Bhoomana Karunakara Reddy
-
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 2 గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. శనివారం 65,962 మంది స్వామివారిని దర్శించుకోగా 24,575 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమలలో భోగి సంబరాలు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వద్ద టీటీడీ అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులు భోగి మంట వేశారు. కలియుగ దేవుడైన శ్రీనివాసుడి క్షేత్రంలో భోగి పండుగ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. భోగి పండుగ రోజున సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు. జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉదయం 6.30 గంటలకు ఆలయం నుండి చక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా కపిలతీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్కడ చక్రస్నానం అనంతరం ఆస్థానం చేపడతారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. -
కార్తికేయను మించి ఆదరించాలి
‘‘శ్రీకృష్ణుని చుట్టూ అల్లుకున్న కథాంశంతో ‘కార్తికేయ 2’ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాతలు విశ్వప్రసాద్, అభిషేక్ చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది. ‘కార్తికేయ’ సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఆదించారో అంతకు మించి ‘కార్తికేయ 2’ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ 2’ సినిమా తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధానంలో సోమవారం ప్రారంభమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఆయన తనయడు అభినయ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నిఖిల్ మాట్లాడుతూ– ‘‘భారతీయ సంప్రదాయాలను ‘కార్తికేయ 2’లో అద్భుతంగా చూపెట్టనున్నాం. ఉగాది తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి సాధ్యమైనంత త్వరగా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘తాజాగా విడుదల చేసిన ‘కార్తికేయ 2’ టైటిల్ లోగో, కాన్సెప్ట్ వీడియోకి మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. ఈ సీక్వెల్ కచ్చితంగా ప్రేక్షకులకు ప్రత్యేకమైన థ్రిల్ ఇస్తుంది’’ అన్నారు టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, చందు మొండేటి, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. -
జిల్లాలో హైట్రిక్ వీరులు..
సాక్షి, కర్నూలు (అర్బన్) : హ్యాట్రిక్... క్రికెట్, సినిమా, పాలిటిక్స్ ... ఇలా ఏ రంగంలోనైనా ఈ ఘనత సాధిస్తే చరిత్రలో నిలిచిపోతారు. కర్నూలు జిల్లాలో 1952 నుంచి 2009 వరకు జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పలువురు వరుసగా మూడు సార్లకు పైగా ఎన్నికై చరిత్రలో నిలిచిపోయారు. వారిలో భూమా నాగిరెడ్డి, శాసనసభకు సంబంధించి బుడ్డా వెంగళరెడ్డి, వి రాంభూపాల్‌చౌదరి, బీవీ సుబ్బారెడ్డి, కర్రా సుబ్బారెడ్డి, కేఈ క్రిష్ణమూర్తి, ఎస్వీ సుబ్బారెడ్డి, దామోదరం మునిస్వామి, ఎం శిఖామణి, బీవీ మోహన్‌రెడ్డి, కే చెన్నకేశవరెడ్డి ఉన్నారు. అయితే పలువురు పార్లమెంట్ సభ్యులు, శానససభ్యులు ఐదు సార్లకు పైగా ఎన్నికైనా, వారు వరుసగా విజయం సాధించలేక పోయిన నేపథ్యంలో వారు హ్యాట్రిక్ లీడర్స్‌గా మిస్సై పోయారు. వి. రాంభూపాల్‌చౌదరి కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వి రాంభూపాల్‌చౌదరి 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కాంగ్రెస్ అభ్యర్థి దావూద్‌ఖాన్‌ను ఓడించారు. అలాగే 1985, 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కే నాగిరెడ్డి, సీపీఎం అభ్యర్థి ఎంఏ గఫూర్‌ను ఓడించారు. భూమా నాగిరెడ్డి నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రంగయ్య నాయుడుపై విజయం సాధించారు. అలాగే 1998, 1999లో జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై విజయం సాధించారు. బుడ్డా వెంగళరెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ప్రస్తుతం శ్రీశైలం) నుంచి 1978, 1983,1985,1989 సంవత్సరాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దివంగత బుడ్డా వెంగళరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా వరుసగా టీ రంగసాయి, బీజే రెడ్డి, జి నాగలక్ష్మిరెడ్డి, శివరామిరెడ్డిలను ఓడించారు. బీవీ సుబ్బారెడ్డి కోవెలకుంట్ల (ప్రస్తుతం బనగానపల్లె) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1955లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బీవీ సుబ్బారెడ్డి 1962,1967,1972 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా గెలుపొందారు. కాగా 1962, 1972లో బీవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేఈ కృష్ణ్ణమూర్తి డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి 1978లో ఇందిరా కాంగ్రెస్, 1983లో కాంగ్రెస్, 1985లో తెలుగుదేశం, 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుస విజయాలను సాధించారు. అలాగే 2009లో డోన్ నుంచి, 2014లో పత్తికొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. కర్రా సుబ్బారెడ్డి కోవెలకుంట్ల (ప్రస్తుతం బనగానపల్లె) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత కర్రా సుబ్బారెడ్డి వరుసగా 1985, 1989, 1994 వరకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా బీ రామస్వామిరెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, చల్లా రామక్రిష్ణారెడ్డిపై విజయం సాధించారు. ఎం. శిఖామణి కోడుమూరు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత ఎం శిఖామణి 1994, 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుస విజయాలను సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థులు బంగి అనంతయ్య, వై జయరాజు, ఆకెపోగు ప్రభాకర్‌ను ఓడించారు. ఎస్వీ సుబ్బారెడ్డి పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి 1994, 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థులు పి. శేషిరెడ్డి, కె. సాంబశివారెడ్డి, పి. నీరజారెడ్డిని ఓడించారు. బీవీ మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి టీడీపీ ఆవిర్భావం 1983 నుంచి వరుసగా 1985, 1989, 1994, 1999 వరకు విజయం సాధిం చారు. ఈయన చేతిలో హనుమంతరెడ్డి, దేవేంద్రగౌడు, ఎంఎస్ శివన్న,కేశవరెడ్డి ఓటమి చెందారు. చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కే చెన్నకేశవరెడ్డి 2004, 2009, 2012లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రాజకీయ భీష్ముడైన బీవీ మోహన్‌రెడ్డిని ఓడించారు. రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా, ఒకసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. -
‘శత్రువు అడిగినా సహాయం చేస్తా’
తిరుపతి: నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ అభిమానిస్తానని, నా సహాయం కోరి శత్రువు వచ్చినా సహాయం చేస్తానని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. స్థానిక అనంతవీధిలో కాపు, బలిజ వర్గానికి చెందిన సుమారు 500 మంది భూమన సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి భూమన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో భూమన మాట్లాడుతూ.. తనకు కులం, మతం లేదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు పరిష్కారం మాత్రమే చేస్తానని అన్నారు. అనంతాళ్వర్ కారణంగా ఈ వీధికి అనంత వీధి అని పేరు వచ్చిందని, మీ విలువైన ఓటును నాకు వేసి గెలిపించాలని కోరారు. మీకు సేవకుడి ఉంటానని హామీ ఇచ్చారు. తాను కులానికి వ్యతిరేకమని, మనుషులకు మంచికి మాత్రమే అనుకూలమన్నారు. తన తర్వాత తన కుమారుడు భూమన అభినయ రెడ్డి రాజకీయాల్లోకి రాడని వెల్లడించారు. -
ప్రజా బ్యాలెట్లో చంద్రబాబు చిత్తు
తిరుపతి సెంట్రల్ : వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్టీవీ నగర్ వద్ద శనివారం వైఎస్సార్సీపీ ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. అధిక సంఖ్యాకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు. ప్రజా వ్యతిరేకత స్పష్టమైంది. ప్రజా బ్యాలెట్‌ను పర్యవేక్షించిన సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటిని ఎండగట్టారు. తమను నిలువునా మోసం చేసిన చంద్రబాబు నాయుడు వైఖరిని ప్రజలు గ్రహించారన్నారు. ఈ సారి ఎన్నికలో టీడీపీకి గుణపాఠం చెబుతారన్నారు. ప్రజా వ్యతిరేకతలో చంద్రబాబు ప్రభుత్వం కొట్టుకుపోతుందని తాము నిర్వహించిన ప్రజా బ్యాలెట్లో తేలిపోయిందని స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి తరహాలోనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తారని పేర్కొన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపు నిచ్చారు. సీఎం చంద్రబాబును ప్రజలెవరూ విశ్వసించే పరిస్థితి లేదని పార్టీ నాయకులు ఎస్కే బాబు, కోటూరి ఆంజినేయులు అన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ప్రజా బ్యాలెట్లో పాల్గొన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దుద్దేల బాబు, ఎంవీఎస్ మణి, సాకం ప్రభాకర్, కేతం జయచంద్రారెడ్డి, తలారి రాజేంద్ర, కట్టా గోపీయాదవ్, వాసుయాదవ్, ఆరె అజయ్‌కుమార్, నల్లాని బాబు, తిరుమలయ్య, పైడి చంద్రశేఖర్ రాయల్, జీవరత్నం, కోబాకు ధనుంజయ రెడ్డి, మబ్బు నాధముని రెడ్డి, మాకం చంద్ర, కొత్తపాటి మనోహర్ రెడ్డి, మాధవ నాయుడు, జీవీ కుమార్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా బ్యాలెట్ నిర్వహించారిలా.. చంద్రబాబు పాలనపై తిరుపతిలోని ఎస్టీవీ నగర్లో వెఎస్సార్సీపీ శనివారం ప్రజాబ్యాలెట్ నిర్వహించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్కే బాబు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు కోటూరి ఆంజినేయులు సారథ్యం వహించారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణమైన హామీలు అమలు చేశారా లేదా అనే ఆరు అంశాలపై బ్యాలెట్‌ను రూపొందిం చారు. నిర్ణీత సమయం ముగిసే సరికి 900 మంది పాల్గొన్నట్టు ఎస్కే బాబు తెలిపారు. 831 మంది చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా, 69 మంది అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. -
వైఎస్ జగన్ సీఎం కావాలని..
సాక్షి, తిరుమల : వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని, తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకరరెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తూ మంగళవారం తిరుమలలోని జాపాలి ఆంజనేయస్వామి దగ్గరకు 8 మంది అభిమానులు మోకాళ్లపై వెళ్లి వేడుకున్నారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేత దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఎనిమిదిమంది తిరుమలలోని జాపాలి తీర్థానికి సుమారు 2 కిలోమీటర్ల దూరం మెట్లమార్గంలో మోకాళ్లపై వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2009లో వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం కావాలని ఇదే తరహాలో మోకాళ్లపై వచ్చి స్వామిని వేడుకున్నానన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందాలని స్వామిని కోరేందుకు మోకాళ్లపై వచ్చామన్నారు.