మంచినీటి ట్యాంకర్లకు మహా డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: నలు దిశలా విస్తరిస్తున్న హైదరాబాద్ మహనగర పరిధిలో వాటర్ ట్యాంకర్లకు యేటా డిమాండ్ పెరుగుతోంది. గత ఐదేళ్లలో ట్యాంకర్ల బుకింగ్ తీరును పరిశీలిస్తే సుమారు 50 శాతం పైగా పెరిగినట్లు జలమండలి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న బహుళ అంతస్తుల భవనాలతో విచ్చలవిడిగా..అత్యంత లోతుగా బోర్ల తవ్వకాలు జరిగి భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వేసవి వచ్చిందంటే నీటి వినియోగం మరింత పెరిగి ట్యాంకర్లకు డిమాండ్ రెట్టింపు అవుతోంది. మొత్తం మీద సుమారు 42 వేల బహుళ అంతస్తుల భవన సముదాయాల నుంచి అత్యధికంగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్ జరుగుతున్నట్లు ఇటీవల జలమండలి గుర్తించింది. హఫీజ్‌పేట, శేరిలింగంపల్లి, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, మణికొండ, నిజాంపేట్ డివిజన్ పరిధిలోని పలు సెక్షన్ల పరిధిలో సుమారు 500 నుంచి 10 వేలవరకు ట్యాంకర్ల బుకింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
గత ఐదేళ్లలో ఇలా..
మహానగర పరిధిలో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ పరిశీలిస్తే..జనవరి నుంచి జూన్‌న రెండో వారం వరకు ట్యాంకర్లకు తాకిడి అధికంగానే ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి యేటా ట్యాంకర్ల డిమాండ్ కనీసం 10 నుంచి 15 శాతం పెరుగుతూ వస్తోంది. గత ఐదేళ్లలో డిమాండ్ పరిశీలిస్తే ఈ ఏడాది జనవరి నుంచే తాకిడి పెరిగింది. గతేడాదితో పోల్చితే అదనంగా సుమారు 46 శాతం ఎగబాకింది. అదేవిదంగా ఫిబ్రవరి నెలలో సైతం అదే విధంగా నమోదైంది. సాధారణంగా మార్చి నెలలో ట్యాంకర్లకు డిమాండ్ కనీసం 30 నుంచి 50 శాతం వరకు అదనంగా ఉంటుంది. అయితే ఈ సారి మార్చి నుంచి మూడు నెలల పాటు ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ట్యాంకర్లకు డిమాండ్ కూడా ఈసారి అదనంగా 60 నుంచి70 శాతం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ట్యాంకర్లు, ఫిల్లింగ్‌స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లను పెంచి నీటిని సరఫరా చేసేవిధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు.
● మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషనన్‌లో ఆరు ఫిల్లింగ్ పాయింట్స్, 80 ట్యాంకర్లు ఉన్నాయి. రోజుకి 600 ట్రిప్పులు డెలివరీ జరుగుతోంది. 80 శాతం బుకింగ్స్‌ను 6 నుంచి 12 గంటల్లో డెలివరీ చేస్తుండగా..మిగిలిన 20 శాతం 24 గంటల్లో డెలివరీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 1200 బుకింగ్స్ వచ్చినా డెలివరీ చేసే సామర్థ్యం ఉందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు.
● బంజారాహిల్స్ ఫిల్లింగ్ స్టేషన్‌లో 8 ఫిల్లింగ్ పాయింట్స్, 44 ట్యాంకర్లు ఉండగా.. రోజుకి 300 ట్రిప్పులు డెలివరీ చేస్తున్నారు. ఎర్రగడ్డ ఫిల్లింగ్ స్టేషన్‌న్‌లో 4 ఫిల్లింగ్ పాయింట్స్, 29 ట్యాంకర్లు ఉండగా రోజుకి 150 ట్రిప్పులు డెలివరీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment