meet to
-
బీకామ్ బ్యాచ్.. పెద్ద సందడి..
అమలాపురం రూరల్: అసలే పెద్ద పండగ. వారంతా పూర్వ విద్యార్థులు. 28 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. ఇంతకన్నా పెద్ద సందర్భం ఏముంటుంది వారి అల్లరికి? 1993–96 అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల బీకాం బ్యాచ్ వారంతా. చదివింది బీకాం అయినా కామ్‌గా ఉండే బ్యాచ్ కాదది. అటువంటి వారంతా ఆదివారం ఆ కళాశాలలో సమావేశమయ్యారు. కలసిన సమయం అంతా నాటి అల్లర్లలోకి, సరదా కబుర్లలో మునిగి తేలిపోయారు. హైదరాబాద్ జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్ ఈ బ్యాచ్‌లో సభ్యుడే. వారికి తోడు సినీ హీరో నాగార్జున వీడియో ద్వారా తన సందేశాన్ని విద్యార్థులకు పంపుతూ వారి కలయికను అభినందిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మా నిమ్మకాయల ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారని నాగార్జున ఆ వీడియోలో ప్రస్తావించారు. దాదాపు 120 మందితో కూడి ఆ బ్యాచ్ కుటుంబ సమేతంగా ఎంతో సందడి చేశారు. వారికి పాఠాలు చెప్పిన అప్పటి అధ్యాపకులు డాక్టర్ పైడిపాల, కనకరాజు, వక్కలంక కృష్ణమోహన్ తదితరులను సాదరంగా ఆహ్వానించి పాదాభివందనాలు చేసి సన్మానించారు. పూర్వపు విద్యార్థులు మున్సిపల్ కౌన్సిలర్ గొవ్వాల రాజేష్, పిండి శేషు, నల్లా శ్రీధర్, సాపే శ్రీనివాస్ (హైదరాబాద్), కుమారి (గుజరాత్), చొల్లంగి సుబ్బిరామ్ తదితరులు పూర్వపు విద్యార్థులను సమీకరించి ఈ వేడుకకు ఏర్పాటుచేశారు. చివరగా తమ జ్ఞాపకాలను వారు పదిలం చేసుకుంటూ గ్రూప్ ఫోటో దిగారు. -
4న ఈసీతో విపక్షాల భేటీ
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) వినియోగంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యాయి. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై విస్తృతంగా చర్చించాం. అలాగే దేశంలో నిరుద్యోగిత, వ్యవసాయం, రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలపై దాడిపై మరింత లోతుగా చర్చించేందుకు అన్నిపక్షాలు అంగీకరించాయి. ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ నెల 4న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకుని తమ అభ్యంతరాలు, ఆందోళనల్ని తెలియజేస్తాయి’ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శరద్ పవార్(ఎన్సీపీ), ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), రామ్‌గోపాల్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ), సతీశ్‌చంద్ర మిశ్రా(బీఎస్పీ), కనిమొళి(డీఎంకే), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ), డి.రాజా(సీపీఐ), టీకే రంగరాజన్(సీపీఎం), జయంత్ చౌదరి(ఆర్జేడీ)తో పాటు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ పాల్గొన్నారు. -
ఆర్ఎస్ఎస్ అధినేతతో అమిత్ చర్చలు
అహ్మదాబాద్: రామ మందిర నిర్మాణం విషయమై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తదితరులతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా భేటీ అయ్యారు. రాజస్తాన్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఆర్ష విద్యామందిర్‌లో రెండు రోజులపాటు జరిగిన హిందూ ఆచార్య సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్‌తోపాటు సాధువులు పాల్గొన్నారు. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఆలయం నిర్మించే విషయంలో వేర్వేరు పరిష్కారాలను ఈ సమావేశంలో చర్చించినట్లు పాల్గొన్న నాయకులు తెలిపారు. ప్రధాని మోదీ పదవీ కాలం ముగిసేలోగా అంటే, మే 2019కు ముందుగానే రామాలయ నిర్మాణం చేపట్టాలనే మెజారిటీ అభిప్రాయం ఈ సభలో వ్యక్తమయిందని సమాచారం. అయోధ్యలో మందిరం నిర్మించటం ఖాయమని ఈ సందర్భంగా అమిత్‌షా వారికి హామీ ఇచ్చారు. జనవరిలో సుప్రీంకోర్టులో అయోధ్య అంశం విచారణకు రానున్న విషయాన్ని కూడా వారితో అమిత్‌షా చర్చించారు. వచ్చే రెండు లేక మూడు నెలల్లో బీజేపీ ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు జోథ్‌పూర్‌కు చెందిన ఆచార్య సత్‌గిరి మహారాజ్ తెలిపారు. ఆలయ నిర్మాణ స్థలాన్ని పొందే విషయంలో అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి విలేకరులకు తెలిపారు. అయితే, సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడు ప్రారంభమయ్యేదీ తెలియదన్నారు. రామాలయం విషయంలో హిందూ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్న ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ బీజేపీ ఆలయం కోసం చట్టంపై ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు. -
అందుకే... నువ్వంటే నాకిష్టం!
కొన్ని రోజులుగా శ్రుతీహాసన్ కాస్త మూడీగా ఉంటున్నారు. పనులన్నీ చేస్తూనే ఉన్నారు. అందరితో బాగానే ఉంటున్నారు. కానీ ఎక్కడో ఏదో చిన్న లోటు. కారణం.. మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్ గురించి తెలిసినవాళ్లకు మైఖేల్ పరిచయం లేని పేరు. ఆమె భాషలో చెబితే అతను శ్రుతీ బెస్ట్ ఫ్రెండ్... మన భాషలో చెప్పుకుంటే బాయ్‌ఫ్రెండ్. లండన్‌లో ఉండే థియేటర్ ఆర్టిస్ట్ కోర్సలే. కొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ మధ్యలో వీళ్లిద్దరూ కలుసుకోవడం కుదర్లేదు. టీవీ షో చేస్తూ చెన్నైలో బిజీ బిజీగా గడిపారు శ్రుతీ. దాంతో ఇద్దరికీ మిస్సింగ్ మిస్సింగ్ అయింది. ప్రేమ భాషలో చెప్పాలంటే విరహం. మ్యూజిక్ వర్క్ మీద లాస్ ఏంజెల్స్ వెళ్లారు శ్రుతీ. అక్కడ మైఖేల్‌ను చాలా రోజుల తర్వాత కలిశారు. ఇంకేముంది అవధుల్లేని ఆనందం వచ్చేసింది శ్రుతీకి. ఆ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘నువ్వు నన్ను బాగా నవ్విస్తావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. చాలా రోజుల తర్వాత నా ప్రియమైన వ్యక్తిని కలిశాను’’ అంటూ సెల్ఫీని పోస్ట్ చేశారు శ్రుతి. -
కొంచెం కనికరించండి..!
ముంబై: ఆర్బీఐ నూతన గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ముంబైలో ప్రభుత్వరంగ బ్యాంకుల సారథులతో భేటీ అయ్యారు. అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ అనుసరిస్తున్న కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ), రుణ చెల్లింపుల్లో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా వర్గీకరించడమనే నిబంధనలను సడలించాలని ఈ సందర్భంగా ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులు కోరారు. అలాగే, బ్యాంకులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై దాస్తోపాటు ఆర్బీఐకి చెందిన నలుగురు డిప్యూటీ గవర్నర్లు చర్చించారు. వీటిల్లో ద్రవ్య లభ్యత, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం వంటి అంశాలున్నాయి. ఎస్బీఐ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీసీఏ నిబంధనలను సరళించాలని గవర్నర్‌ను కోరినట్టు వీరు తెలిపారు. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకోలేక, ఎన్పీఏలు భారీగా పెరిగిపోయిన ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్బీఐ పీసీఏ పరిధిలోకి తీసుకొచ్చి కఠినంగా వ్యవహరిస్తోంది. 21 ప్రభుత్వరంగ బ్యాంకులకు 11 బ్యాంకులు పీసీఏ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడంపై ఆంక్షలు అమలవుతున్నాయి. కాగా, నియంత్రణ సంస్థ, బ్యాంకుల మధ్య చర్చలకు వీలు కల్పించడమే ఈ సమావేశం ఉద్దేశమని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా మీడియాకు తెలిపారు. దాస్‌కు నేడే తొలి పరీక్ష! గవర్నర్‌గా తొలి బోర్డు సమావేశం నేడు న్యూఢిల్లీ: నూతన గవర్నర్ శక్తికాంత్‌దాస్ ఆధ్వర్యంలో ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం సమావేశం కాబోతుంది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియపై డైరెక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదురుకానున్నాయి. నవంబరు 19న జరిగిన గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిపై సమీక్ష జరగనుంది. డీమోనిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాల కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)కు ఉపశమనం కల్పించే చర్యలు, ఆర్బీఐ విధాన నిర్ణయాల్లో సెంట్రల్ బోర్డు పాత్రపైనా చర్చ జరగనుంది. ప్రస్తుత నిర్మాణంలో, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం అవుతోంది. ప్రభుత్వ ప్రాతినిధ్యం కూడా ఉన్న బోర్డును ఆర్బీఐ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ భాగస్వామిని చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఒక్కరోజు రుణ చెల్లింపుల్లో విఫలమైనా దాన్ని ఎన్పీఏగా వర్గీకరించడం వంటి ఎన్నో కీలక అంశాల్లో ప్రస్తుతం బోర్డు జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయితే, ఆర్బీఐ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం కావాలని, ఆర్బీఐ స్వతంత్రత, స్వయంప్రతిపత్తిని కాపాడాలన్నది మాజీ గవర్నర్లు, నిపుణుల అభిప్రాయం. ఆర్బీఐ స్వతంత్రతను, విశ్వసనీయతను తాను కాపాడతానని గవర్నర్ బాధ్యతల తర్వాత దాస్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను సమయానుకూలంగా పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డుకు గవర్నర్ అధిపతిగా వ్యవహరిస్తారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, 11 ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రెండోరోజే ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో దాస్ సమావేశం కాగా, మూడో రోజు ఆర్బీఐ బోర్డు కీలక సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వానికి ఆర్బీఐ మద్దతివ్వాలి ఏ సంస్థనూ నిర్వీర్యం చేయలేదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబై: ఆర్బీఐని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం చేయబోదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆర్బీఐ ప్రభుత్వంలో ఒక భాగమని, అది ప్రభుత్వ ఆర్థిక విధానానికి మద్దతుగా నిలవాలని అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదాల వల్ల ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన నేపథ్యంలో మంత్రి గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉర్జిత్ పటేల్ స్థానంలో శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బ్యాంకు స్వతంత్ర సంస్థగానే పనిచేయాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలకు కూడా మద్దతు నివ్వాలన్న అభిప్రాయాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. ఏ విధంగానూ సెంట్రల్ బ్యాంకును తాము దెబ్బతీయలేదన్నారు. దేశం కోసం ఆర్థిక మంత్రి ఓ విధానాన్ని ప్రతిపాదిస్తే దానికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఆర్బీఐపై లేదా? అని గడ్కరీ ప్రశ్నించారు. ‘‘ఎక్కడైనా ఎగుడుదిగుళ్లు సహజమే. ఏ సంస్థనూ మేం నిర్వీర్యం చేయలేదు. ఆర్బీఐ నిర్వహణలో మేమేమీ రాజకీయంగా జోక్యం చేసుకోలేదు. పారదర్శకమైన, అవినీతి రహిత వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంది. వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు తోడు, ప్రభుత్వ నిర్ణయాలకు ప్రతీ సంస్థ కట్టుబడాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఒకవేళ ఆర్బీఐ పూర్తి సర్వస్వతంత్రంగా ఉండాలనుకుంటే, ఆర్థిక అనారోగ్యానికి అదే బాధ్యత వహించాలని, ఆర్థిక శాఖ కాదని చెప్పారాయన. ‘‘ఒకవైపు ఆర్థిక వ్యవస్థలో అనారోగ్యాలకు బాధ్యత మాదంటారు. దాంతో మేము నిర్ణయాలు తీసుకుంటే ఆర్బీఐ స్వతంత్రత ప్రమాదంలో పడిందంటారు’’ అని గడ్కరీ పేర్కొన్నారు. మాల్యాకు మద్దతు! వ్యాపారంలో ఎత్తు పల్లాలు ఉంటాయని, అది బ్యాంకింగ్ అయినా, బీమా అయినా తప్పిదాలు జరిగితే క్షమించి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఓ కంపెనీ వ్యాపార పరంగా గడ్డు పరిస్థితుల్లోకి వెళితే ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాలా కాలం క్రితం మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ సికామ్ విజయ్ మాల్యాకు రుణం ఇచ్చిందని, మాల్యా దానికి 40 ఏళ్ల పాటు వడ్డీ కట్టారని చెప్పారు. ‘‘ఒక వ్యక్తి రుణానికి 40 ఏళ్లు చెల్లింపులు చేసి, ఆ తర్వాత ఏవో కారణాల వల్ల రుణ చెల్లింపులు చేయలేకపోతే అతన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారు అని నిర్ధారించడం సరికాదన్నారు. ‘‘నీరవ్‌మోదీ లేదా విజయ్ మాల్యా మోసానికి పాల్పడితే వారిని జైలుకు పంపించాలి. కానీ, ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రతీ ఒక్కరినీ మోసగాళ్లుగా చిత్రీకరిస్తే ఆ ఆర్థిక వ్యవస్థ పురోగతి చెందలేదు’’ అని గడ్కరీ అభిప్రాయపడ్డారు. -
జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసిన ఉండవల్లి
రఘుదేవపురం (సీతానగరం) : రఘుదేవవురం పంచాయతీ శ్రీరామనగరంలోని శ్రీ చిట్టిబాబాజీ సంస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థానంలో జస్టిస్ చలమేశ్వర్, లక్ష్మి దంపతులు శాంతిహోమం, గోపూజ, సువర్చలా సమేత హనుమద్ర్వతం, చిట్టిబాబాజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఉండవల్లి కలిశారు. జస్టిస్ చలమేశ్వర్‌కు మాజీ ఎంపీని సంస్థానం నిర్వాహకుడు జగ్గబాబు పరిచయం చేశారు. అనంతరం ఉండవల్లి శ్రీ చిట్టిబాబాజీని దర్శించారు.