తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. శనివారం 65,962 మంది స్వామివారిని దర్శించుకోగా 24,575 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
తిరుమలలో భోగి సంబరాలు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వద్ద టీటీడీ అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులు భోగి మంట వేశారు. కలియుగ దేవుడైన శ్రీనివాసుడి క్షేత్రంలో భోగి పండుగ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. భోగి పండుగ రోజున సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు.
జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉదయం 6.30 గంటలకు ఆలయం నుండి చక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా కపిలతీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్కడ చక్రస్నానం అనంతరం ఆస్థానం చేపడతారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
సంక్రాంతి శుభాకాంక్షలు
జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment