అమలాపురం రూరల్: అసలే పెద్ద పండగ. వారంతా పూర్వ విద్యార్థులు. 28 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. ఇంతకన్నా పెద్ద సందర్భం ఏముంటుంది వారి అల్లరికి? 1993–96 అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాల బీకాం బ్యాచ్ వారంతా. చదివింది బీకాం అయినా కామ్‌గా ఉండే బ్యాచ్ కాదది. అటువంటి వారంతా ఆదివారం ఆ కళాశాలలో సమావేశమయ్యారు. కలసిన సమయం అంతా నాటి అల్లర్లలోకి, సరదా కబుర్లలో మునిగి తేలిపోయారు. హైదరాబాద్ జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్ ఈ బ్యాచ్‌లో సభ్యుడే.
వారికి తోడు సినీ హీరో నాగార్జున వీడియో ద్వారా తన సందేశాన్ని విద్యార్థులకు పంపుతూ వారి కలయికను అభినందిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మా నిమ్మకాయల ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారని నాగార్జున ఆ వీడియోలో ప్రస్తావించారు. దాదాపు 120 మందితో కూడి ఆ బ్యాచ్ కుటుంబ సమేతంగా ఎంతో సందడి చేశారు.
వారికి పాఠాలు చెప్పిన అప్పటి అధ్యాపకులు డాక్టర్ పైడిపాల, కనకరాజు, వక్కలంక కృష్ణమోహన్ తదితరులను సాదరంగా ఆహ్వానించి పాదాభివందనాలు చేసి సన్మానించారు. పూర్వపు విద్యార్థులు మున్సిపల్ కౌన్సిలర్ గొవ్వాల రాజేష్, పిండి శేషు, నల్లా శ్రీధర్, సాపే శ్రీనివాస్ (హైదరాబాద్), కుమారి (గుజరాత్), చొల్లంగి సుబ్బిరామ్ తదితరులు పూర్వపు విద్యార్థులను సమీకరించి ఈ వేడుకకు ఏర్పాటుచేశారు. చివరగా తమ జ్ఞాపకాలను వారు పదిలం చేసుకుంటూ గ్రూప్ ఫోటో దిగారు.
Comments
Please login to add a commentAdd a comment