జిల్లాలో హైట్రిక్‌ వీరులు.. | The Assembly And The Lok Sabha Elections In Ihe History Of The Elections For Three Consecutive Terms | Sakshi
Sakshi News home page

జిల్లాలో హైట్రిక్‌ వీరులు..

Published Fri, Mar 15 2019 8:37 AM | Last Updated on Fri, Mar 15 2019 8:37 AM

The Assembly And The Lok Sabha Elections In Ihe History Of The Elections For Three Consecutive Terms - Sakshi

సాక్షి, కర్నూలు (అర్బన్‌) :  హ్యాట్రిక్‌... క్రికెట్, సినిమా, పాలిటిక్స్‌ ... ఇలా ఏ రంగంలోనైనా ఈ ఘనత సాధిస్తే చరిత్రలో నిలిచిపోతారు. కర్నూలు జిల్లాలో 1952 నుంచి 2009 వరకు జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పలువురు వరుసగా మూడు సార్లకు పైగా ఎన్నికై చరిత్రలో నిలిచిపోయారు. వారిలో భూమా నాగిరెడ్డి, శాసనసభకు సంబంధించి బుడ్డా వెంగళరెడ్డి, వి రాంభూపాల్‌చౌదరి, బీవీ సుబ్బారెడ్డి, కర్రా సుబ్బారెడ్డి, కేఈ క్రిష్ణమూర్తి, ఎస్‌వీ సుబ్బారెడ్డి, దామోదరం మునిస్వామి, ఎం శిఖామణి, బీవీ మోహన్‌రెడ్డి, కే చెన్నకేశవరెడ్డి ఉన్నారు. అయితే పలువురు పార్లమెంట్‌ సభ్యులు, శానససభ్యులు ఐదు సార్లకు పైగా ఎన్నికైనా, వారు వరుసగా విజయం సాధించలేక పోయిన నేపథ్యంలో వారు హ్యాట్రిక్‌ లీడర్స్‌గా మిస్సై పోయారు.  

వి. రాంభూపాల్‌చౌదరి
కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వి రాంభూపాల్‌చౌదరి 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దావూద్‌ఖాన్‌ను ఓడించారు. అలాగే 1985, 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కే నాగిరెడ్డి, సీపీఎం అభ్యర్థి ఎంఏ గఫూర్‌ను ఓడించారు. 

భూమా నాగిరెడ్డి
నంద్యాల పార్లమెంట్‌ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ రంగయ్య నాయుడుపై విజయం సాధించారు. అలాగే 1998, 1999లో జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై విజయం సాధించారు.  

బుడ్డా వెంగళరెడ్డి
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ప్రస్తుతం శ్రీశైలం) నుంచి 1978, 1983,1985,1989 సంవత్సరాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దివంగత బుడ్డా వెంగళరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా వరుసగా టీ రంగసాయి, బీజే రెడ్డి, జి నాగలక్ష్మిరెడ్డి, శివరామిరెడ్డిలను ఓడించారు. 

బీవీ సుబ్బారెడ్డి
కోవెలకుంట్ల (ప్రస్తుతం బనగానపల్లె) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1955లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బీవీ సుబ్బారెడ్డి 1962,1967,1972 వరకు  జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరుసగా గెలుపొందారు. కాగా 1962, 1972లో బీవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

కేఈ కృష్ణ్ణమూర్తి
డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి 1978లో ఇందిరా కాంగ్రెస్, 1983లో కాంగ్రెస్, 1985లో తెలుగుదేశం, 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరుస విజయాలను సాధించారు. అలాగే 2009లో డోన్‌ నుంచి, 2014లో పత్తికొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 

కర్రా సుబ్బారెడ్డి
కోవెలకుంట్ల (ప్రస్తుతం బనగానపల్లె) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత కర్రా సుబ్బారెడ్డి వరుసగా 1985, 1989, 1994 వరకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా బీ రామస్వామిరెడ్డి, ఎస్‌వీ సుబ్బారెడ్డి, చల్లా రామక్రిష్ణారెడ్డిపై విజయం సాధించారు. 

ఎం. శిఖామణి
కోడుమూరు ఎస్‌సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత ఎం శిఖామణి 1994, 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరుస విజయాలను సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థులు బంగి అనంతయ్య, వై జయరాజు, ఆకెపోగు ప్రభాకర్‌ను ఓడించారు. 

ఎస్‌వీ సుబ్బారెడ్డి
పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్‌వీ సుబ్బారెడ్డి 1994, 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థులు పి. శేషిరెడ్డి, కె. సాంబశివారెడ్డి, పి. నీరజారెడ్డిని ఓడించారు. 

బీవీ మోహన్‌రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి టీడీపీ ఆవిర్భావం 1983 నుంచి వరుసగా 1985, 1989, 1994, 1999 వరకు విజయం సాధిం చారు. ఈయన చేతిలో హనుమంతరెడ్డి, దేవేంద్రగౌడు, ఎంఎస్‌ శివన్న,కేశవరెడ్డి ఓటమి చెందారు. 

చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కే చెన్నకేశవరెడ్డి 2004, 2009, 2012లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రాజకీయ భీష్ముడైన బీవీ మోహన్‌రెడ్డిని ఓడించారు. రెండు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా, ఒకసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement