
అమిత్‌షా
అహ్మదాబాద్: రామ మందిర నిర్మాణం విషయమై ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ తదితరులతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా భేటీ అయ్యారు. రాజస్తాన్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఆర్ష విద్యామందిర్‌లో రెండు రోజులపాటు జరిగిన హిందూ ఆచార్య సభలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్‌తోపాటు సాధువులు పాల్గొన్నారు. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఆలయం నిర్మించే విషయంలో వేర్వేరు పరిష్కారాలను ఈ సమావేశంలో చర్చించినట్లు పాల్గొన్న నాయకులు తెలిపారు.
ప్రధాని మోదీ పదవీ కాలం ముగిసేలోగా అంటే, మే 2019కు ముందుగానే రామాలయ నిర్మాణం చేపట్టాలనే మెజారిటీ అభిప్రాయం ఈ సభలో వ్యక్తమయిందని సమాచారం. అయోధ్యలో మందిరం నిర్మించటం ఖాయమని ఈ సందర్భంగా అమిత్‌షా వారికి హామీ ఇచ్చారు. జనవరిలో సుప్రీంకోర్టులో అయోధ్య అంశం విచారణకు రానున్న విషయాన్ని కూడా వారితో అమిత్‌షా చర్చించారు. వచ్చే రెండు లేక మూడు నెలల్లో బీజేపీ ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు జోథ్‌పూర్‌కు చెందిన ఆచార్య సత్‌గిరి మహారాజ్ తెలిపారు.
ఆలయ నిర్మాణ స్థలాన్ని పొందే విషయంలో అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి విలేకరులకు తెలిపారు. అయితే, సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడు ప్రారంభమయ్యేదీ తెలియదన్నారు. రామాలయం విషయంలో హిందూ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్న ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ బీజేపీ ఆలయం కోసం చట్టంపై ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment