
ఎల్.ఎన్.పేట(శ్రీకాకుళం): కొండల్లో పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే గిరిజనులు దిగువ ప్రాంతాల్లో ఉంటున్న ఇతర కులాల (తెగల) వారితో నేస్తరికం (స్నేహం) చేస్తారు. సంక్రాంతి పండగతో పాటు దసరా, దీపావళి, ఉగాది వంటి పండగల సమయంలో గిరిజన సంప్రదాయ ప్రకారం నేస్తం ఇంటికి వెళతారు. గిరిజనులు పోడు పంటగా పండించే రకరకాల పంటలను కొద్దికొద్ది గా తీసుకుని నేస్తం ఇంటికి పయనమవుతారు.
భోగీ రోజున ఉదయం నేస్తం ఇంటికి చేరుకుని సాయంత్రం వరకు ఉంటారు. ఆ సమయంలో గుమ్మడికాయ, కర్రపెండ్లం, అరటి కాయలు, అరటి పళ్లు, కందికాయలు, కందులు, అరటి ఆకులను ప్రేమగా అప్పగిస్తారు. తమ గిరిజన నేస్తానికి దిగువ ప్రాంతంలోని వారు రకరకాల వంటలతో కొసరి కొసరి సంతృప్తిగా భోజనం పెట్టి కొత్త దుస్తులు, బియ్యం, పప్పులు, పిండి వంటలు, దారి ఖర్చులకు కొంత మొత్తం డబ్బులు అందిస్తారు. ఇలా సంతృప్తి పొందిన గిరిజన నేస్తం కుటుంబం పది కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తారు.