువగా మొగ్గుచూపేవారు. బస్సు చార్జీల కంటే రైలు చార్జీలు చాలా తక్కువ కావడమే ఇందుకు కారణం. కానీ ప్రస్తుతం ఆర్టీసీల్లో ఎలాంటి అదనపు చార్జీలు విధించడం లేదు. పైగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లే గరుడ ప్లస్‌ బస్సుల్లో ప్రయాణించే వారికి 10శాతం వరకు రాయితీ లభిస్తోంది. ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. కానీ రైలు ప్రయాణం అందుకు భిన్నంగా మారింది. రెగ్యులర్‌ రైళ్లలో ప్రయాణం చేసేందుకు అవకాశం లేదు. దీంతో తత్కాల్‌ చార్జీలపైన ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లు భారంగా మారాయి.

ప్యాసింజర్‌ రైళ్లు తగ్గుముఖం..
మరోవైపు సాధారణ ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా అందుబాటులో ఉండే ప్యాసింజర్‌ రైళ్లను చాలా వరకు తగ్గించారు. మౌలిక సదుపాయాల కల్పన పేరిట హైదరాబాద్‌ నుంచి వరంగల్‌, కాజీపేట్‌, భద్రాచలం, విజయవాడ, కర్నూలు, తదితర ప్రాంతాలకు నడిచే సుమారు 22 రైళ్లు గత 3 నెలలుగా నిలిచిపోయాయి. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement