కోనసీమ: ఇంజరం సచివాలయ కార్యదర్శిగా సేవలందిస్తున్న గాలిదేవర శివ గంగాదుర్గ థాయిలాండ్‌లో జరిగిన పారా ఒలింపిక్స్ క్రీడల్లో సత్తాచాటింది. డిస్కస్ త్రో, జెవెలెన్ త్రోలలో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. షార్ట్‌పుట్‌లో నాలుగవ స్థానంలో నిలిచింది. పతకాలు అందుకుని తాళ్లరేవు వచ్చిన శివ గంగాదుర్గకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ ఎం.అనుపమ, ఈఓపీఆర్‌డీ మల్లాడి భైరవమూర్తి, కార్యాలయ ఏఓ చింతా మోహనకృష్ణ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది హారతులిచ్చి స్వాగతం పలికారు. దుశ్శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామానికి చెందిన శివ గంగాదుర్గ 2019లో ఇంజరం సచివాలయం–2లో గ్రేడ్–5 కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి సేవలందిస్తున్నారు.
ఆటలపై మక్కువతోనే పారా ఒలింపిక్స్‌కు...
శివ గంగాదుర్గకు చిన్నతనం నుంచి ఆటలంటే ఎంతో మక్కువ. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు స్థానికంగా ఉన్న కాన్వెంట్‌లో చదివి, తరువాత టెన్త్ వరకు హైస్కూల్‌లో చదివారు. ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో పక్షవాతం వచ్చి ఎడమ చేయి పనిచేయకుండా పోయింది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో చదివి ఇంటర్ పూర్తిచేసింది. సుంకరపాలెం రవి కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్‌సీ స్పేస్ ఫిజిక్స్ చేసేందుకు చేరింది. ఆ సమయంలో పారా ఒలింపిక్స్ గురించి తెలుసుకుని, ఎలాగైనా పారా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని కంకణం కట్టుకుంది.
పీజీ పూర్తికాకుండానే సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువు మానేసి ఉద్యోగంలో చేరింది. యానాంలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా ప్రాంగణంలో పారా స్పోర్ట్స్ కోసం ప్రత్యేక తర్ఫీదు తీసుకుంది. 2021లో బిహార్‌లో జరిగిన జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్‌లో డిస్కస్ త్రోలో బంగారు పతకం సాధించింది. 2022, 23లలో జరిగిన జాతీయస్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనబరచడంతో ఇటీవల థాయిలాండ్‌లో జరిగిన పారా ఒలింపిక్స్‌కు ఎంపికైంది. భారతదేశం నుంచి సుమారు 70 మంది పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్‌నుంచి ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. వీరిలో శివ గంగాదుర్గ డిస్కస్ త్రో, జావెలెన్ త్రోలలో ఎఫ్–35 విభాగంలో బంగారు పతకాలు సాధించింది. మరో క్రీడ షాట్‌పుట్‌లో నాలుగవ స్థానంలో నిలిచింది.
రూ.2 లక్షల బ్యాంకు రుణం తీసుకుని...
పారా ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే రూ.2లక్షలకు పైగా ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. శివ గంగాదుర్గ ప్రతిభను గుర్తించిన రిలయన్స్ సంస్థ రూ.50 వేల సహాయం ప్రకటించింది. దీంతో మరో రూ.2 లక్షలు బ్యాంకు రుణం తీసుకుని పోటీ లకు హాజరైనట్లు శివ గంగాదుర్గ విలేకర్లకు తెలిపింది. ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ, సహచర ఉద్యోగుల సహకారంతో ఈ ఘనత సాధించగలిగానని తెలి పింది. తన తండ్రి వెంకట్రామయ్య తాను 6వ తరగతి చదివే సమయంలో మృతి చెందారని, అప్పటి నుంచి తల్లి లక్ష్మి టైలరింగ్ చేస్తూ తమ కుటుంబాన్ని పోషించి తనను ఈ స్థాయికి తీసుకువచ్చినట్లు చెప్పింది. తనకు స్పాన్సర్స్ ఉంటే మరిన్ని పతకాలు సాధిస్తానని శివ గంగాదుర్గ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment