100% ఆక్యుపెన్సీ దాటిన ‘వందేభారత్‌’ | increased passenger traffic in vande bharath train | Sakshi
Sakshi News home page

100% ఆక్యుపెన్సీ దాటిన ‘వందేభారత్‌’

Published Tue, Jan 2 2024 3:37 AM | Last Updated on Tue, Jan 2 2024 3:37 AM

increased passenger traffic in vande bharath train - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన వందేభారత్‌ రైళ్లు అత్యధిక ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్నాయి. దక్షిణమధ్య రైల్వేలో గతేడాది ప్రవేశపెట్టిన నాలుగు రైళ్లలో ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. 

సికింద్రాబాద్‌–విశాఖపట్నం వందేభారత్‌లో 134% ఆక్యుపెన్సీ.. 
సికింద్రాబాద్‌–విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను గతేడాది జనవరిలో ప్రవేశపెట్టారు. 16 కోచ్‌లతో ఈ రైలు ప్రారంభమైంది. మొదటి నుంచి ఈ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. గత డిసెంబర్‌లో ఈ ట్రైన్‌లో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది.

సికింద్రాబా ద్‌ నుంచి విశాఖకు వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో 134 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇక విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే వందేభారత్‌లో ఇది ఏకంగా 143 శాతానికి చేరుకుంది. సంవత్సరాంతం కావడంతో రెండు వైపుల నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో చాలా మంది వెయిటింగ్‌ జాబితాలో నిరీక్షించవలసి వచ్చింది. గత డిసెంబర్‌ ఆఖరు వారంలో వరుస సెలవులు రావడంతో ఎక్కువ మంది రాకపోకలు సాగించారు. సంక్రాంతి వరకు కూడా ప్రయాణికుల రద్దీ ఇలాగే ఉండవచ్చని అధికారులు తెలిపారు. 

సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌లో... 
గతేడాది ఏప్రిల్లో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను మొదట 8 కోచ్‌లతో ప్రారంభించారు. ఈ ట్రైన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తోంది. ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో గతేడాది మే 17 నుంచి 16 కోచ్‌లకు పెంచారు. గత డిసెంబర్‌లో సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వరకు 114 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే వందేభారత్‌లో 105 శాతానికి ఆక్యుపెన్సీ చేరుకోవడం గమనార్హం. మరోవైపు గత సెపె్టంబర్‌లో 8 బోగీలతో ప్రవేశపెట్టిన కాచిగూడ–యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో డిసెంబర్‌లో ఆక్యుపెన్సీ 107 శా తానికి చేరింది. తిరుగుదిశలో యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడ వరకు 110 శాతం వరకు నమోదైంది.

అలాగే దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విజయవాడ–ఎంజీఆర్‌ చెన్నై–వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో సైతం గత డిసెంబర్‌లో 126 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా చెన్నై నుంచి విజయవాడకు వచ్చే ట్రైన్‌లో ఇది 119 శాతం వరకు ఉంది. గత సెస్టెంబర్‌లో 8 కోచ్‌లతో ఈ ట్రైన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ట్రైన్‌ తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తోంది. 

ఆకట్టుకుంటున్న సదుపాయాలు... 
వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఏర్పాటు చేసిన సదుపాయాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకొనే విధంగా రైళ్లను నడుపుతుండటంతో ఎక్కువ మంది వందేభారత్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ ట్రైన్‌లో ఏసీ చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లతో అన్ని రకాలసదుపాయాలు అందుబాటులో ఉన్నా యి.

జీపీఎస్‌ ఆధారిత ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్, ఆటోమేటిక్‌ స్లైడింగ్‌ డోర్లు, రిక్లైనింగ్‌ సీట్లు, అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, డిఫ్యూజ్డ్‌ ఎల్‌ఈడీ లైటింగ్, చార్జింగ్‌ పాయింట్లు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులకు పూర్తిగా సురక్షితమైన, మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement