బైకులు దొంగిలిస్తున్న మైనర్ అరెస్ట్
చార్మినార్: గుట్టు చప్పుడు కాకుండా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న మైనర్ నిందితున్ని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించినట్లు చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్, హుస్సేనీ ఆలం ఇన్‌స్పెక్టర్ సురేందర్ తెలిపారు. నిందితుని వద్ద నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మరో మైనర్ నిందితుని కోసం వెతుకుతున్నామన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచమహల్లాలో నివాసముంటున్న మహమ్మద్ ఎజాజ్ ఈ నెల 5వ తేదీన రంజాన్ ప్రార్థనలు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చి తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు పరిశీలించగా పార్క్ చేసిన ద్విచక్ర వాహనం కనిపించలేదు. వెంటనే పరిసర వీధుల్లో వెతికినా.. ప్రయోజనం కనిపించకపోవడంతో.. ఈ నెల 6న హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 11న దొంగిలించిన వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ మైనర్ హుస్సేనీ ఆలం పోలీసులకు చిక్కాడు. వెంటనే విచారణ కొనసాగించిన పోలీసులకు ద్విచక్ర వాహనాల దొంగతనాలు వెలుగు చూశాయి. తన స్నేహితుడైన మైనర్ నిందితునితో కలిసి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, మీర్‌పేట పరిధిలో ఒకటి, మొగల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి.. చొప్పున 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని మైనర్‌ను జ్యువైనల్ హోంకు తరలించారు. వీటి విలువ దాదాపు రూ.2.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment